రంగుల కేళి.. హోలీవేళ భారత జట్టు వరల్డ్‌కప్ మ్యాచ్! అందుకే, భారత అభిమాని మోము నయారంగ్ను సంతరించుకుంది. ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో...
రంగుల కేళి.. హోలీవేళ భారత జట్టు వరల్డ్‌కప్ మ్యాచ్! అందుకే, భారత అభిమాని మోము నయారంగ్ను సంతరించుకుంది. ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో ఇప్పటికే రంగుపడుద్దీ అంటూ ప్రత్యర్థులను హెచ్చరించిన ధోనీసేన.. వెస్టిండీస్ వీరులపైనా సిక్సర్లు, ఫోర్లు, వికెట్ల కలర్స్‌ని కుమ్మరించాలని అభిమాని ఆశ! మరి.. ధోనీసేన నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తుందా? వెస్టిండీస్‌పై గెలుపొంది కలర్స్ ఫెస్టివల్‌ను మరింత కమనీయం చేస్తుందా? మరోపైపు
వరల్డ్‌కప్‌లో ఈసారి కూడా పటాకులు పేల్చే అవకాశం రాకపోయేసరికి ఆ పాకిస్థాన్ అభిమాని, ఎలాగైనాసరే భారత్‌పై గెలుపు ముచ్చట తీర్చుకోవాలనే కసితో మిగతా జట్ల జెర్సీలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా వెస్టిండీస్ జెర్సీ వేసుకొని మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యాడు. అతని కోరిత తీరుతుందా? అతను కొనితెచ్చుకున్న పటాకులకు దుమ్ము వదులుతుందా?
-వరుసగా నాలుగో విజయంపై భారత్ కన్ను
-వెస్టిండీస్‌తో మ్యాచ్ నేడే
పెర్త్: వరుసగా పాకిస్థాన్, సౌతాఫ్రికా, యూఏఈలపై భారీ విజయాలతో ఊపుమీదున్న టీమ్ ఇండియా ఆస్ట్రేలియా వేదికగా చివరి గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ తర్వాత ధోనీసేన ఆడే చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌లు న్యూజిలాండ్‌లోనే. దీంతో వాకా వేదికగా శుక్రవారం వెస్టిండీస్‌పైనా గెలిచి కంగారూ గడ్డపై గ్రూప్ దశలో అజేయ ప్రస్థానాన్ని ఘనంగా ముగించాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది. మొదట్లో మాదిరి గాయాలు.. ఫామ్‌లేమీ అంటూ ఏమీలేవు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా అత్యంత పటిష్టంగా ఉంది. తనదైన స్టయిల్ బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మోహరింపులతో ధోనీలో మునుపటి స్థాయి కెప్టెన్ కనిపిస్తున్నాడు. వ్యూహాలన్నీ ఫలిస్తున్నాయి. పాకిస్థాన్, సౌతాఫ్రికాలపై పరుగులు సాధించకలేకపోయిన ఆ ఒక్కడు రోహిత్ కూడా యూఏఈపై అర్ధ సెంచరీ కొట్టాడు. బౌలింగ్‌లో షమీ ఫిట్‌నెస్‌పై చిన్నపాటి అసంతృప్తి తప్పిస్తే, అంతా సవ్యంగానే ఉంది.
షమీ ఆడతాడా?:
యూఈఏ మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఏస్ పేసర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో ఆడడంపై టీమ్ ఇండియా మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వలేదు. అయితే గురువారం నెట్ ప్రాక్టీస్‌లో మాత్రం షమీ బంతులు విసిరాడు. షమీకి విశ్రాంతినివ్వాలనుకుంటే మాత్రం భువనేశ్వర్‌ను ఆడించకతప్పదు. అన్నట్టు.. గేల్‌ను ఎన్నోసార్లు ఔట్ చేసిన ఘనత భువీది. ఇక నెట్స్‌లో మరో పేసర్ మోహిత్ చేతికి బంతి తగిలింది. అయితే పెద్దగాయమేమీ కాదని స్కానింగ్‌లో తేలింది.
గేల్‌ను అడ్డుకోగలిగితే: మరోవైపు వెస్టిండీస్ బ్యాటింగ్‌ను తక్కువ చేయడానికి వీల్లేదు. ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతీసారి 300 పైచిలుకు పరుగులు కొట్టింది. అయితే జింబాబ్వే, పాకిస్థాన్‌లపై 300 ప్లస్ స్కోర్లను కాపాడుకన్నా, ఐర్లాండ్‌పై 304 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ విఫలమైంది. ఇక సౌతాఫ్రికాపై తొలుత బౌలింగ్‌చేసి ఏకంగా 408 పరుగులిచ్చుకుంది. అయితే ఐర్లాండ్, సౌతాఫ్రికాలపై విండీస్ ప్రదర్శన బౌలింగ్ విభాగం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసింది. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు.. విండీస్ బలమంతా గేల్ ఒక్కడే! జింబాబ్వేపై డబుల్ సెంచరీతో ఒక్కసారిగా ఫామ్‌లోకొచ్చిన గేల్‌ను త్వరగా ఔట్ చేయగలిగితే మిగతా బ్యాట్స్‌మెన్‌కు కట్టడి చేయడం మన బౌలర్లకు చిటికెలోపని.
పిచ్ పిచ్చిగా బౌలర్లకు.. బ్యాట్స్‌మెన్‌కూ!:
మొన్న శనివారం వాకాలో భారత్‌పై యూఏఈ కేవలం 102 పరుగులకే ఆలౌటైంది. ఇదే పిచ్‌పై నాల్రోజుల తర్వాత ఆస్ట్రేలియా మాత్రం 417 పరుగులతో వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అంటే వాకా పిచ్ అంచనాలకు అందదన్నమాట. అది పేసరైనా, స్పిన్నరైనా లైన్ అండ్ లెంగ్త్ పాటించే బౌలర్లకు వికెట్ల హోలీనే! అలాగే షాట్ల ఎంపికలో కచ్చితంగా ఉండే బ్యాట్స్‌మెన్‌కూ పరుగుల రంగేళినే! వర్షం పడే సూచనలు లేవు. పెర్త్‌లో గత రెండు మ్యాచ్‌లకు అద్భుతంగా అనుకూలించిన వాతావరణం శుక్రవారం కూడా ఆహ్లాద పరచనుంది.
వీరి ఆట చూద్దామా
ఈ మ్యాచ్ కోసం అభిమానుల కళ్లన్నీ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌పైనే ఉన్నాయి. వాకాలోనే గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి యూఏఈ లైనప్‌ను కకావికలు చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేరు కాబట్టి అశ్విన్ నుంచి మరో అద్భుత గణాంకాలు నమోదైనా ఆశ్చర్యం లేదు. గేల్ దూకుడును అడ్డుకునేందుకు బౌలింగ్ దాడిని స్పిన్నర్లతోనే ప్రారంభించాలని గవాస్కర్ సూచించిన నేపథ్యంలో కెప్టెన్ ధోనీ.. కొత్త బంతిని అశ్విన్ చేతికి ఇచ్చినా ఇవ్వొచ్చు.
జాసన్ హోల్టర్..
ఈ విండీస్ కెప్టెన్‌కు గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ బ్యాండ్ బజాయించారు. ఆ మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి, ఓ వికెట్‌ను పడగొట్టిన (3-2-5-1) హోల్టర్ గణాంకాలన్నీ తర్వాత డివిలియర్స్ విజృంభణకు చెదిరిపోయాయి. చివరికి తన కోటా పది ఓవర్లలో 104 పరుగులిచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటానంటున్న హోల్టర్ ప్రదర్శన ఈ మ్యాచ్‌లో ఎలా ఉండబోతోందో?
ఇవీ జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రహానే, రైనా, ధోనీ (కీపర్, కెప్టెన్), జడేజా, అశ్విన్, భువనేశ్వర్/షమీ, మోహిత్, ఉమేశ్.
వెస్టిండీస్: డ్వెన్ స్మిత్, గేల్, జొనాథన్ కార్టర్, శామ్యూల్స్, రామ్‌దిన్ (కీపర్), సిమన్స్, డారెన్ సమీ, అండ్రీ రస్సెల్, హోల్డర్ (కెప్టెన్), జెరోమ్ టేలర్, సులెమన్ బెన్.