-జిల్లాలో విచ్ఛలవిడిగా నాసిరకం మద్యం... -బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపుల్లో కల్తీ లిక్కర్... -ఎమ్మార్పీకి మంగళం, అధిక ధరలకు విక్ర...
-జిల్లాలో విచ్ఛలవిడిగా నాసిరకం మద్యం...
-బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపుల్లో కల్తీ లిక్కర్...
-ఎమ్మార్పీకి మంగళం, అధిక ధరలకు విక్రయం
-వ్యాపారుల లైసెన్స్‌కు నాలుగు నెలలే గడువు
-మందు బాబులను అడ్డంగా దోచుకుంటున్న వైనం
-మత్తువీడని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు
-బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపుల్లో కల్తీ లిక్కర్...
-ఎమ్మార్పీకి మంగళం, అధిక ధరలకు విక్రయం
-వ్యాపారుల లైసెన్స్‌కు నాలుగు నెలలే గడువు
-మందు బాబులను అడ్డంగా దోచుకుంటున్న వైనం
-మత్తువీడని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు
ఖమ్మం:ఇటీవల కాలంలో పండుగైనా, పబ్బమైనా, విషాదమైనా, సంతోషమైనా ప్రతీది మద్యంతోనే ముడిపడి పోతోంది. మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఇరవై నుంచి ఆపైన వయస్సు కలిగిన పురుషుల్లో సగం మంది మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. ఇదేఅదనుగా భావిస్తున్న జిల్లాలోని మద్యం వ్యాపారులు అక్రమార్జనే ధ్యేయంగా లిక్కర్‌ను కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా మద్యం దుకాణాల లైసెన్స్ అనుమతి గడువు కేవలం నాలుగు నెలలే ఉండటంతో ఎమ్మార్పీకి మంగళం పాడేశారు. అధిక ధరలకు విక్రయిస్తూ మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటం లేదు. జిల్లాలో మద్యం విక్రయాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అన్ని మద్యం దుకాణాల్లో కలిపి అధికారికంగానే రోజుకు సరాసరి కోటి రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇక పండుగలు, ఇతర చెప్పుకోదగ్గ రోజుల్లో అదనంగా మరో కోటి రూపాయల వ్యాపారం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాగా మద్యం విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో, అంతే స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న లిక్కర్ వ్యాపారులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా లిక్కర్‌ను కల్తీ చేస్తూ తాగేవారికి కిక్కులేకుండా చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రధాన బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపులు, గ్రామాల్లోని బెల్టు షాపుల్లో కల్తీ ప్రక్రియ మూడు పువ్వులు ఆరు కాయలు గా విరాజిల్లుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కల్తీకి ప్రత్యేక సిబ్భంది నియామకం... ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముంపు మండలాలను మినహాయిస్తే మొత్తం 142 మద్యం దుకాణాలు, 44 బార్ అండ్ రెస్టారెంట్స్, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం రెస్టారెంట్స్, వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. మద్యం కల్తీకి పలువురు యాజమాన్యాలు నిఫుణులైన కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. వీరు రాత్రి బార్‌లు, మద్యం దుకాణాలు బంద్ చేసిన తర్వాత, ఉదయం పది గంటల్లోపు డ్యూటీల్లో చేరుతుంటారు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా, వేసిన సీల్ వేసినట్లే ఉంచి సిరంజిలు, ఇతర సాధనాలను ఉపయోగించి మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. ఖరీదైన మద్యంలో తక్కువ ధరకు వచ్చే లిక్కర్‌ను, కొన్నిట్లో ఒకరకమైన రంగు నీళ్లను కలుపుతూ మందుబాబుల జేబులను కొల్లగొడుతున్నారు. తద్వారా వారి ఆరోగ్యంతో కూడా ఆటలాడుకుంటున్నారు. ఈ ప్రక్రియ జిల్లా కేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గాల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాపులు, గ్రామాల్లోని బెల్టు షాపుల్లో జోరుగా సాగుతుంది. ఇటీవల కాలంలో ఖమ్మం నగరంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ విషయమై పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది. లూజ్ విక్రయాల్లో భారీగా కల్తీ... బార్ అండ్ రెస్టారెంట్స్‌లో మద్యాన్ని విడిగా విక్రయిస్తుంటారు. ఎంతటి ఖరీదైన మద్యానికైనా బాటిల్స్ ఉండవు. పెగ్గుల లెక్కనే మద్యం పోస్తారు. దీంతో రెస్టారెంట్స్ యాజమాన్యాలు మద్యాన్ని సులువుగా కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వైన్ షాపుల్లో కూడా కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో లూజ్ విక్రయాలు చేయకూడదు. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాల్లో లూజ్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీనికి కారణం రాష్ట్ర విభజనకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైన్ షాపుల అనుమతులను కాసింత సడలించింది. దుకాణం పక్కనే ఓ గదిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో బాటిల్స్ ప్రకారం విక్రయాలు జరపాల్సిన మద్యం దుకాణాల్లో వ్యాపారులు లూజ్ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో బాటిల్స్‌కు ఉన్న సీల్స్‌ను తొలగించి, మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు తదితర కేంద్రాల్లో కొందరు కల్తీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. నాసిరకం మందును ఖరీదైన మద్యం బాటిళ్లలో నింపి వాటిని నేరుగా బార్ అండ్ రెస్టారెంట్స్‌కు, వైన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు వినికిడి. ఎమ్మార్పీకి మంగళం... వైన్ షాపులైనా, బార్ అండ్ రెస్టారెంట్స్ అయినా మద్యాన్ని ప్రభుత్వ నిర్ణీత ధరలకే విక్రయించాలన్నది నిబంధన. ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే వాటి లైసెన్స్‌ను రద్దు పర్చడమేకాకుండా సదరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి. కానీ జిల్లాలోని మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి ఎమ్మార్పీ విధానానికి మంగళం పాడేశారు. వైన్ షాపుల్లో క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 నుంచి రూ. 20లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్స్‌లో అయితే నిర్ణీత ధరకంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. అదేమంటే మాకు ఎమ్మార్పీతో సంబంధం లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చని ఎక్సైజ్ అధికారులే అనుమతి ఇచ్చారని మాట్లాడుతుండటం విశేషం. ఈ క్రమంలోనే జిల్లాలోని 142 మద్యం దుకాణాలకు, 44 బార్ అండ్ రెస్టారెంట్స్‌కు, మరో మూడు క్లబ్బుల్లో నడుస్తున్న మద్యం విక్రయాల లైసెన్స్‌కు కేవలం నాలుగు నెలలే గడువు మిగిలి ఉంది. వచ్చే జూన్, జులై నెలల్లో కాలపరిమితి ముగుస్తుంది. దీంతో మద్యం వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ మారు మద్యం దుకాణాల లైసెన్స్ జారీలో తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తున్న నేపథ్యంలో తమకు అవకాశం వస్తుందో, రాదోనన్న భావనతో అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వ్యవహరిస్తూ మందు బాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. మత్తు వీడని ఎక్సైజ్ యంత్రాంగం... ఖమ్మంలో గత కొంత కాలంగా కల్తీ మద్యం రాకెట్ జోరుగా సాగుతున్నా జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటం లేదు. ప్రభుత్వ నిబంధనలన్నింటినీ పాతరేసి వైన్ షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నా, మందుబాబుల జేబులు గుల్లవుతున్నా, వారి ఆరోగ్యం పాడవుతున్నా చూసీచూడనట్లు పోతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు అదనంగా మద్యం అమ్ముతున్నా, ఇదే విషయమై ఎవరైనా ఆ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. మద్యం అక్రమాలపై నమస్తే తెలంగాణ ఆరాతీయగా అలాంటిదేమీ తమ దృషికి రాలేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ తంతు వెనుక పెద్దమొత్తంలో చేతులు మారుతున్నట్లు, యంత్రాంగానికి నెలవారీగా ముడుపులు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాలుగేళ్ల క్రితం మద్యం ముడుపుల వ్యవహారంలో అప్పట్లో పనిచేసిన కొందరు జిల్లా ఎక్సైజ్ అధికారులు జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఆ విషయాన్ని మరచి, పాత పద్ధతిలోనే ఉద్యోగం వెళగబెడితే పరిస్థితులు ఎటు దారితీస్తాయోనని అదేశాఖలో పనిచేస్తున్న పలువురు కిందిస్థాయి సిబ్బంది భయపడుతున్నారు.
