ఆదిలాబాద్, : సాగునీటి వనరులు లేక వట్టిపోయిన పంట భూములకు సాగునీరు అందించి, రైతులకు బంగారు సిరులు పండించేందుకే ప్రభుత్వం కాకతీయ మిషన్ ద్వా...
ఆదిలాబాద్, : సాగునీటి వనరులు లేక వట్టిపోయిన పంట భూములకు సాగునీరు అందించి, రైతులకు బంగారు సిరులు పండించేందుకే ప్రభుత్వం కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని, బంగారు తెలంగాణసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని జందాపూర్లో రూ. 19లక్షల 90 వేల వ్యయంతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇదే గ్రామంలోని శ్మశాన వాటిక వరకు రూ.6లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు, మురికి కాల్వల పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ కాకతీయ కాలం నాటి చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కాకతీయ మిషన్‌కు శ్రీకారం చుట్టారని, అన్ని గ్రామాల్లో చెరువులకు మహార్ధశ పట్టనుందని, తద్వారా రైతుల కలలు సాకారం కానున్నాయని మంత్రి అన్నారు. ప్రస్తుతం చెరువులు అక్రమాలకు గురై, సాగు, తాగునీటికి సౌకర్యం లేకుండా పోయిందన్నారు. దీంతో రైతులు, ప్రజలుఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల పూడికతీతలు, నిర్మాణ పనులు చేపట్టి చెరువులకు పునరువైభవం తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. దానిలో భాగంగానే జిల్లాలో 3976 చెరువులు గుర్తించడం జరిగిందని, ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున 790 చెరువుల నిర్మాణ పనులు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 350 చెరువులకు టెండర్లు పూర్తి అయిందని, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగు నీరందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు ఈ పథకంలో భాగస్వాములై చెరువుల పునరుద్దరణ పనులు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దితో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలుచేయబడుతున్నాయని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రాబోవు నాలుగు సంవత్సరాలలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్దమైన తాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ సిఈవో జితేందర్ రెడ్డి, తహసీల్దార్ సుభాష్ చందర్, ఇరిగేషన్ ఇఇ సునిల్‌కుమార్, జడ్పీటీసి అశోక్, ఎంపీటీసీ నైతం లక్ష్మి, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, సర్పంచ్‌లు లింగమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
