-రెట్టింపు ధరలకు మందుల విక్రయం -కొనడం లేదంటూ జనరిక్ మెడికల్ షాప్ మూసివేత -బ్రాండెడ్ మందుల ప్రిస్క్రిప్షన్ రాయిస్తూ కార్పొరేట్ దందా ...
-రెట్టింపు ధరలకు మందుల విక్రయం
-కొనడం లేదంటూ జనరిక్ మెడికల్ షాప్ మూసివేత
-బ్రాండెడ్ మందుల ప్రిస్క్రిప్షన్ రాయిస్తూ కార్పొరేట్ దందా
ధనార్జనకు కాదేది అనర్హం అన్నట్టు నిమ్స్ ఆస్పత్రి తయారైంది. అక్కడ పేద రోగాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో విక్రయిస్తున్న మందుల ధరలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు బయటి మార్కెట్లో ఐదు రూపాయలకు లభించే మందులు అక్కడ పది రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వారి మందులను అమ్ముకునే నేపథ్యంలో జనరిక్ మందులను ఇక్కడి వైద్యులు రిఫర్ చేయకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న జనఔషధ్ (జనరిక్ మెడికల్ షాపు) మూతపడింది.... కాదుకాదు మూతపడేట్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత్యంతరం లేక ఆస్పత్రిలో అధిక ధరలకు లభించే మందులను కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం సంపాదన మందులకే..
రాష్ట్రంలోని అన్ని బోధన, ప్రధాన ఆస్పత్రులతో పాటు ఏరియా ఆస్పత్రుల్లోనూ జనరిక్ మందుల దుకాణాలు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీజనల్‌గా వచ్చే వ్యాధులతో పాటు రకరకాల కొత్త వైరస్ల కారణంగా సరికొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ బయోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కిందట నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని మధ్య తరగతి కుటుంబం నెలకు తన సంపాదనలో 50 శాతానికి పైగా మందుల కోసం ఖర్చు చేస్తున్నట్లు తేల్చింది. అందుకు కారణం బ్రాండెడ్ మందులు కొనుగోలు చేయడమే. కానీ, అదే జనరిక్ మందులైతే బ్రాండెడ్ కంటే 60 నుంచి 80 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. అదే నాణ్యత, పనితీరులో కూడా ఏమాత్రం మార్పు లేదని పలు అధ్యయన సంస్థలు జనరిక్ మందులకు కితాబు ఇచ్చాయి. వెయ్యి రూపాయలకు లభించే బ్రాండెడ్ మందులు జనరిక్‌లో కేవలం రూ. 200 నుంచి రూ. 400 దొరుకుతాయి.
అంటే ఆరు వందల రూపాయలు అదా అవుతాయి. తద్వారా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్య తరగతి రోగులకు రూ. కోట్లల్లో ఆదా అయ్యే అవకాశముంది. మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు ఉన్న వ్యక్తుల కుటుంబంలోనైతే జనరిక్ మందుల వినియోగం వల్ల నెలకు కనీసంగా రూ. 2 వేల వరకు ఆదా అయ్యే అవకాశముంది. ఉస్మానియా, గాంధీతోపాటు గత నిమ్స్‌లో కూడా కొనసాగిన జనరిక్ మందుల షాపు గత జూన్‌లో మూతపడింది.
మూతపడేలా చేశారు..?
నిమ్స్‌లో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను మూసివేసి, ప్రస్తుతం నిమ్స్ వర్గాలే మెడికల్ షాపులను నిర్వహిస్తున్నాయి. అదేదో రోగులకు మేలు చేసేందుకు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రి నిర్వహిస్తున్న మందులు మార్కెట్లోని మెడికల్ షాపులో లభించే రేటు కంటే రెట్టింపు ధరలో ఉండడం వారి ధనార్జనకు నిదర్శనం. ఇదిలా ఉండగా అక్కడ చికిత్స నిర్వహించే వైద్యులు బ్రాండెడ్ మందులనే రాయడం.. జనరిక్ మందులను పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న జనరిక్ మందుల షాపు మూతపడింది. అయితే, ఆ షాపును ఆస్పత్రి వర్గాలే పథకం ప్రకారం మూతపడేటట్లు చేశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, నిమ్స్ వర్గాలు మాత్రం జనరిక్ మందులను రోగులు కొనకపోవడం వల్ల నిర్వాహకులే షాపు నడపడానికి ముందుకు రావడం లేదని ఖండిస్తున్నాయి. కారణాలేవైనా రోగులను జనరిక్ వైపు మళ్లించే బాధ్యత వైద్యులపై ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంటే నిమ్స్‌లో చికిత్స నిర్వహించే వైద్యులు మెడికల్ ప్రిస్కిప్షన్‌లో జనరిక్ మందులను రాయాల్సి ఉందన్నమాట.
ధర చూస్తే బెంబేలే..!
జనరిక్ మాట దేవుడెరుగు.. బ్రాండెడ్ మందులను కూడా మార్కెట్ ధరలకంటే అధిక రేటుకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ, ఎయిడెడ్ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు ఇస్తారు. కనీసం మార్కెట్ కంటే తక్కువ ధరకు మందులను విక్రయించాలి. అదీ కాదంటే మార్కెట్ ధర ప్రకారం విక్రయించాలి. కానీ, నిమ్స్‌లో మాత్రం మందులతో వ్యాపారం చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. బ్రాండెడ్ మందులను మార్కెట్లో లభించే ధరకంటే ఆస్పత్రిలోనే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోచుకున్నట్లే ఇక్కడ కూడా దండుకుంటున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్నిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.