హైదరాబాద్ : శ్రీరామ నవమిని పురస్కరించుకుని శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆయా దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వ...
హైదరాబాద్ : శ్రీరామ నవమిని పురస్కరించుకుని శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆయా దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్యన స్వామి వారి కల్యాణోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి శ్రీరామ నవమి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లను చేసింది. అధికారికంగా పండుగను నిర్వహించింది. దీనితో రామాలయాలన్ని భక్తులతో కళకళలాడాయి. వాడ వాడల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ది చెందిన భద్రాదితో పాటు యాదగిరిగుట్ట, సిద్ధిపేట, వేములవాడ, ఇల్లంతకుంట, భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి తదితర పట్టణాలలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు తండోపతండలుగా తరలివచ్చారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తలు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాల్లో జరిగిన సీతా రాముల కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో సీతారాముల మహాభిషేకం నిర్వహించారు. దీనికి ప్రభుత్వం తరుపున ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో లో శ్రీరామ నవమి శోభయాత్ర మంగల్హట్లోని సీతారాంబాగ్ నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయమశాలకు జరిగిన శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ నవమిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో దేవాలయాలన్ని చూడముచ్చటగా అలంకరించబడ్డాయి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సీతారాముల కల్యాణం చూసి భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవం అనంతరం అన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
