మంచిర్యాల: జిల్లాలోని తుమ్మిడిహెట్టి నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత...
మంచిర్యాల: జిల్లాలోని తుమ్మిడిహెట్టి నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తీరు అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో జరిగిన చర్చావేదికలో పలువురు పాల్గొని ప్రసంగించారు. జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్దన్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో నీటి వనరులు ఉన్నప్పటికీ తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రాజెక్ట్ తరలింపుతో మరింత అన్యాయానికి గురి చేయవద్దన్నారు. ప్రజలంతా సంఘటితమై జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే 5వేల కోట్ల రుపాయలతో కాలువల నిర్మాణం పనులు జరగగా.. ఇప్పుడు ప్రాజెక్ట్ను తరలిస్తే వేల కోట్ల రుపాయలు మట్టిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశం, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావులు మాట్లాడుతూ జాతీయహోదా సంతరించుకుంటున్న తరుణంలో ప్రాజెక్ట్ను వేరే ప్రాంతానికి మార్చటం వల్ల జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగి ఈ ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. పలు వర్గాలకు చెందిన నాయకులు సత్యనారాయణ, రాందాస్, ప్రకాష్, సత్తయ్య, రాజయ్య, భూమయ్య, తదితరులు పాల్గొనారు
