ఉద్యమ పార్టీగా ఏర్పడి రాజకీయ పార్టీగా అవతరించిన తెరాసలో మొదటి నుంచీ ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. పార్టీకి కష్టకాలంలోనూ వెన్నుదన్నుగా నిలుస...
ఉద్యమ పార్టీగా ఏర్పడి రాజకీయ పార్టీగా అవతరించిన తెరాసలో మొదటి నుంచీ ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. పార్టీకి కష్టకాలంలోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల్లోనూ చాలా మంది కష్టపడి పనిచేశారు. వారి కృషితోనే నేడు ప్రజాప్రతినిధులుగా మేం ఎన్నికయ్యాం. అలాంటి వారిని ఎన్నటికీ మరిచిపోవద్దు. పార్టీ పదవుల్లోనైనా, నామినేటెడ్ పోస్టుల్లోనైనా ఉద్యమకారులకే ప్రాధాన్యమివ్వాలని పలువురు తెరాస ప్రజాప్రతినిధులు నొక్కిచెప్పారు. తప్పకుండా వారికి ప్రాధాన్యం ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. కష్టపడే వారికే గుర్తింపు లభిస్తుందని తేల్చి చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లాకేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటుచేసిన ఆ పార్టీ జిల్లా సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూనే.. కార్యకర్తలకు సమావేశం ద్వారా నేతలు కాస్త భరోసా కల్పించారు. ఎక్కడా గ్రూపులు లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఇరవై అయిదేళ్ల వరకు తెరాస అధికారంలో ఉండేలా చేయాలని నాయకులు పిలుపునివ్వడం.. సమావేశానికి హాజరైన వారినుంచి అదేస్థాయిలో చప్పట్లతో స్పందన లభించడంతో నేతల్లో హుషారు కనిపించింది. సుదీర్ఘ´కాలం తర్వాత అదీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఆ పార్టీ సమావేశ వివరాలను పరిశీలిస్తే..జిల్లాలో బలమైన పార్టీగా అవతరించిన తెరాస తొలి సమావేశంపై పార్టీ నేతల్లోనూ మొదటినుంచీ ఉత్కంఠ నెలకొంది. సమావేశం ద్వారా ప్రధానంగా కార్యకర్తలకు ఎలాంటి భరోసా లభిస్తుందనే దానిపై చర్చ జరుగుతూ వచ్చింది. దానికి తగ్గట్లుగానే సూచనలు చేయడంతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఉద్యమకారులకే ప్రాధాన్యం ఇస్తామనే సంకేతాన్ని ఇవ్వడంతో సమావేశానికి హాజరైన వారందరి నుంచి హర్షాతిరేకం వ్యక్తమైంది. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సమావేశం ఆ తర్వాత తెలంగాణ అమరవీరులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ మండల, పట్టణ ఎన్నికల కమిటీ బాధ్యులు హాజరైన సమావేశంలో పార్టీ కమిటీల నియామకాలతోపాటు ఇతరత్ర వాటిపై సూచనలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలని చెప్పారు. అప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణంలో కార్యకర్తల పాత్రకు గుర్తింపు లభిస్తుందని సమావేశంలో పాల్గొన్న నేతలు వివరించారు. ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా అవి ప్రజలకు తెలియడంలేదని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం గురించి ఓ నిరుపేద అవ్వను అడగ్గా తనకు ఆ పథకం తెలియదని ఆమె చెప్పిందని పేర్కొంటూ పథకాల ప్రచారం లేకపోవడాన్ని మంత్రి వివరించే ప్రయత్నం చేశారు. నూతనంగా ఎంపికయ్యే గ్రామ, వార్డు కమిటీలు, మండల, పట్టణ కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులు ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి లబ్ధి చేకూర్చేలా చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లని వారికోసం ఏమైనా చేస్తామని పేర్కొంటూనే వచ్చే ఇరవై అయిదేళ్లు తెరాస అధికారంలో ఉండేలా కలిసికట్టుగా అభివృద్ధిలో పాలుపంచుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మాట్లాడిన పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీ గోడం నగేష్‌లు ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలనెవరినీ మరువవద్దని, వారందరికీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని పేర్కొనడంతో సమావేశంలో ప్రతిఒక్కరూ చప్పట్లతో మద్దతు తెలిపారు. అలాచేస్తే తెలంగాణ పునర్నిర్మాణంలో వారు మరింత కృషిచేస్తారని సూచనలు చేశారు.బంగారు తెలంగాణ సాధన కోసం ఎక్కడా పార్టీలో గ్రూపు విభేదాలు లేకుండా చూసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలం.. ఏది చేయాలన్నా కలిసి చేస్తున్నాం.. మాలో ఎవరి మధ్యా విభేదాలు లేవు.. మీరు కూడా అలాగే ముందుకుపోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హితబోధ చేశారు. గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ వరకు ఎక్కడైనా సరే ఎన్నిక ఏకగ్రీవంగానే జరగాలని, అధిష్టానం నుంచీ ఇవే ఆదేశాలున్నాయని ఆ పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లా కన్వీనర్లు లోక భూమారెడ్డి, పురాణం సతీష్‌లు సూచనలుచేస్తూనే ఎక్కడైనా కమిటీల్లో పొరపొచ్చాలు వస్తే సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వివాదం లేకుండా చూడాలన్నారు.
