ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో 2019 నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష...
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో 2019 నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవనంలో భట్టీకి అభినందన సభ జరిగింది. డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా విక్రమార్కను గజమాలలతో సత్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తన పదవులు జిల్లా నాయకులు, కార్యకర్తల కృషే తప్ప మరొకటి కాదన్నారు. పదవిగా భావించకుండా బాధ్యతగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో పార్టీని రక్షించుకోవడం కోసం కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అదే సమయంలో మండల, బూత్ స్థాయిలో పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేస్తామని విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు సపర్యలు చేసే అవసరం ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ముందుంటుందన్నారు. అగ్రనేతల అండదండలతో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆరు దశాబ్ధాల నుంచి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను తీర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో ప్రజలకు ఆయనేం మేలు చేశారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, సాగునీరు, కేజీ టూ పీజీ విద్య, రెండు గదుల ఇళ్ల నిర్మాణం వంటి తొమ్మిది హామీలు నెరవేర్చడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దీనిపై అసెంబ్లీలో నిలదీశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, సామాజిక తెలంగాణ నిర్మాణానికి కృషిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి యువతకు ప్రాధాన్యం ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. కేసీఆర్ బెదిరింపులకు తమ కార్యకర్తలు భయపడరని అన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన నేతలకు కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో గుర్తింపు ఇచ్చిందని అన్నారు. జలగం వెంగళరావు, మల్లు అనంతరాములు వంటి నేతలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల త్యాగాలను విస్మరించారని ఆరోపించారు. భద్రాచలం నవమి వేడుకలకు వచ్చిన సీఎం.. గిరిజన ప్రాంత వాసుల గోడును పట్టించుకోలేదని విమర్శించారు. పుణ్యక్షేత్రానికి నిధులు వెచ్చిస్తారని ఆశించినా మొండి చేయి ఇచ్చారన్నారు. ఖమ్మం శాసనభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమైక్యంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, జిల్లా ఇన్‌ఛార్జి డాక్టర్ రమాదేవి, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వగ్గెల మిత్రసేన ప్రసంగించారు. సభలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.కాల్వొడ్డు ప్రాంతం నుంచి భట్టి విక్రమార్క వాహన శ్రేణితో ప్రదర్శనగా సభా వేదికకు వచ్చారు. అడుగడుగునా కార్యకర్తలు పూలు చల్లుతూ, మతాబులు కాల్చుతూ తమ నేతను తోడ్కొని వచ్చారు. డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం అధ్యక్షతన జరిగిన అభినందన సభలో పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు కరాటే రామస్వామి, జావీద్, కొల్లు పద్మ, బాలాజీనాయక్, శ్రీనివాసరెడ్డి, మనోహార్నాయుడు పాల్గొన్నారు.
