- ప్రేమించిన పాపానికి యువకుడికి ప్రత్యక్ష నరకం - ప్రాణాపాయస్థితిలో బాధితుడు -యువకుడిని నిర్బంధించిన యువతి బంధువుల అరెస్ట్ -దళిత ...
- ప్రేమించిన పాపానికి యువకుడికి ప్రత్యక్ష నరకం
- ప్రాణాపాయస్థితిలో బాధితుడు
-యువకుడిని నిర్బంధించిన యువతి బంధువుల అరెస్ట్
-దళిత సంఘాల ఆందోళన
ఖైరతాబాద్: ప్రేమించిన యువతిని పెండ్లి చేసుకున్న పాపానికి యువకుడిని ప్రియురాలి కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేశారు. డంబెల్స్‌తో కొడుతూ, ఉడుకు నీరు చల్లుతూ, సిగరేట్లతో కాల్చుతూ ప్రత్యక్ష నరకాన్ని చూపింంచారు. రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దాంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ దారుణ సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
పోలీసుల కథనం ప్రకారం సోమాజిగూడలోని బీఎస్ మక్తాకు చెందిన మేడ యాదయ్య, రామనర్సమ్మల కుమారుడు మేడ రవికాంత్ (27) డిగ్రీ చదువుకున్నాడు. బల్కంపేట (బీకేగూడ)కు చెందిన ఓ యువతితో పరిచయం ప్రేమగా మారింది. గత సంవత్సరం నవంబర్ 23న వీరిద్దరు ఇంటినుంచి పారిపోయి కర్తాల్లోని ఓ ఆలయంలో పెండ్లి చేసుకున్నారు.
తరచూ కలుస్తున్న వీరిని గతనెల 26న తమ ఇంటికి రావాల్సిందిగా యువతి తండ్రి, కుటుంబసభ్యులు రవికాంత్‌ను కోరారు. దీంతో యువతి ఇంటికి బయలుదేరిన క్రమంలో సోమాజిగూడలోని లైఫ్‌ైస్టెల్ వద్ద ఓ వాహనంలో వచ్చిన యువతీ బంధువులు బలవంతంగా రవికాంత్‌ను అందులో ఎక్కించుకొని వెళ్ళారు. అనంతరం బీకేగూడ ప్రాంతంలోని జిమ్‌లో నిర్బంధించి వారంరోజులుగా తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితుడి తల్లిదండ్రులను పిలిపించి ఆమె తండ్రి, సోదరులు, కుటుంబసభ్యులు ఎదుట డంబెల్స్‌తో బాదుతూ, వేడినీళ్లు చల్లుతూ నానా చిత్రహింసలకు గురి చేశారు.
తల్లితండ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో వారు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం పోలీసుల బృందంతో జిమ్‌లో పడిఉన్న రవికాంత్‌ను ఆస్పత్రికి తరలించారు. యువతి తండ్రి రమేశ్‌గౌడ్, సోదరులు అర్జున్‌గౌడ్, అరుణ్గౌడ్, అమర్‌గౌడ్, జిమ్ కోచ్ మీరాల రవిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రవికాంత్ స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాధితుడి రెండు కిడ్నీలు చెడిపోయి, వెన్నముక సైతం దెబ్బతిన్నదని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
దళిత యువకుడు రవికాంత్‌ను చిత్రహింసలకు గురిచేసిన యువతి తండ్రిని, బంధువులు, ఇతరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలో దళిత నాయకులు నారికేల నరేశ్, రజనీకాంత్, బత్తుల రాంప్రసాద్, కేవి ప్రసాద్, మల్లెల ప్రకాశ్, శివ మాదిగ, ఇటుక రాజులు పాల్గొన్నారు. అనంతరం అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ ఎం వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు.