తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను అందించే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలదని, అందుకు తగిన సమర్...
తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను అందించే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలదని, అందుకు తగిన సమర్థత సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పగడపల్లిలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ రెండోదశ 600 మెగావాట్ల విస్తరణ ప్లాంట్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పవర్‌ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మ్యాప్, నివేదికల ద్వారా సీఎంకు వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా వివరించారు. ఈ సందర్బంగా సింగరేణి యాజమాన్య ప్రతినిధులు, టీజెన్‌కో అధికారులు, రాష్ట్ర మంత్రులతో కేసీఆర్ సమీక్షించారు.
రూ. 3,570 కోట్లతో నిర్మించనున్న ఈ రెండోదశ విస్తరణ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని 30 నెలల్లోగా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న (2x600) 1200 మెగావాట్ల పవర్‌ప్లాంట్ నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు. బీహెచ్‌ఈఎల్, మ్యాకనెల్లి భారత్ ఇంజినీరింగ్ అండ్ కన్సార్టియం యాజమాన్య ప్రతినిధులు, సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్, సీనియర్ అధికారులతో సీఎం మాట్లాడుతూ... ఊహించని రీతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసినందుకు అభినందిస్తున్నానన్నారు. 2014 డిసెంబర్‌లో తాను పవర్ ప్లాంట్‌ను సందర్శించిన నాటికి,
ఇప్పటికీ జరిగిన నిర్మాణ పనుల ప్రగతి అద్భుతంగా ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని కంటే ముందుగానే ఈ ఏడాది నవంబర్ నాటికి సింక్రనైజేషన్ చేసి డిసెంబర్ నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని పనులను, నిర్మాణ సామగ్రిని, మానవ వనరులను తమ సర్వశక్తులొడ్డి అందిస్తామని బీహెచ్‌ఈఎల్, ఎంబీఈ ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. కేటీపీఎస్‌లోని ఏడో దశ విస్తరణ, మణుగూరులో నూతనంగా నిర్మించతలపెట్టిన జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తమపై ఎంతో నమ్మకంతో అప్పగించిన కేటీపీఎస్ విస్తరణ, మణుగూరు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని, తమ సామర్థ్యాలను కూడా రెట్టింపు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేసి సీఎం కేసీఆర్ అభిమతానికి అనుగుణంగా పనులు చేపడతామని ఈ సమీక్షలో పాల్గొన్న బీహెచ్‌ఈఎల్ చైర్మన్ బీ. ప్రసాద్‌రావు భరోసా ఇచ్చారు. సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ... 1200 మెగావాట్ల జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి 1,2 టీఎంసీల వాటర్ పైప్‌లైన్ నిర్మాణానికి, రైల్వేలైన్ కనెక్టివిటీకి సంబంధించి ఆయా శాఖల నుంచి తమకు సంపూర్ణ సహకారం కావాలని, ఈ రెండు కీలకమైన సవాళ్లుగా ఉన్నాయని ముఖ్యమంద్రికి విన్నవించారు.
మిగిలిన భూ సేకరణ, పైప్‌లైన్ , రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి అన్ని క్లియరెన్సులను, ప్రభుత్వ పరమైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రానున్న నాలుగేళ్లలో 8 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు అదనంగా ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న 52 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని 2019-20 నాటికి, 75.6 మిలియన్ టన్నులకు పెంచనుందన్నారు. ఇందుకోసం కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందుకు అవసరమైన భూమిని కేటాయించాలని,
భూ సేకరణకు మద్దతు ఇవ్వాలని సీఎంకు సీఎండీ శ్రీధర్ విన్నవించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు మంచి సమర్థత ఉందని, గోదావరి పరివాహక ప్రాంతంలోనే కాకుండా దేశంలో, ఇతర దేశాల్లో బొగ్గును వెలికి తీసేందుకు, ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఇండోనేషియా, మొజాంబిక్, సౌత్ ఆఫ్రికాల్లో కూడా బొగ్గు బ్లాకులను చేపట్టాలన్నారు. ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు బ్లాకులను తీసుకొని సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, చీఫ్ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, కేంద్రంలో తెలంగాణ ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
