-పదేండ్లు తగ్గించేందుకు సిద్ధమన్న ఈటల -రాష్ట్ర సాధనలో విద్యార్థి, యువత భాగస్వామ్యం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాకారంలో విద్యార్థులు...
-పదేండ్లు తగ్గించేందుకు సిద్ధమన్న ఈటల
-రాష్ట్ర సాధనలో విద్యార్థి, యువత భాగస్వామ్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాకారంలో విద్యార్థులు, యువకులు భాగస్వామ్యం ఎంతో ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. యువకుల భవిష్యత్తుకోసం కొత్త ఉద్యోగాల నియామకాల్లో పది సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపునకు సర్కారు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ తదుపరి సభ్యులు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చెన్నమనేని రమేశ్ అడిగిన ప్రశ్నలకు రాజేందర్ సమాధానమిచ్చారు. మద్యం విక్రయాలతో ఆదాయం పెంచుకోవాలని, పన్నుల పెంచాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆయన స్పష్టంచేశారు. జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నామని, హెల్త్‌కార్డుల విషయంలో రామచంద్రమూర్తి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రదీప్‌చంద్ర కమిటీ వేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఐదువేల గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంవంటి దేవాలయాలు వాటి వనరులపై అవి నిలదొక్కుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం కటింజెన్సీ ప్రోగాం అమలుచేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకం అమలుచేయడంద్వారా స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. గుడిసెలులేని బస్తీల విషయంలో ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని చెప్పారు. కాకతీయ ఉత్సవాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఖర్చుపెడుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా నక్కలగండి-డిండి ఎత్తిపోతల పథకం అమలుకు ప్రాధాన్యం ఇస్తుందని రాజేందర్ చెప్పారు.