(31 Mar) -వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుకు గడువు అవసరం -హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం డి సెంబరు నాటికి హైదరాబాద్ మహా...
(31 Mar) -వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుకు గడువు అవసరం
-హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం
డిసెంబరు నాటికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయగలమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ, రిజర్వేషన్ల ఖరారు అంశాలకు 249 రోజులు అవసరం అవుతోందని ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఎన్నికలు నిర్వహించాలంటే ఈ గడువు అనివార్యమంటూ తెలంగాణ ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ పేర్కొన్నారు. డిసెంబర్ రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని కోరటంతో పాటు జీహెచ్ఎంసీ బాధ్యతల నిర్వహణను ప్రత్యేక అధికారికి అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ 2న జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై మరోమారు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయన్నారు. అందులో భౌగోళిక స్వరూపం ఆధారంగా 200ల వార్డులను విభజించాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని, మరోవైపు వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపునూ చేపట్టాల్సి ఉందని వివరించారు. అంశాల వారీగా చర్యలకు సమయం పడుతోందన్నారు. మొత్తం మీద డిసెంబర్ రెండో వారానికి అన్నీ సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజ్ శ్రీనివాస్.. గతంలో చెప్పిన అంశాల్నే ప్రభుత్వం పునరావృతం చేస్తోందని, ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొంటూ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రమాణపత్రంపై తిరుగు సమాధానం (రిప్త్లె కౌంటర్) దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.