SINGARENI CONTRACT LABOUR FILE PHOTO కొత్తగూడెం : జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక...
![]() |
| SINGARENI CONTRACT LABOUR FILE PHOTO |
కొత్తగూడెం : జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా సింగరేణి పెర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా ఉద్యమ స్ఫూర్తితో సకలజనుల సమ్మెలో పాల్గొని తమ వేతనాలు కోల్పోయారని గుర్తు చేశారు. పెర్మనెంట్ కార్మికులకు సమ్మెకాలపు వేతనాలను, తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కాంట్రాక్టు కార్మికులకు మాత్రం మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులు తెలంగాణ బిడ్డలుకాదా అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధమైన హైపవర్కమిటీ వేతనాలు, బోనస్, ఇతర సౌకర్యాలు అమలుచేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పేర్కొన్నారు. వీటి అమలువలన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆర్థిక భారం పడదని, కాంట్రాక్టు కార్మికులు నిర్వహించే విధుల ద్వారా కూడా సింగరేణి ప్రగతిపథంలో పయణిస్తుందని అన్నారు. సంస్థలో పనిచేస్తున్న 25వేల మంది కార్మికులు ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించడంలో సింగరేణి యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చట్టంచేసిన బోనస్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులకు చెల్లించడం లేదని విమర్శించారు. చెల్లించని వేతనాలు, బోనస్‌ల మూలంగా ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులు రూ.500కోట్లు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేసిన ఇతర కార్మిక చట్టాలను సైతం సింగరేణిలో అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని దుయ్యబట్టారు. గత రెండు సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికి అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కోల్‌బెల్ట్‌కు వస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమస్యలపై స్పందించి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శ్రీరామనవమి రోజున తీపికబురు అందించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల ఓట్లతో గెలిచిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిప్రకటన ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
