* అడుగడుగునా ఏపీ సీఎం ఆటంకాలు: కేసీఆర్ * కృష్ణా జలాలు, విద్యుత్ విషయంలో ఏపీ ఫిర్యాదులు * కేంద్రంతో కలసి అవరోధాలు సృష్టిస్తున్న చంద్రబాబ...

* కృష్ణా జలాలు, విద్యుత్ విషయంలో ఏపీ ఫిర్యాదులు
* కేంద్రంతో కలసి అవరోధాలు సృష్టిస్తున్న చంద్రబాబు
* మండలి ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేయొద్దు
* ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు ఓటేయాలా?
* హైకోర్టు విభజనపై ఆ పార్టీ ఏం చేస్తోంది?
* టీడీపీ, బీజేపీల నీతిని ప్రజలే గమనించాలి
* టీఆర్ఎస్ సభ్యత్వం 50 లక్షలు దాటిందన్న సీఎం
* తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
* పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూలు ఖరారు
* ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 24 వరకు కొత్త కమిటీల ఎన్నిక
* ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అణగారిన మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా పది లక్షల ఎకరాలకు నీరివ్వాలనుకుంటే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తూ అడ్డుపడుతున్న ఏపీ సర్కారు.. పట్టిసీమ ఎత్తిపోతలకు మాత్రం నీటిని తరలించుకుంటోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు.
కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌లో పోరాడి రాష్ర్ట వాటాను సాధించుకుని తీరుతామన్నారు. విద్యుత్ విషయంలోనూ రాష్ట్రానికి చంద్రబాబు నష్టం కలిగిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ‘విభజన చట్టం మేరకు తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ కోటాను ఎగ్గొడుతున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు భాగ స్వామి కాబట్టి కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది’ అని సీఎం వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవ న్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే
శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని, ఈ మేరకు తమ సర్వేలు తేల్చాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ తమ అభ్యర్థులకు ఓట్లేయాలని అడుగుతోంది. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని మా నుంచి లాక్కుని ఏపీలో కలిపేసినందుకు ఓట్లేయాలా? బీజేపీ ఏం చేసిందని ఓట్లేయాలి? హైకోర్టు విభజనపై బీజేపీ నేతలు కేంద్రంతో ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నో అవరోధాలు సృష్టిస్తున్నా యి.
వాటి నీతి ఏమిటో పట్టభద్రులు గమనించాలి. ప్రజల ఎజెండాతో ముందుకుపోతున్న టీఆర్ఎస్కు ఓటేయండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి అపార సేవలు అందించిన దేవీప్రసాద్‌ను, సామాజిక కార్యకర్త అయిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పనిచేసే ప్రభుత్వం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తమ ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుందని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,300 మెగావాట్ల విద్యుత్ ఉందని, వచ్చే నాలుగేళ్లలో దాన్ని 24 వేల మెగావాట్లకు పెంచుతామని తెలిపారు. తమ అభివృద్ధి పనులకు మద్దతుగా పట్టభద్రులు టీఆర్ఎస్ వెనుక నిల వాలన్నారు.
సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ వెల్లడి
పార్టీ సభ్యత్వం 50 లక్షలు దాటిందని, రూ. 9.26 కోట్ల సభ్యత్వ రుసుము వసూలైందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 38 లక్షల సభ్యత్వాల వివరాలను ఆన్లైన్లో పెట్టామని, ప్రతీ కార్యకర్తకు వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పిస్తామని, బీమా కంపెనీలతో కూడా మాట్లాడామని చెప్పారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు ఈ నెల 24వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు, మండల, మున్సిపల్ శాఖల ఎన్నికలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇక జిల్లా అధ్యక్షుల ఎన్నికలను ఏప్రిల్ 24లోపు పూర్తి చే స్తామన్నారు. ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో అన్ని శాఖల కమిటీలు, నేతలతో విస్తృత సమావేశం ఉంటుందని, అందులోనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు. 27న పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రు లు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పద్మారావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు
పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిస్థితి మెరుగ్గా ఉందని, హైదరాబాద్‌లో మరింత దృష్టి సారించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. రాజేశ్వర్‌రెడ్డి ఎన్నిక బాధ్యతలను మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు చూసుకుంటారని, మిగిలిన వారంతా హైదరాబాద్‌పై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్దేశించినట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇక దేవీప్రసాద్ కోసం ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు తీరు, సంస్థాగత ఎన్నికలపైనా సీఎం సమీక్షించారు. ఇతర అంశాలేవీ చర్చకు రాకపోవడంతో 45 నిమిషాల్లోనే ఈ భేటీ ముగిసింది.