* హైదరాబాద్‌లో బస్తీల దుస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన * 330 విభాగాలుగా బస్తీల విభజన * సీఎస్‌తో సహా అధికారులంతా అక్కడే * ఒక్కొక్కర...

* 330 విభాగాలుగా బస్తీల విభజన
* సీఎస్‌తో సహా అధికారులంతా అక్కడే
* ఒక్కొక్కరికీ ఒక్కో బస్తీ బాధ్యత అప్పగింత
* నేనూ ఒక బస్తీని దత్తత తీసుకుంటా
* మమతానగర్, వెంకటరమణ కాలనీల్లో ముఖ్యమంత్రి పర్యటన
* కాలనీ ప్రతినిధులతో కలసి శ్మశానవాటిక వరకూ పాదయాత్ర
హైదరాబాద్: ‘హైదరాబాద్‌ను చూస్తే పైన షేర్వాణీ...లోపల పరేషానీ అన్నట్లుగా ఉంది. ఏ బస్తీలోకి తొంగి చూసినా మురికికూపాలు, చెత్త డంపులే దర్శనమిస్తున్నాయి. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో..మన వీధులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌ను 330 విభాగాలుగా విభజిస్తాం. చీఫ్ సెక్రటరీతో సహా అధికారులందరికి ఒక్కో బస్తీ బాధ్యతను అప్పగిస్తాం. నేను కూడా ఓ బస్తీని దత్తత తీసుకుంటాను. బస్తీ సమస్యలపై అంతా కలసిక ట్టుగా పోరాడదాం. ప్రతి బస్తీని కూకట్పల్లి సమీపంలోని ప్రగతి నగర్లా తీర్చిదిద్దుకుందాం’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం ఆయన ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ మమతానగర్‌లో సైబరాబాద్ పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ ప్రాజెక్టు (కాలనీలో సీసీ కెమెరాలు)ను ప్రారంభించారు.
అంతకు ముందు కాలనీ పార్కులో మొక్కలు నాటారు. ఆ తర్వాత వెంకటరమణ కాలనీని సందర్శించారు. అనంతరం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్థానిక నేతలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలసి వీధుల్లో నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని శ్మశానవాటికను సందర్శించారు. అక్కడి నుంచి బి.కె.రెడ్డి నగర్ పార్కులో కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. కాలనీలో సీసీ రోడ్లు, 500 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతోపాటు శ్మశానవాటికను సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
చెప్పినట్టే మళ్లీ వచ్చా: ఇటీవల స్థానిక శుభం కన్వెన్షన్‌లో ఓ వివాహానికి హాజరై మమతానగర్ నుంచి తిరిగి వెళ్తున్నా.. కాలనీలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి కన్పించింది. ఓ కూడలి వద్ద కొంతమంది మహిళలు గుమిగూడారు. ఇది గమనించి కారు దిగి ఈ దుస్థితికి కారణం ఏమిటని వారిని ప్రశ్నిస్తే కాలనీకి పారిశుద్ధ్య సిబ్బంది రాకపోవడమే ఇందుకు కారణమని వారు చెప్పారు. నేను వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతో మాట్లాడాను. నేను మళ్లీ వచ్చే వరకు కాలనీలో పారిశుద్ధ్యం మెరుగుపడటంతోపాటు శాంతిభద్రతల కోసం చర్యలు చేపట్టాల్సిందిగా సూచించాను. చెప్పినట్టే మళ్లీ మీ దగ్గరకు వచ్చాను.
ఇంటింటికీ రెండు ప్లాస్టిక్ డబ్బాలు..: ప్రగతినగర్ కాలనీ అభివృద్ధిలో ప్రపంచదేశాలకే ఆదర్శంగా నిలిచింది. కాలనీలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నగరంలోని ప్రతి బస్తీ ప్రగతినగర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. మమతానగర్, వెంకటరమణ కాలనీలలో పారిశుద్ధ్యం మొరుగు కోసం ప్రతి ఇంటికి రెండు (కలర్ల) ప్లాస్టిక్ డస్డ్బిన్లు అందిస్తాం. ఒకదాంట్లో ఇంట్లోని కూరలు తరిగిన వ్యర్థాలు, మరో దాంట్లో ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలి. జీహెచ్ఎంసీ సిబ్బంది వీధి వీధికి వచ్చి చెత్తను సేకరిస్తారు. చైన్‌స్నాచింగ్, ఇతర దొంగతనాలను అరికట్టేందుకు కాలనీవాసులంతా పోలీసులకు సహకరించాలి. ఇంటి యజమానితోపాటు అద్దెకు ఉన్న వారి వివరాలను విధిగా పోలీసులకు అందజేయాలి. కాగా, సీఎం కేసీఆర్ నాగోలులోని శ్మశానవాటికకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఎల్బీనగర్ టీఆర్ఎస్ అడహక్ కమిటీ సభ్యుడు రాంమోహన్‌గౌడ్ ప్రయాణిస్తున్న కారు ఓ బాలుడిని ఢీకొంది. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలవగా స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సీసీ కెమెరాల కోసం రూ.1,000 చందా: బస్తీల అభివృద్ధికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సహకారం అందిస్తాయి. అంతా ప్రభుత్వమే చేయాలంటే కుదరదు. ఎవరో వచ్చి బాగు చేయరు. మన బస్తీలను మనమే బాగు చేసుకోవాలి. అవసరమైతే ఇంటికి రూ.10 చందా వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు నా వంతు చందాగా రూ. 1,000 ఇస్తున్నా. (వేదికపై ఉన్న వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్‌కు సీఎం రూ. వెయ్యి అందించారు) మీరు కూడా మీ వంతు ఆర్థిక సహాయం చేయాలి. ప్రస్తుతం కాలనీలో పారిశుద్ధ్యం మెరుగు కోసం చేపట్టిన చర్యలు, శాంతి భద్రతల పరిస్థితులను సమీక్షించేందుకు ఈసారి ఎవరికీ చెప్పకుండా వస్తా.