హైదరాబాద్, మార్చి 28: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భాగ్యనగరంలోని విభిన్న వేదికలు, మండపాల్లో శని...
హైదరాబాద్, మార్చి 28: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భాగ్యనగరంలోని విభిన్న వేదికలు, మండపాల్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సారి మరిన్ని ఎక్కువ చోట్ల కల్యాణం నిర్వహించటంతో శనివారం నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో నాంపల్లి రైల్వేగూడ్స్ గేటు వద్ద నున్న శ్రీరామ హనుమాన్ మందిర ప్రాంగణంలో ఈ నెల 21వ తేదీ నుంచి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన 79వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. శ్రీరామ భక్తసమాజం కార్యదర్శి చల్లపల్లి వేంకటచలపతిరావు నేతృత్వంలో కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు, మహిళలు సకుంటుబ సపరివార సమేతంగా భారీ సంఖ్యలో విచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో శ్రద్ధగా వీక్షించి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. తొలుత విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి గౌరీపూజ శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోకకల్యాణార్ధం పాణిగ్రహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతమ్మవారి మంగళసూత్రాన్ని భాజభజంత్రీలతో మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు.శ్రీ రామ హనుమాన్ మందిరం, కళ్యాణ మడపం ముందు పసిడి వర్ణపు పండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 10 గంటల నుండి 12గంటల వరకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరగ్గా, అంతకు ముందు నిత్య పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు, వందలాది మంది దంపతులు శ్రీ సీతారాములకు శాస్త్రోతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో తలంబ్రాలను సమర్పించారు. కల్యాణం అనంతరం అన్నదాన సంతర్పణ నిర్వహించారు. రాత్రి స్వామివారి పల్లకీ ఊరేగింపు, చెండ్లాడింపు, మేజువాణి తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. 1వ తేదీతో ముగియనున్న ఉత్సవాలు ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్ట్భాషేక మహోత్సవమలు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ భక్త సమాజం కార్యదర్శి చల్లపల్లి వేంకటచలపతి రావు తెలిపారు. అలాగే శ్రీ సీతారాముల ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఊరేగింపు దేవాలయం నుండి ప్రభుత్వ ఆస్పత్రి, బజార్‌ఘాట్, రెడ్‌హిల్స్, జంగం బస్తీ, దేవి బాగ్, దేవాలయం మీదుగా నిర్వహించి అనంతరం దంపతీ తాంబూలం, పవళింపుసేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీన ద్వాదశి పారణ, కలశోద్వాసన కార్యక్రమాలతో ఈ ఏడు వసంత నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నట్లు వివరించారు.
