మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ఇల్లెందు: పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ, బీజేపీలకు దిమ్మ తిరిగే విధంగా ఉండాల...

మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్
ఇల్లెందు: పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ, బీజేపీలకు దిమ్మ తిరిగే విధంగా ఉండాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు విచ్చేసిన ఆయన జగదాంబా సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల గౌరవ వేతనం పెంపును హర్షిస్తూ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని అన్నారు. 7 మండలాలను తరలించుకుపోయిన చంద్రబాబు, వెంకయ్యనాయుడుతో కలిసి తెలంగాణపై కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. తెలంగాణలో గోదావరి నది ప్రవహిస్తున్నా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు.
కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా టీడీపీ, బీజేపీ యత్నిస్తున్నాయని విమర్శించారు. అంతకు ముందు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో గ్రామీణ డాక్ సేవక్ సమ్మె శిబిరాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్వీ పట్టణ నాయకుడు గుత్తుల దుర్గాప్రసాద్ తల్లిదండ్రులను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ జానీపాషా, కౌన్సిలర్లు విజయలక్ష్మి, సామల రాధాశ్రీ, తుల్సిరాం గౌడ్, కామేపల్లి జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, బయ్యారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ గుగులోతు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా పని చేయండి
టేకులపల్లి : పాత, కొత్త తేడా లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి పనిచేయూలని ఎంపీ సీతారాం నాయక్ సూచించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ లక్ష ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు.
వరంగల్ జిల్లాలో గిరిజన, ఖమ్మం జిల్లా మైనింగ్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో ముఖంలేని టీడీపీ బీజేపీ ముసుగులో ప్రచారంలోకి వచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గోల్యాతండాలోని శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. సమావేశంలో డాక్టర్ శంకర్‌నాయక్, టీ. రవినాయక్, రమేష్, వస్రాం, సర్వర్ పాల్గొన్నారు.