-ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ -సిటీ కాలేజీ వార్షికోత్సవంలో ఘంటా చక్రపాణి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల భర్తీ ఎప...
-ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్
-సిటీ కాలేజీ వార్షికోత్సవంలో ఘంటా చక్రపాణి
రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మంగళవారం పాతబస్తీలోని సిటీ కాలేజీ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ అనేక సంవత్సరాలపాటు అన్ని వర్గాలు జరిపిన పోరాట ఫలితంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది అని అన్నారు.
ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికుల కోరిక త్వరలోనే నెరవేరనుందని ఆయన తెలిపారు. నగరంలో ప్రస్తుతం ఎన్నికల నియామావళి అమల్లో ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విభాగంలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. మలిదశ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అద్వితీయమని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని విభాగాల పంపకాల్లో అభ్యంతరాలున్నా త్వరలోనే సర్దుకుంటాయని పేర్కొన్నారు.