worldcup2015 semi final India vs Australia (26 Mar) ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచి ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలను సాధిస్తూ జైత్రయాత్రన...
![]() |
| worldcup2015 semi final India vs Australia |
(26 Mar) ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచి ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలను సాధిస్తూ జైత్రయాత్రను కొనసాగిస్తున్న భారత్‌కు గురువారం ఆస్ట్రేలియా రూపంలో గట్టి సవాల్ ఎదురుకానుంది. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో అదీ.. ఆసీస్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమైన్పటికీ ప్రస్తుతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సమష్టి రాణింపు చూస్తుంటే సిడ్నీలో టీం ఇండియాది పైచేయిలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోవాలంటే కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని ధోనిసేన ఉవ్విళ్లూరుతోంది.దుర్బేధ్యంగా.. భారత్ బ్యాటింగ్ లైనప్‌ప్రపంచంలో ఏ జట్టు బౌలింగ్ త్రయానికైనా సవాల్ విసరగలిగే బ్యాటింగ్ లైనప్‌తో భారత్ దుర్బేధ్యంగా తయారైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు లీగ్ దశలో శతకాలతో రాణించి ఫామ్‌లో ఉండగా పాకిస్థాన్‌పై సమయోచిత సెంచరీతో కోహ్లి కీలక సమరంలో ముందుంటానని నిరూపించాడు. బంగ్లాదేశ్‌పై ఆడిన మ్యాచ్‌లో శతకంతో రోహిత్‌శర్మ కూడా గాడిన పడటం భారత్‌కు కలిసి వచ్చే అంశం. రహానే క్లాస్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకునేందుకు మిడిలార్డర్‌లో సిద్ధంగా ఉంటూనే.. భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. రైనా ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ మిడిలార్డర్‌లో తనెంత కీలక ఆటగాడో నిరూపించుకుంటున్నాడు. మిడిల్ ఓవర్లలో జట్టు స్కోరు మందగించిన సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించే పనిని రైనా సమర్థంగా నిర్వహిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కోచ్ ఫ్లెచర్ ప్రత్యేకంగా రైనాను టెన్నిస్ బంతులతో సాధన చేయించడంలో ప్రధాన ఉద్దేశం బౌన్సర్లను ఎదుర్కొంటూ భారీ షాట్లను ఆడటమే కావచ్చు. ఇక కెప్టెన్ ధోనీ ఒత్తిడిని మైదానం అవతల వదిలేసి చివరి వరకు జట్టును ముందుండి నడిపించడమే కాక సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ మ్యాచ్ ఫినిషర్‌గా మరోసారి నిరూపించుకుంటున్నాడు. ఆల్‌రౌండర్ జడేజా వికెట్ల వేటలో వెనుకబడినప్పటికీ.. పరుగులు నియంత్రణతో ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు జడేజా ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనకు దిగినా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న భారత్‌కు సిడ్నీ ఎలాంటి జ్ఞాపకాలను అందిస్తుందో వేచి చూడాలి.సిడ్నీలో ఆసీస్ ఆలౌట్.. సాధ్యమేనా..?భారత్ బ్యాటింగ్‌లో బలమైన జట్టు అయినప్పటకీ.. బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంటోంది. చాలాకాలం నుంచి క్రికెట్ పండితుల నుంచి వస్తున్న విమర్శ ఇది. దీనికి కారణం లేకపోలేదు జట్టు ఏదో ఒక బౌలర్‌పైనే ఎప్పుడూ ఎక్కువగా ఆధారపడేది. ఉదాహరణకు గత ప్రపంచకప్‌లో జహీర్‌ఖాన్.. మరి ఈ ప్రపంచకప్‌లో సీన్ రివర్స్ అయ్యింది. మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, అశ్విన్ బౌలింగ్‌లో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. లీగ్ దశ నుంచి ఆడిన ప్రత్యర్థి జట్లన్నింటినీ ఆలౌట్ చేసి వారెవ్వా అనిపిస్తున్నారు. కెప్టెన్ ధోనీ ఏ దశలో తమ చేతికి బంతి ఇచ్చినా పూర్తి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంది భారత బౌలింగ్ త్రయం. సిడ్నీ స్పిన్‌కు అనుకూలిస్తుందని క్యూరేటర్లు, విశ్లేషకులు చెప్తున్నారు.. పిచ్ ఎలా మారినా ఆసీస్‌ను ఆలౌట్ చేసేందుకు మన బౌలర్లు సంసిద్ధులైపోయారు.హిట్టింగ్‌పైనే ఆసీస్ దృష్టంతా..సొంతగడ్డపై కీలకమైన సెమీస్ పోరులో భారత్ ఏకాగ్రతను మాటలతోనే కాకుండా భారీ షాట్లతో హిట్టింగ్‌కు పాల్పడుతూ దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించే ప్రమాదం ఉంది. ఓపెనర్ వార్నర్ క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడే వరకు వదిలిపెట్టడు. ఫించ్ ప్రస్తుతం ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతున్నాడు.. కాని భారత్‌పై మెరుగ్గా రాణిస్తున్న స్మిత్ సిడ్నీలో ఆసీస్‌కు ప్రధాన ఆయుధంగా చెప్పవచ్చు. కెప్టెన్ క్లార్క్ బ్యాట్‌తో నిరూపించుకోవాల్సి ఉంది. బౌలర్ ఎవరైన సరే.. భారీ షాట్లతో విరుచుకుపడే నైజం ఉన్న మాక్స్‌వెల్‌ను నియంత్రించడం పైనే భారత్ ప్రత్యేక దృష్టి సారించాలి. బౌలింగ్‌లో మిచెల్ జాన్సన్, హేజిల్‌వుడ్, స్టార్క్‌లు బౌన్సర్లతో భారత బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టే ప్రణాళికలతో సిద్ధమై ఉంటారు. స్పిన్ విభాగంలో బలహీనంగా ఉన్న ఆసీస్ మాక్స్‌వెల్‌ను వినియోగించుకునే అంశం కొట్టిపారేయలేం. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్ప మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శనే చేసింది. మొదట్లోనే ఆ మ్యాచ్ విజయావకాశాలు దాదాపు చేజారినా చివరి వరకు పోరాడి.. ఓడింది ఆసీస్‌నువ్వా.. నేనా పోరు తప్పదు!సిడ్నీలో ఆసీస్ అభిమానుల కంటే భారత్ అభిమానులు ఎక్కువ మంది రావచ్చొని అంచనాలున్న నేపథ్యంలో తప్పకుండా రెండు జట్లు సొంత అభిమానులు కాలరెగరేసుకునేలా పోరాడవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమ ఉజ్జీవులుగా ఉన్న భారత్, ఆసీస్ కీలకమైన మ్యాచ్‌లో ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు ప్రేక్షకులకు కనివిందు చేసే అవకాశం ఉంది. భారత్ ఈ మధ్య ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ.. క్రీడాభిమానులతో శభాష్ అనిపించుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రేపు ఉదయం 9 గంటలకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో జరగనున్న సెమీస్ పోరు వీక్షించేందుకు సిద్ధమైపోండిక...!
