-ఉత్తీర్ణత కోసం పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అడ్డదారులు -పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సాహం -పది రోజుల్లో 657 మంది డిబార్ ...
-పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సాహం
-పది రోజుల్లో 657 మంది డిబార్
-తీవ్రంగా నష్టపోతున్న విద్యార్ధులు
-ఆందోళనలో తల్లిదండ్రులు
ఆదిలాబాద్ రూరల్: కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో డిబారవుతున్నారు. పుట్టగొడగుల్లా వెలిసిన పలు ప్రైవేట్ కళాశాలలు, ఉత్తీర్ణత కోసం అడ్డదారులు తొక్కి, విద్యార్థులను మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ కారణంగానే వందల సంఖ్యలో డిబార్ అవుతున్నారని మండిపడుతున్నారు. 657 మంది డిబార్ ఈనెల 18న ప్రారంభమైన డిగ్రీ వార్షిక పరీక్షల్లో ఎన్నడూ లేనంతగా డిబార్ల సంఖ్య కనిపిస్తున్నది. దీనిని చూసి యూనివర్సీటీ అధికారులే ఆశ్చర్యపడుతున్నారు. విద్యార్థులను డిబార్ చేస్తున్నారే తప్ప అసలు దీనికి కారణమెవరని ఎవరూ ఆలోచించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు సుమారు 200వరకు ఉన్నాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరంలో 2,33,782 మంది వి ద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. యూనివర్సిటీ నుంచి వచ్చిన రెండు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు ఇప్పటివరకు సుమారు 657 మంది విద్యార్థులను మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండ గా పట్టుకుని, డిబార్ చేయడం పరిస్థితికి అద్దం ప డుతున్నది. గతంలో ఎన్నడూ డిగ్రీలో ఇంత భారీ మొత్తంలో విద్యార్థులు డిబారైన దాఖలాలు లేవు. కానరానీ నిబంధనలు? సమైక్య పాలనలో సర్కారు నిబంధనలు తుంగ లో తొక్కి మరీ అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రెండేళ్లలో 50 దాకా కొత్త ప్రైవేట్ కళాశాలలు వెలిశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలాచోట్ల కనీస వసతులు, ల్యాబ్‌లు, బోధకులు కనిపించడం లేదు. కొన్ని చోట్ల కనీస వసతుల్లేకుండా షెటర్లలో నడుపుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతున్నది. కేవలం ఫీజురీయింబర్స్‌మెంట్ కోసమే విద్యార్థులను చేర్చుకుంటూ, వా రు తరగతులకు రాకున్నా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. పలుచోట్ల అసలే బోధకులు లేకపో గా, కొన్నిచోట్ల అర్హత లేని వారితో బోధన చేయిస్తుండగా, విద్యార్థుల చదువుల్లో నాణ్యత లోపిస్తున్నట్ల స్పష్టమవుతున్నది. ఈ కారణంగానే వార్షిక పరీక్షల్లో అడ్డదారులు తొక్కుతున్నారనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఎలాగైనా పాస్ కావాలనే లక్ష్యంగా విద్యార్థులను మాస్‌కాపీయింగ్‌కు ప్రో త్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు పరీక్షా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, సీఎస్‌లను మచ్చిక పలువురు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పట్టించుకోని అధికారులు.. నిజానికి పది, ఇంటర్ పరీక్షల్లో ఎక్కడ మాస్‌కాపీయింగ్ జరిగినా, అక్కడ బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్లను, సీఎస్, డీవోలను సస్పెండ్ చేయడం, లేదా విధుల నుంచి తప్పిస్తున్నారు. కానీ, డిగ్రీ పరీక్షల్లో ఇప్పటి వరకు సుమారు 657 మంది విద్యార్థులు డిబార్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చోద్యం చూస్తున్న అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యలు షురూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ నూతన కళాశాలలకు అనుమతులు ఇవ్వవద్దని నిర్ణయించింది. అంతే కాకుండా డిగ్రీ కళాశాలల్లో వసతులు, లెక్చరర్లు ఉన్నది లేనిది వెబ్సైట్లో పెట్టేలా చూడాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇది సాధ్యమైతే వచ్చే ఏడాది నుంచి ఏఏ కళాశాలల్లో అధ్యాపకులున్నది లేనిది ఇట్టే తెలిసిపోతుంది. దీంతో విద్యార్థులు కూడా తమకు ఇష్టమైన కోర్సుల్లో అధ్యాపకులున్నది లేనిది చూసుకుని కళాశాలల్లో చేరే అవకాశం ఉండడంతో పాటు ప్రమాణాలు పాటించని కళాశాలల గుర్తింపును రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
