-2016 నుంచి రైతులకు పగటి పూటే కరెంటు.. -2017 చివరి నాటికి 24 గంటలు సరఫరా -రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం -ఇప్ప...
-2017 చివరి నాటికి 24 గంటలు సరఫరా
-రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం
-ఇప్పటికే ఐదువేల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
-విద్యుత్ శాఖలో మరో 20 వేల ఉద్యోగాలు
-మిషన్ కాకతీయకు నాబార్డ్, జైకాలనుంచి 4000 కోట్ల రుణం
-వాటర్ గ్రిడ్‌కు నాబార్డ్ 3వేల కోట్లు, హడ్కో 10వేల కోట్ల రుణం
-హైకోర్టు విభజనపై త్వరలోనే శుభవార్త వింటాం
-రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం
-హైదరాబాద్‌లో రియల్ వ్యాపారం పెరుగుతోంది
-శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: మే నెలనుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎలాంటి కోతలు విధించలేదని ఆయన గుర్తు చేశారు. 2016లో రైతులకు పగటిపూట కరెంటు ఇస్తామని, 2017నుంచి అన్ని వర్గాలవారికి 24 గంటల కరెంటు అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని సీఎం యువతకు తీపి కబురు వినిపించారు. ఇప్పటికే పోలీసు శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఐదువేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఇక ఒకటి వెంట ఒకటిగా నోటిఫికేషన్లు వస్తాయని శాసనమండలిలో సభ్యుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ ప్రకటించారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలకు ఎలాంటి నిధుల సమస్యలేదని, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపునకుతోడు నాబార్డ్, హడ్కో, జైకాలనుంచి రుణాలు మంజూరయ్యాయని కేసీఆర్ తెలిపారు. హైకోర్టు విభజన చివరి అంకానికి చేరుకున్నదని, 15 రోజుల్లో శుభవార్త వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుంట భూమిని కూడా ప్రభుత్వం అమ్మలేదని.. ఈ విషయంలో కొన్ని పత్రికల్లో వచ్చిన పిచ్చిపిచ్చి వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. కరెంటు విషయంలో ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని కేసీఆర్ చెప్పారు. సచివాలయం, క్యాంపు ఆఫీసుతోపాటు చివరికి తన మొబైల్‌లో కూడా విద్యుత్ సరఫరాపై ప్రతినిమిషం సమాచారం తీసుకుని మానిటర్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం చిత్తశుద్ధి, అధికారుల అప్రమత్తత కారణంగానే కేటీపీఎస్, భూపాలపల్లిలో పీఎల్‌ఎఫ్ 98 నుంచి 100 శాతం సాధించామని ఆయన వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఎలాంటి విద్యుత్‌కోతలు విధించలేదన్న కేసీఆర్, గత సంవత్సరం ఇదే సమయంలో రాష్ట్రం లో ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తు చేశారు. పరిశ్రమలకు మూ డు.. నాలుగు చివరికి వారం రోజులు హాలిడేలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీనితో పరిశ్రమల యజమానులు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి ఎలాంటి కోతలు లేవని స్పష్టం చేశారు. మే నెల నుంచి ఇక కరెంటు కోతలు ఉండబోవని చెప్పిన ముఖ్యమంత్రి ఉంటే, గింటే మార్చి 20 నుంచి ఏప్రిల్ 25 వరకు కొంత వరకు ఇబ్బంది రావచ్చునని చెప్పారు. అది పంటలు కోతకు వచ్చే దశ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌కు బాగా డిమాండ్ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. రైతుల పంటలు కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టింది..
పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టిందనే తెలంగాణ సామెత ఇవాళ చంద్రబాబు విషయంలో నిజమైందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో గత సంవత్సరం విద్యుత్ కష్టాలు ఎదురైనపుడు హిందుజా, కృష్ణపట్నం నుంచి న్యాయంగా రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్ వాటాను చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్ చెప్పారు. కేంద్రం లిఖితపూర్వక ఆదేశాలు పంపినా పట్టించుకోలేదన్నారు. ఇది తెలంగాణకే మేలు చేసిందని, ఏపీ ఆనాడు విద్యుత్ ఇచ్చి ఉంటే 25 ఏండ్ల పాటు ప్రైవేటు విద్యుత్‌ను రూ.7నుంచి 7.50 ధరకు కొనాల్సి వచ్చేదన్నారు. బదులుగా మన దగ్గర జెన్‌కోనుంచి రూ.3కు వచ్చే విద్యుత్‌ను వారికి ఇవ్వాల్సి వచ్చేదన్నారు. ఆ కంచిగరుడ సేవ తప్పిందని, ఇపుడు చంద్రబాబు ఇస్తామన్నా విద్యుత్ తీసుకోబోమని స్పష్టం చేశారు. కష్టాలు వచ్చినా పట్టుదల, నిబద్ధ్దతతో వాటిని అధిగమించి విద్యుత్ సమస్యను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2015 చివరి నాటికి విద్యుత్ సమస్య పూర్తిగా కొలిక్కి వస్తుందని చెప్పారు. 2016 చివరి నుంచి రైతులకు పగలు నిరంతరం తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసి తీరుతామన్నారు. 2017 చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 2500 మెగావాట్ల విద్యుత్ అవసరం అన్నారు.
రెండేళ్లల్లో లక్ష ఉద్యోగాలు ఖాయం
రానున్న రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కమలనాథన్ కమిటీ నివేదిక వస్తే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనే విషయమై అవగాహన వస్తుందని, ఆ మేరకు భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికే కొత్త విద్యుత్ ప్రాజెక్టుల్లో 20 వేల మంది, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ డిపార్ట్‌మెంటులో సుమారు 13వేల వరకు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించామని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే ఉర్దూ టీచర్లు, లెక్చరర్ పోస్టులు పది నుంచి 15 వేల వరకు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగుల వయోపరిమితి ఐదేండ్లే కాదు అందరు అంగీకరిస్తే పదేండ్ల సడలింపు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. దీని విషయంపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డీఎస్సీ విషయం ప్రస్తావిస్తూ రాష్ట్రం లో ఇప్పటికే పంతుళ్లు ఉన్న చోట, పిల్లలు లేరు, పిల్లలు ఉన్న చోట పంతులు లేని పరిస్థితి నెలకొందన్నారు. కేవలం ఉద్యోగాల భర్తీ కోసమే డీఎస్సీ నిర్వహించకూడదన్నారు. టీచర్ల క్రమబద్ధీకరణ తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడుతాం
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడడంలో వెనక్కిపోయేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లకు గౌరవ వేతనం విషయం ప్రస్తావిస్తూ దేశంలో కేరళ తర్వాత ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేరళలో రూ. 6,600 వేతనం ఇస్తున్నారని, అయితే అక్కడ మొత్తం 900లోపు పంచాయతీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేరళ పంచాయతీల్లో కనీసం 30నుంచి 40 వేల జనాభా ఉంటుందని వాటి ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పారు. మన రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి 15వేలమందికి పైగా ఉన్నారని వివరించారు. పంచాయతీల ఆర్థిక పరిపుష్టి మీద దృష్టి పెట్టామని ఇప్పటికే సీనరేజీ తదితర పన్నుల విషయంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవంగా విధులు నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం గౌరవ వేతనం పెంపుపై నిర్ణయం తీసుకుందన్నారు. సర్పంచ్‌లు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమైనప్పటికీ... ప్రస్తుతం ఇది తొలి అడుగని, భవిష్యత్తులో సమీక్షించి ప్రోత్సహిస్తామని చెప్పారు.
మేథోమధనం తర్వాతే..
గత సంవత్సరం బడ్జెట్ అంచనాలపై ప్రతిపక్షం విమర్శకు బదులిస్తూ వాస్తవానికి రాష్ట్రం ఏర్పడిన సమయంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి ఆదాయంతో సహా ఏ విషయం మీద అంచనాలకు ఆధారం లేదని, ఆ విషయం తాను అపుడే చెప్పానని వివరించారు. అయినా అప్పట్లో అందుబాటులో ఉన్న పద్ధతులను, ఆర్థిక నిపుణులను, మేథావుల సూచనలు, సంప్రదింపులను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ రూపొందించామని సీఎం వెల్లడించారు. అందువల్లే గత బడ్జెట్‌లో రూ.30వేల కోత పడ్డదని తెలిపారు. ఇది లోటుగా ఉందన్నారు. ఇపుడు ప్రతి విషయం తేటతెల్లమైందన్నారు. గత ఏడాది రూ.99 వేల కోట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం(ఎస్‌ఓఆర్-స్టేట్ ఓన్ రెవిన్యూ) వచ్చిందని సీఎం స్పష్టం చేశారు. కమర్షియల్ ట్యాక్స్‌కు సంబంధించి రూ.3 నుంచి రూ. 5 వేల కోట్లు బకాయిలు రావల్సి ఉందని తెలిపారు. గత ఏడాది కేంద్రం నుంచి రావల్సిన నిధుల్లో 40 శాతం కోత విధించడం వల్ల రాష్ర్టానికి రూ.26వేల కోట్ల నిధులు తగ్గాయని చెప్పారు. సమైక్య పాలకుల దోపిడీ నుంచి విముక్తి పొందితే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని ముందు నుంచి చెప్పిన మాట ఇప్పుడు వాస్తవమైన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని మనం చెప్పడమే కాదు, ప్రణాళిక సంఘమే చెప్పింది. దేశంలో గుజరాత్, తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ర్టాలని చెప్పిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
గజం భూమీ అమ్మలేదు
బడ్జెట్‌లో ప్రభుత్వ భూముల విక్రయంతో రూ.6,500కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించినా ఒక్కగజం భూమి కూడా అమ్మలేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారందరికి ఉచితంగా పట్టాలిచ్చామని, అదే సమయంలో 200ల గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని అక్రమించిన వారి భూముల రెగ్యులరైజ్‌కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే సుమారు 3లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి రూ.175 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో భూముల రేట్లు తగ్గుతాయని, పరిశ్రమలు వెళ్లిపోతాయని జరిగిన దుష్ప్రచారం, హైదరాబాద్‌పై నెలకొన్న అనుమానపు మబ్బుల తెరలు తొలగిపోయాయన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని సీఎం చెప్పారు.
మిషన్ కాకతీయ ప్రత్యేకమైంది..
మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపుపై సీఎం సవివరంగా సభకు వివరణ ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన పద్దు మాత్ర మే చివరిది కాదని, ఇతరేతర మార్గాల ద్వారా కూడా నిధుల సమీకరణ జరుగుతున్నదని తెలిపారు. మిగతా ప్రాజెక్టులు వేరు, మిషన్ కాకతీయ వేరని సీఎం స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి నాబార్డ్ రూ.1000కోట్లు, జైకా రూ.3000 కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. అదే విధంగా వాటర్ గ్రిడ్‌కు హడ్కో రూ.10వేల కోట్లు, నాబార్డ్ రూ.3000కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యా యం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై రీఇంజినీరింగ్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవల్సిన అవసరం ఉం దన్నారు. సభా సమావేశాలు పూర్తయిన తర్వా త రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చో ని సమగ్రంగా చర్చించి, ప్రాధాన్యత క్రమంలో ఏ ప్రాజెక్టులను ముందు చేపట్టాలో నిర్ణయించుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒం టెత్తు పోకడలకు పోదని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, రాష్ట్ర అభివృద్ధికి ఏమి అవసరమో వాటినే పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు రూపొందిస్తామని కేసీఆర్ తెలిపారు.
కేంద్ర నిధులపై భేటీ ఏర్పాటు చేస్తాం
దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్రం నీతి ఆయోగ్ వచ్చిందని సీఎం అన్నారు. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిందే అన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తాను నిర్వహించే 122 పథకాలను 66 పథకాలకు కుదించాలని నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. రాష్ర్టాల ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రం రాష్ర్టాలకు నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతమున్న నీతి ఆయోగ్ విధానం చాలా బాగుందని, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారని, కొన్ని సబ్‌కమిటీల్లో ప్రత్యక్షంగా సీఎంలు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర రుణ పరిమితిని పెంచారని సీఎం వెల్లడించారు. ఇటీవలే కేంద్రం రాష్ర్టానికి రూ.3 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. గతంలో ఉన్న ప్రణాళిక సంఘం రాష్ర్టాలకు అవసరం ఉన్నా... లేకున్నా కొన్ని పథకాలను బలవంతంగా రాష్ర్టాలపై రుద్దేదని కేసీఆర్ పేర్కొన్నారు. దాని వల్ల కేంద్ర నిధులు చాలా వరకు వృధా అయ్యేవని వెల్లడించారు. కేంద్ర నిధుల వినియోగంపై త్వరలోనే ఆర్థిక నిపుణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవసరం లేని పథకాలేమిటి? ఎక్కువ నిధులు ఏ పథకానికి కేటాయించాలని చర్చించుకుందామని పేర్కొన్నారు. అవసరమైతే ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్‌ను అఖిలపక్ష ఢిల్లీ వెళ్లి కలుద్ధామని అన్నారు.
సోనియా వల్లనే తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లనే వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరని స్పష్టం చేశారు. ఇది చెరిపేసినా చెరగని వాస్తవం, చరిత్ర అని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర ఎవరూ రాసినా సోనియాగాంధీ పేరు రాయాల్సిందే అన్నా రు. నిజం ఎప్పటికైనా నిజమే. కేవలం సోనియాగాంధీ దయతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని మేం చెప్తున్నాం.. మరి ఇదే సమయంలో తెచ్చిందెవరో కూడా చెప్పాలి కదా?.... అని కేసీఆర్ రెట్టించడంతో సభ లో నవ్వులు విరిశాయి. తెలంగాణ సాధనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరి పాత్ర లేదని కొందరు పదవులు పట్టుకుని వేలాడిన వారున్నారన్నారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ కోసం తెగించి కొట్లాడారని, గాంధీ భవన్‌లోనే సీఎం జెండా ఆవిష్కరణకు కూడా అడ్డుపడి పోరాడారని యాదవరెడ్డి, ఆమోస్ తదితర నేతలను ప్రశంసించారు.
విద్యార్థులు తాను నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత ఉద్యమంలోకి వచ్చారని, అంతవరకూ వ్యూహాత్మకంగానే వారిని ఉద్యమంలోకి దింపలేదని కేసీఆర్ జ్ఞాపకం చేసుకున్నారు. ఏదేమైనా చివరి అంకంలో తెలంగాణ సమాజం మొత్తంగా ఏకమై తెలంగాణ సాధించుకుందని సీఎం కేసీఆర్ చెప్పారు. సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసుకునేందుకు అందరం సమిష్టిగా ముందు కు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరూ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలనిగాని, ఒంటెద్దు పోకడలు పోవాలనే ఆలోచన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అందరిని కలుపుకొని పోతామని సీఎం చెప్పారు. హైకోర్టు విషయంలో న్యాయశాఖ, ప్రధాన మంత్రికి ఇబ్బందులు చెప్పాం అని, త్వరలోనే తీపి కబురు వస్తుందని సీఎం చెప్పారు.
