వరంగల్ : ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి..దీనివల్ల ఎంతో మందికి లాభం కలుగుతుందని ఎన్నో పోరాటాలు చేసినా పాలకులు కళ్లు తెరవలేదు. ప్రాజెక...
వరంగల్ : ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి..దీనివల్ల ఎంతో మందికి లాభం కలుగుతుందని ఎన్నో పోరాటాలు చేసినా పాలకులు కళ్లు తెరవలేదు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలంటూ వామపక్షాలు ఉద్యమించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ దశలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనతో ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఆ ప్రాజెక్టే...కంతనపల్లి ప్రాజెక్టు... వరంగల్ కు 150 కి.మీటర్లు.. నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం అభయారణ్యం వద్దే కంతనపల్లి ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేసేందుకు కంతనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సీపీఎం అనేక పోరాటాలు చేసింది. సీపీఎం పోరాటాల ఫలితంగా అప్పటి వైఎస్ ప్రభుత్వం దిగొచ్చి కంతనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం వేసి నేటికి ఐదున్నరేళ్లు అయినా ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. దీంతో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నడుం బిగించింది. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు... వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించారు. గోదావరి నదిపై కంతనపల్లి వద్ద 85 అడుగుల ఎత్తుతో 22.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజిని నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి 2010లో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మళ్లీ 2013లో మరోసారి టెండర్లను ఆహ్వానించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని స్యూ-రిత్విక్ సంస్ధలు జాయింట్‌గా చేపట్టాయి. మొత్తం ప్రాజెక్టును 1643.68 కోట్లలో నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. రెండు దశల్లో ఎత్తిపోతల ప్రాజెక్టు.. కంతనపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టును మొత్తం రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో కంతనపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీని నిర్మిస్తారు. ఇందులో 22.50 టీఎంసీల నీటిని నిలువ చేస్తారు. ఇక్కడి నుంచి మూడు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువకు నీటిని తరలిస్తారు. ఇలా 50 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. బ్యారేజీ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని సొరంగాలు, కాలువలు, జలాశయాలు ద్వారా కాకతీయ కాలువలకు..అక్కడి నుంచి ఉపకాలువల ద్వారా చెరువులకు సరఫరా చేస్తారు. దీంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద మొత్తం 7లక్షల 70వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక ప్రాజెక్టు రెండవ దశలో మరో 50టీఎంసీల నీటితో నల్గొండ, హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చనుంది. కంతనపల్లిని సందర్శించనున్న కేసీఆర్... ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ఉన్న బ్యారేజీ పనులు కొన్ని రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు భూసేకరణలో జాప్యం, నిధులు మంజూరు కాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్బంగా కంతనపల్లి ప్రాజెక్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారని సమాచారం. ప్రాజెక్టుల ఏరియల్ సర్వే కూడా నిర్వహించనున్నారు. దాంట్లో భాగంగానే కంతనపల్లిని కూడా సందర్శించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా గుర్తించిన కంతనపల్లిని పూర్తిచేస్తే మూడు జిల్లాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
