(27 Mar) శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్పలు సవరణలు కోరిన విపక్షాలుఒక్కదానికీ సమాధానం చెప్పలేదు: అక్బర్శాసనసభ నిరవధిక వాయిదాఈనాడు, హైదరా...
(27 Mar) శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్పలు సవరణలు కోరిన విపక్షాలుఒక్కదానికీ సమాధానం చెప్పలేదు: అక్బర్శాసనసభ నిరవధిక వాయిదాఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ గురువారం ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రజాసమస్యలు పరిష్కరించేలా లేదంటూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. మిగిలిన ప్రతిపక్షాలూ నిరసన తెలపడంతోపాటు బిల్లులో సవరణలు కోరాయి. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన బడ్జెట్‌కు అభ్యంతరం తెలపకుండా మద్దతివ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం సాయంత్రం 6గంటలకు ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సభాపతి మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ద్రవ్యవినిమయ బిల్లును గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ ''పద్దులపై చర్చలో ఇంతమంది విలువైన సూచనలు చేయడం తెలంగాణ ప్రభుత్వ ఘనతే. మౌలిక సమస్యల పరిష్కారం, సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందించాం. అనేక సమస్యలున్నా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రూ.65వేల కోట్లు ఖర్చు చేశాం. సంక్షేమఫలాలు అందించాం. మేనిఫెస్టోలోని అంశాలతోపాటు అందులో చెప్పనివీ అమలు చేస్తున్నాం. ఈ బడ్జెట్లో కేంద్ర నిధులపై పెద్దగా ఆశ పెట్టుకోలేదు. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రమని నమ్మకం కల్పించడంవల్లే బహుళజాతి సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. రైతు ఆత్మహత్యల నివారణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం'' అని చెప్పారు.మంత్రాంగం, యంత్రాంగం ఉన్నాయిగా..: అంతకుముందు ద్రవ్యవినిమయ బిల్లుపై కాంగ్రెస్ శాసనసభ్యుడు వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, రెండు పడకగదుల ఇల్లు, అభయహస్తం తదితర పథకాల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయింపులు చూసి మురిసిపోవడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. హామీల అమలుకు మంత్రదండం లేకపోవచ్చేమోగానీ మంత్రాంగం, యంత్రాంగం వారి చేతిలోనే ఉన్నాయన్నారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ఐకేపీ వీఓఏలను పోలీసులు బూట్లతో తొక్కి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.కాంగ్రెస్ నిరసన: బడ్జెట్ వాస్తవదూరంగా ఉందంటూ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోద సమయంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం పెంచాలన్నా పట్టించుకోలేదన్నారు. 401 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నా కరవు మండలాలను ప్రకటించలేదని నిరసన తెలిపారు. తాను బడ్జెట్‌పై అడిగిన అంశాల్లో ఒక్కదానికీ ప్రభుత్వం జవాబివ్వలేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకపోవడం విచారకరమని అక్బరుద్దీన్, ఉత్తమ్‌కుమార్‌లు అన్నారు. వచ్చే ఏడాది బిల్లు సమయంలోనైనా సీఎం సభలో ఉండాలని అక్బర్ సూచించారు. ధాన్యం 25 శాతం లెవీని కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానించింది.
