హైదరాబాద్: సీలేరు విద్యుత్ వాటాల విషయమై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాస్తవ వాటాలను దక్కించుకోవడంలో అధిక...

ముంపు మండలాల మాదిరే..
ఏపీలోని సీలేరు ప్లాంటులో తెలంగాణ వాటాపై కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్ శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ అత్యంత చౌకగా, ఏడాదిలో 11 నెలల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే సీలేరు కేంద్రంలో విద్యుత్ వాటాను ఏపీ ఇవ్వకున్నా రాష్ర్ట ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. ‘ముఖ్యమంత్రేమో ఏపీ విద్యుత్ వద్దు. వారిని విద్యుత్ అడగమని అంటున్నారు.
కేవలం 45 పైసలతో ఉత్పత్తి అవుతున్న సీలేరు ప్రాజెక్టును పోలవరం ముంపు మండలాల మాదిరే వదిలేస్తారేమోనని భయంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి హరీశ్ స్పందిస్తూ.. ‘సీలేరు వివాదానికి అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేశ్ పూర్తి కారణం. ఆయన పెట్టిన ప్రతిపాదననే ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసింది. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్లుగా అంతా చేసి కాంగ్రెస్ ఇప్పుడు విమర్శలు చేస్తోంది. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని రాజ్యసభలో అడ్డుకునే అవకాశమున్నా కాంగ్రెస్ ఎందుకు ఆ పని చేయలేదు’ అని మంత్రి ధ్వజమెత్తారు.
ఏపీ చర్యకు ప్రతిచర్యగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, శ్రీశైలం ఎడమ కాల్వల పరిధిలో రాష్ట్రం సైతం విద్యుత్ షెడ్యూలింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ కల్పించుకున్న పువ్వాడ అజయ్.. ‘పోలవరం ముంపు కింద కేవలం 136 గ్రామాలకే కాంగ్రెస్ తీర్మానం చేసింది. కానీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రోద్బలంతో ఏడు మండలాలను ఎన్డీయే సర్కారు ఏపీలో కలిపింది’ అని అన్నారు. దీనిపై బీజేపీ పక్ష నేత లక్ష్మణ్ అభ్యంతరం తెలిపారు. దొంగే దొంగ అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు సీలేరు వాటాల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి సమాధానం చెప్పడంతో స్పీకర్ మరో ప్రశ్నకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే తమకు మరో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.
పోడియం ముందు బైఠాయింపు
స్పీకర్ సీలేరుపై మాట్లాడేందుకు మరోసారి అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సభ్యులంతా పోడియంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో చిన్నారెడ్డికి స్పీకర్ అవకాశమిచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘పోలవరం కింద ముంపు గ్రామాలను మాత్రమే కాంగ్రెస్ చేర్చగా, బీజేపీ మాత్రం ఏడు మండలాలను కలిపింది. సీఎం సైతం ఏడు మండలాలు పోతేపోనీ తెలంగాణ వచ్చిందిగా అని అనలేదా’ అని ప్రశ్నించారు. దీనికి టీ ఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగడంతో చిన్నారెడ్డి మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మళ్లీ నిరసనకు దిగారు. ఈలోగా చిన్నారెడ్డికి మరోసారి అవకాశమిచ్చినా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.
తర్వాత మంత్రి హరీశ్ మరోసారి మాట్లాడారు. కాంగ్రెస్ తీరును తప్పుపడుతూనే, సీపీఐ నుంచి వచ్చిన పువ్వాడ అజయ్‌కి కేంద్రం వ్యవహరించిన తీరు బహుశా తెలియకపోవచ్చన్నారు. అనంతరం స్పీకర్ మరో ప్రశ్నకు సిద్ధమవగా అజయ్ సహా ఇతర ఎమ్మెల్యేలు లోనికి వచ్చారు. తనపై మంత్రి తప్పుడు ఆరోపణ చేశారంటూ పోడియం ముందు బైఠాయించారు. మంత్రి వ్యాఖ్యలపై తనకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. స్పీకర్ అంగీకరించడం తో ఆయన మాట్లాడుతూ ‘నేను సీపీఐలో ఉన్నట్లు హరీశ్ నిరూపించగలడా’ అని సవాల్ విసిరారు. వంద కిలోమీటర్లు తరిమికొడతామన్న వాళ్లను ఇప్పుడు పార్టీలో చేర్చుకున్న ఘనత టీఆఎస్దేనన్నారు. హరీశ్ కల్పించుకుని.. అజయ్ తండ్రి నాగేశ్వరరావు సీపీఐలో చాలా ఏళ్లు పనిచేసినందున అలా అన్నానని పేర్కొన్నారు. అనంతరం సభకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత సైతం అజయ్ పోడియం ముందు బైఠాయించడంతో సీఎల్పీ నేత జానారెడ్డి కల్పించుకొని ఇరు పక్షాలను శాంతింపజేశారు.