సివిల్ విభజన పూర్తి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సివిల్ అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 26వ తేదీన ఇచ్చిన ప్రొవిజ...
సివిల్ విభజన పూర్తి:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సివిల్ అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 26వ తేదీన ఇచ్చిన ప్రొవిజినల్ జాబితా అనంతరం అధికారుల అభ్యంతరాలను పరిశీలించిన డీవోపీటీ తుది జాబితాను గురువారం ప్రకటించింది. తెలంగాణకు 133 మంది ఐఏఎస్‌లు, 95 ఐపీఎస్‌లు, 58 ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. ప్రొవిజినల్ జాబితాలో తెలంగాణకు కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో శాంతకుమారి తప్ప వీ కరుణ, ఎం ప్రశాంతి, ఏ వాణీప్రసాద్‌లు తుది జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కారు. అలాగే ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు.
-తెలంగాణకు 133, ఆంధ్రకు 161 మంది ఐఏఎస్‌లు
-మహేష్ భగవత్ తెలంగాణకు- సోమేశ్‌కుమార్ ఆంధ్రకు
-తెలంగాణ వైపు శాంతకుమారి, జయేష్ రంజన్, వికాస్‌రాజ్
-ఆంధ్ర కోటాలో రోనాల్డ్‌రాస్, పూనం మాలకొండయ్య, వాణీ ప్రసాద్
తెలంగాణలో పని చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్య తదితరులు తుది జాబితాలో ఏపీకి దక్కారు. రెండు రాష్ర్టాల మధ్య సివిల్ సర్వీస్ అధికారుల తొలి ముసాయిదా జాబితాను అక్టోబర్ 10న విడుదల చేసిన డీవోపీటీ వారి అభ్యంతరాలను పరిశీలించి రెండో సారి ప్రొవిజినల్ జాబితాను డిసెంబర్ 26న వెలువరించింది. ప్రొవిజినల్ జాబితాపై అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు 15 రోజుల గడువు ఇచ్చి ఎట్టకేలకు గురువారం తుది జాబితాను ప్రకటించింది. తాజా జాబితా ప్రకారం తెలంగాణ కోటాలో ఐదుగురు ఐఏఎస్‌లు పెరిగారు.
ప్రొవిజినల్ జాబితాలో తెలంగాణకు 128 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. వీరిలో నలుగురికి ఇంకా బ్యాచ్‌ను కేటాయించలేదు. క్రితంసారి ఏపీ కోటాలో ఉన్న జయేష్ రంజన్, వికాస్‌రాజ్‌లు తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు. అయితే తెలంగాణలో పనిచేస్తున్న పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్‌లను అప్పుడు, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించారు. సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్య, జయేష్‌రంజన్, రోనాల్డ్రాస్లను తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా డీవోపీటీ పట్టించుకోలేదు. జయేష్ రంజన్‌ను మాత్రమే తెలంగాణకు కేటాయించారు. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)లో సోమేశ్‌కుమార్ కేటాయింపునకు వ్యతిరేకంగా కేసు పెండింగ్‌లో ఉన్నందున, ఆయన యథావిధిగా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది.
ప్రొవిజినల్ జాబితా తయారీ సందర్భంగా ఇరు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో డీవోపీటీ అధికారులు సమావేశమైనప్పుడు ఒకే కేడర్, ఒకే పే స్కేల్లో ఉన్న వారు రెండు రాష్ర్టాల మధ్య పరస్పరం మారడానికి (స్వాపింగ్)కు అవకాశం ఉంటే, నిబంధనలు అడ్డురావని స్పష్టం చేశారు. ఈ ముగ్గురిని తెలంగాణకు కేటాయించకపోవడానికి స్వాపింగ్‌కు అనుగుణంగా అధికారులు దొరకకపోవడమే కారణమని తెలుస్తోంది. తెలంగాణ కోటాలో ఉన్న సిద్ధార్థజైన్‌ను కేటాయించాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని డీవోపీటీ అంగీకరించింది. ఇక ఐపీఎస్ అధికారుల్లో కూడా ప్రొవిజినల్ జాబితా కన్నా ఈసారి తెలంగాణకు ముగ్గురు పెరిగారు. గత జాబితాలో ఏపీ కోటాలో ఉన్న మహేష్ భగవత్ తుది జాబితాలో తెలంగాణ వైపు వచ్చారు. క్రితం జాబితాలో తెలంగాణకు 92 మంది ఐపీఎస్‌లుండగా, తుది జాబితాలో ఆ సంఖ్య 95కు చేరుకుంది. ఏపీకి గత జాబితాలో 119 మంది ఐసీఎస్లుండగా, తాజా జాబితాలో 116కు తగ్గింది.
తెలంగాణకు కేటాయించిన 95 మంది ఐపీఎస్ అధికారుల్లో 13 మందికి ఇంకా బ్యాచ్‌ను కేటాయించలేదు. ఐఎఫ్ఎస్ అధికారుల్లో తెలంగాణకు 58 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 69 మందిని కేటాయించారు. అక్టోబర్‌లో జరిగిన కేటాయింపుల కన్నా తెలంగాణకు ఏడుగురు అధికారులు పెరగగా, ఏపీకి ఆ మేరకు తగ్గారు. తెలంగాణ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారి ఎస్బీఎల్ మిశ్రాను కేటాయించాలని కోరినా డీవోపీటీకి ఆయనను ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించింది. ఎట్టకేలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన ప్రక్రియను డీవోపీటీ పూర్తి చేసిన నేపథ్యంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలు, ఆప్షన్లకు అవకాశం లేదు.
