ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసుల సూచనలు సమాజంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొంటూ మోసగాళ్లు...
ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసుల సూచనలు
సమాజంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొంటూ మోసగాళ్లు.. లాటరీ తగిలిందని, ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్ ద్వారా, ఈ-మెయిల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. హలో! మీకు రూ.100 కోట్ల లాటరీ తగిలింది. వెంటనే ఈ కింది నంబర్‌కు ఫోన్ గానీ, అడ్రస్, బ్యాంక్ వివరాలు ఎస్ఎంఎస్ గానీ చేయండి అని ఫోన్‌కు గానీ, మెయిల్ ఐడీకి గానీ సందేశం వస్తుంది. దానికి స్పందించారా.. అంతే సంగతులు! అని సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ మంగళవారం ఆన్లైన్, నైజీరియన్ మోసాలపై సుదీర్ఘ సూచనలు చేశారు.
సీఐడీ పోలీసుల సూచనలు..
తక్కువ ధరకే బంగారం అమ్ముతామని నమ్మబలికే అపరిచిత ఫోన్‌కాల్స్‌కు స్పందించకూడదు. పాకిస్తాన్ +92 సిరీస్ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు గానీ, మిస్డ్కాల్స్కు గానీ స్పందిస్తే వ్యక్తిగత డాటాతోపాటు బ్యాంక్ వివరాలను సైతం దోచుకుంటారు. ఇదే నంబర్ సిరీస్ నుంచి ఎయిర్ లాటరీ గెలుపొందారని వచ్చే కాల్స్‌కు స్పందించకూడదు. టీవీ కూపన్ పేరుతో రూ.25లక్షలు గెలిచారంటూ వచ్చే ఫోన్లను, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్‌ను పట్టించుకోవద్దు. ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్చేసేవారిని కూడా నమ్మవద్దు. అపరిచిత వ్యక్తులు ఏదో ఆఫర్ పేరుతో బురిడీ కొట్టించి ఏటీఎం పిన్ నంబర్, సీవీవీ నంబర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. కొద్దిసేపు మీ ఫోన్ స్విచాఫ్ చేస్తే ఫ్రీ రీచార్జి అవుతుందని బురిడీ కొట్టిస్తారు. ఫోన్ స్విచాఫ్ చేయగానే బంధువులకు పోన్ చేసి యాక్సిడెంట్ అయ్యిందని తప్పుడు సమచారం ఇచ్చి డబ్బులు కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది. మిలియన్ డాలర్ల లాటరీ గెలిచారు అని నైజీరియన్ గ్యాంగ్‌ల నుంచి వచ్చే సందేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఈ-మెయిల్స్‌కు వచ్చే జాబ్ ఆఫర్లపై వెంటనే స్పందించి ఆ మెయిల్స్‌లోని నంబర్లకు ఫోన్ చేస్తే డాటా అంతా గుల్లవుతుంది. విదేశాలకు వెళ్లేవారిని టార్గెట్‌చేసి కొన్ని ఆన్లైన్ గ్యాంగ్‌లు పాస్‌పోర్టులను పంపించాలని సూచిస్తారు.. అలా పాస్‌పోర్టును పంపించకూడదు. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో వస్తున్న అడ్వర్టయిజ్‌మెంట్‌తో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోవద్దు. వితౌట్ ప్రాసెసింగ్ ఫీ పేరుతో లోన్స్ అని వచ్చే ప్రకటనలను కూడా నమ్మవద్దు.