-కేంద్రం కోటా నుంచి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 222 మెగావాట్లు -అక్టోబర్- మార్చి మధ్య 374 మెగావాట్లు.. కేంద్ర ఇంధనశాఖ నిర్ణయం -సదరన్ రీజి...
-కేంద్రం కోటా నుంచి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 222 మెగావాట్లు
-అక్టోబర్- మార్చి మధ్య 374 మెగావాట్లు.. కేంద్ర ఇంధనశాఖ నిర్ణయం
-సదరన్ రీజినల్ పవర్ కార్పొరేషన్‌కు చేరిన ఆదేశం
-ఫలించిన సీఎం, టీఆర్ఎస్ ఎంపీల కృషి
న్యూఢిల్లీ/హైదరాబాద్, : విద్యుత్తు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలించింది. రాష్ట్ర అవసరాలకు కేంద్రంనుంచి అదనపు విద్యుత్ లభించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 693 మెగావాట్ల విద్యుత్‌లో తెలంగాణకు ఏప్రిల్‌నుంచి సెప్టెంబర్ దాకా 222 మెగావాట్లు, అక్టోబర్నుంచి మార్చిదాకా 374 మెగావాట్లు కేటాయిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ను సరఫరాకు బెంగళూరులోని సదరన్ రీజినల్ పవర్ కార్పొరేషన్‌ను సోమవారం ఆదేశించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ అండర్ సెక్రటరీ డీ గుహ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ర్టానికి హర్యానాలోని జఝ్జార్ నుంచి వస్తున్న 100 మెగావాట్ల విద్యుత్తు ఒప్పందం మార్చి నెలాఖరుతో ముగియనున్నది. మరో 115 మెగావాట్ల ఒప్పందం మే నెలాఖరువరకు ఉంది. ఈ నేపథ్యంలో మరో సంవత్సర కాలం పాటు ఆ జఝ్జార్ నుంచే తెలంగాణకు కేంద్రం విద్యుత్ కేటాయింపులు జరపడం విశేషం.
ఇన్నాళ్ళూ ఢిల్లీ ప్రభుత్వం వినియోగించుకుంటూ ఉన్న 693 మెగావాట్ల విద్యుత్తును ఇటీవల వెనక్కి ఇచ్చి వేయడంతో కేంద్రం వద్ద ఈ మిగులు లభ్యమైంది. ఈ విద్యుత్తును తెలంగాణ, కేరళ, ఏపీ రాష్ర్టాలకు కేటాయించినా అత్యధిక వాటా తెలంగాణకే దక్కింది. కాగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర కోటా నుంచి విద్యుత్‌ను అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, ఇంధన శాఖకు చాలాకాలం నుంచి ప్రభుత్వం లేఖలు రాస్తూనే ఉంది. గత నెలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం 500 మెగావాట్లను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు లోక్‌సభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ అథారిటీకి కూడా ఇంధన మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. హర్యానాలోని ఝార్లీలో ఉన్న ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి, ఇదే జిల్లాలోని జఝ్జార్లోని ఆరావళి పవర్ కంపెనీ నుంచి ఈ విద్యుత్ అందనుంది.