(24 Mar) కరీంనగర్, మార్చి 23: సదరం క్యాంపుల ద్వారా డాక్టర్ల సంతకాలతో జారీ చేసిన సర్ట్ఫికేట్లున్న వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామ...
(24 Mar) కరీంనగర్, మార్చి 23: సదరం క్యాంపుల ద్వారా డాక్టర్ల సంతకాలతో జారీ చేసిన సర్ట్ఫికేట్లున్న వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో కలిసి ఆమె 'డయల్ యువర్ కలెక్టర్' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఫోన్ చేసి సదరం క్యాంపులకు హాజరైన, తమకు ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ గత నెలలో నిర్వహించిన సదరం క్యాంపుకు హాజరైన వారికి సర్ట్ఫికేట్లు అప్లోడ్ చేస్తున్నామని, అందులో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఓదెల మండల కేంద్రం నుండి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, బోర్ వేయాలని కోరగా, వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి జిల్లాకు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఆ నిధులతో తాగునీటి అవసరాలు తీరుస్తామని కలెక్టర్ తెలిపారు. వేములవాడ నుండి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి లే-అవుట్లు లేకుండా ప్లాట్లు చేసి ఇండ్ల స్థలాలు అమ్ముతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, తహశీల్దార్‌తో విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెజ్జంకి మండలం నుండి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి నివాస ధ్రువీకరణ పత్రం, కులదృవీకరణ పత్రాలు జారీ చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అన్ని ఆధారాలతో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. వీరితో పాటు మరికొందరు ఫోన్ చేసి వారి వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
