(30 Mar) * ఉన్నతాధికారుల నిర్ణయం * జిల్లావ్యాప్తంగా పట్టుకున్న ఇసుక 10వేల క్యూ.మీ. కరీంనగర్, మార్చి 29: అక్రమంగా రవాణాచేస్తూ పట్టుబడ్డ స...
(30 Mar) * ఉన్నతాధికారుల నిర్ణయం * జిల్లావ్యాప్తంగా పట్టుకున్న ఇసుక 10వేల క్యూ.మీ. కరీంనగర్, మార్చి 29: అక్రమంగా రవాణాచేస్తూ పట్టుబడ్డ సీజింగ్ ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు వినియోగించుకునేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా కొద్దిరోజులుగా అక్రమంగా రవాణాచేస్తూ, పట్టుబడ్డ ఇసుక వేల క్యూబిక్ మీటర్లలో ఉండగా, దీనిని నామమాత్రపు ధరతో ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే పలు విభాగాల కట్టడాలకు ఉపయోగించుకోవచ్చని ఆదేశాలు వెలువడగా, జిల్లాలో నిర్మిస్తున్న సర్కారు కట్టడాలకు వాడేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం, మరికొన్ని చోట్ల ఎంపికచేసిన వారితో కొనసాగిస్తుండగా, జిల్లాలో ఇసుక లభ్యత గగనకుసుమంగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇసుకాసురులు రాత్రిపూట అక్రమరవాణాకు తెరలేపి, నిత్యం వందలాది వాహనాల ద్వారా ఇతర చోట్లకు తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికార యంత్రాంగం నిబంధనలతిక్రమించి ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తూ, ఇసుకను ఆయా మండలాల్లోని తహాశీల్దార్ కార్యాలయాల్లో నిల్వ చేశారు. అక్రమ ఇసుక తరలించే వాహనాలకు జరిమానా వేసినా ఆయా వాహనాల యజమానులు తమ అక్రమాలను కొనసాగిస్తూనే ఉండగా, కేవలం నెల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా 10వేలకు పైగా క్యూబిక్ మీటర్ల ఇసుకను యంత్రాంగం పట్టుకుంది. ఒక్క కరీంనగర్ మండల పరిధిలోనే 600కు పైగా క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుకను అధికారులు పట్టుకున్నారు. రోజురోజుకు అక్రమ ఇసుక నిల్వలు తహసీల్దార్ కార్యాలయాల్లో పెరిగిపోతుండగా, ముందుముందు పట్టుకునే ఇసుకను నిల్వచేసేందుకు ఖాళీ స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో ప్రభుత్వ నిర్మాణాలకు దీనిని వినియోగించుకునేలా వెసలుబాటు లభించింది. ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.510 చొప్పున విక్రయించేందుకు రెవెన్యూ యంత్రాంగం ధర నిర్ణయించగా, ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారులు ఈ నిల్వలను కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమున్నవారు తగు మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేర డిడి తీసి సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేసి, ఇసుకను తరలించుకోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన ఇసుకను దారిమళ్ళిస్తే గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
