- నోటిఫికేషన్లు ఇచ్చే జిమ్మేదారి మాదే - త్వరలోనే నియామక ప్రకటనలు - రోస్టర్, ఆర్వోఆర్ ఆధారంగానే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ...
- నోటిఫికేషన్లు ఇచ్చే జిమ్మేదారి మాదే
- త్వరలోనే నియామక ప్రకటనలు
- రోస్టర్, ఆర్వోఆర్ ఆధారంగానే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, : రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామక ప్రకటనలకు ఇప్పటివరకున్న అడ్డంకులు మొత్తం తొలగిపోయాయని, అందుకు కావాల్సిన జీవోలు ఇచ్చామని, త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతాయని, ఆ జిమ్మేదారీ(బాధ్యత) తమదేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో 1,07,744 ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయని, వాటిని స్థానిక, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలలో గుర్తించామని తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేస్తామని ఎన్నికలసమయంలో వాగ్దానం చేశామని, దీనికి సంబంధించిన ఫైల్ తనవద్దే ఉందని వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా 23 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ఈ అంశంపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఈటల సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కొత్త నియామకాలపై నిషేధం విధించిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశా మని చెప్పారు. జనవరిలో 127 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర పోస్టులకు సంబంధించిన అంశం కమల్‌నాథన్ కమిటీ పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణలో మొత్తంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీచేసే ఉద్యోగాలు 55,878, డైరెక్టు ప్రమోషన్లమీద 23,730, నాలుగో తరగతి ఖాళీలు 12,617, హానరోరియం ద్వారా భర్తీ చేసేవి 4,986,పూర్తిగా ప్రమోషన్ల ఆధారంగానే భర్తీ అయ్యేవి 9,517, మరో 1,016 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
త్వరలో 18,616 పోస్టులు భర్తీ చేయబోతున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారంగానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అందరూ అంగీకరిస్తే వయో పరిమితిని పదేండ్లకు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని, సీఎం కూడా ఇందుకు సుముఖంగానేఉన్నారని తెలిపారు. ఈ సమయంలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను మోసం చేస్తున్నదని, వారు 2.20లక్షలు ఉన్నారని చెప్పారు. మంత్రి హరీశ్ కల్పించుకుంటూ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నడూ చెప్పలేదని, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగానే చేస్తామనిస్పష్టంచేశారు.
ఉద్యోగ నియామకాల భర్తీకి, కమల్‌నాథన్ కమిటీకి లింకే లేదని లక్ష్మణ్(బీజేపీ) అన్నారు. కమల్‌నాథన్ కమటీ అన్ని పోస్టులను పర్యవేక్షిస్తుందా? లేక రాష్ట్రస్థాయి పోస్టుల అంశాన్నే పరిశీలిస్తుందా అని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక శాఖద్వారా కొత్త ఉద్యోగాల భర్తీకి ఆస్కారం ఉందని, గువ్వల బాలరాజు (టీఆర్ఎస్) చెప్పారు. సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని సున్నం రాజయ్య(సీపీఎం) కోరారు. గిరిజనుల కోసం ఏజెన్సీ డీఎస్సీ వేయాలన్నారు. విద్యాశాఖలో పోస్టుల భర్తీకి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని చిన్నారెడ్డి (కాంగ్రెస్) కోరారు.
ప్రమోషన్లకు లైన్ క్లియర్
అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ ఉద్యోగ నియమకాలకు, పదోన్నతులకు ఆటంకాలు లేకుండా చేశామని చెప్పారు. తెలంగాణలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 2,11,336 మంది కాగా , ఖాళీలు 58,878 అని చెప్పారు.
ప్రమోషన్లు, డైరెక్టు రిక్రూట్మెంట్ విధానంలో ఉద్యోగాల సంఖ్య 1,12,551 కాగా, ఖాళీలు 22,730, డైరెక్టు రిక్రూట్మెంట్ ఉద్యోగాలు 46,323 కాగా ఖాళీలు 9,577, నాలుగో తరగతి పోస్టులు 41,264 కాగా ఖాళీలు 12,614 ఉన్నా యని తెలిపారు. కాంట్రాక్టు విభాగంలో 25,589 మంది, అవుట్ సోర్సింగ్‌లో 20,017 మంది ఉన్నారనితెలిపారు. తెలంగాణలో 20లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారి ఉపాధికి కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదాని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర తమకే తెలుసునని, ఉస్మానియా వర్సిటీకి వెళ్లి వారితో కదంకదం కలిపినామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థకు ఆద్యుడు చంద్రబాబునాయుడని విమర్శించారు. ముస్లింలకు ఇప్పుడున్న 4% రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు.
త్వరలోనే సింగరేణిని విస్తరించి మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని హరీశ్ చెప్పారు. మంత్రుల సమాధానాలతో సంతృప్తి చెందని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఐఏఎస్‌ల విభజన జరిగి వారం రోజులే అయిందని, టీస్పీఎస్సీకి కూడా ఒక ఐఏఎస్‌ను ఇవ్వలేకపోయామని అన్నారు. వెంటనే ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తామని చెప్పారు. అనంతరం అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తమ పార్టీ ఉద్యోగాల భర్తీకి వ్యతిరేకం కాదని, కానీ ఒక విధానం తీసుకోవాలని అన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి అసెంబ్లీలో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఎంతో తెలుసా అని అన్నారు. చివరగా మంత్రి ఈటల రాజేందర్ మారోసారి మాట్లాడుతూ ఉద్యోగ పరీక్షలు ఉర్దూ భాషలో కూడా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
తడ్కపల్లి, పాములపర్తి నిర్వాసితులకు భారీ పరిహారం
హైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తడ్కపల్లి, పాములపర్తిలో రిజర్వాయర్లు కడుతున్నారని, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ వారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ అతి తక్కువ గ్రామాల ముంపుతో ఈ ప్రాజెక్టులు కడుతున్నామని అన్నారు. ప్రాజెక్టు కంటే ముందే నిర్వాసితులకు ప్యాకేజీ ఇస్తామని, ముంపు బాధితుల్లోని ప్రతి మేజర్‌కు రూ.5 లక్షల పరిహారం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, 20 సంవత్సరాల వరకు పెన్షన్ కానీ ఇస్తామని తెలిపారు.
Key Tags
Jobs Soon, recruitment , advertising , Finance Minister , Rajinder itala , Minister Harish rao ,