-టీఆర్‌ఎస్ అలుపెరుగని ప్రస్థానానికి 14ఏండ్లు -నిన్న తెలంగాణ కోసం..ఇవాళ బంగారు తెలంగాణ కోసం అది 2001 ఏప్రిల్ 27! ఈ రోజు 36వేల మంది ప్ర...
-టీఆర్‌ఎస్ అలుపెరుగని ప్రస్థానానికి 14ఏండ్లు
-నిన్న తెలంగాణ కోసం..ఇవాళ బంగారు తెలంగాణ కోసం
అది 2001 ఏప్రిల్ 27! ఈ రోజు 36వేల మంది ప్రతినిధులు కొలువుదీరిన ఎల్బీ స్టేడియంకు కూత వేటు దూరంలో.. హుస్సేన్‌సాగర్ ఒడ్డున జలదృశ్యంలో చోటు చేసుకున్న ఒక అపూర్వ సన్నివేశం! కేవలం వందల సంఖ్యలోనే హాజరైన ప్రతినిధులు.. అందులోనూ 1969 ఉద్యమంలో పాల్గొన్నవారే అధికం!
మరికొందరు విద్యావంతులు, మేధావులు! మెయిన్‌స్ట్రీమ్ రాజకీయ నాయకులు లేరు! ఒక రకమైన గంభీరమైన వాతావరణం. నమ్మకం-అపనమ్మకాల మధ్య తెలంగాణ ఆకాంక్ష మాత్రమే రాజ్యమేలిన ఘట్టం. తెలంగాణ ఉద్యమప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. హింసకు తావివ్వకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంథాను నిర్దేశించారు. ఆ వేదిక మీద ఉద్యమనేత కేచంద్రశేఖర్‌రావు డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వాలను త్యాగం చేస్తూ చేసిన ప్రకటన ఉద్యమానికి ప్రాణప్రతిష్ట చేసింది. పవిత్రతను రంగరించింది. నాటి సభలో కేసీఆర్ ప్రసంగం, పదవీ త్యాగం, భవిష్యత్తు కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. దశాబ్దాలుగా అణచిపెట్టుకున్న తెలంగాణ ఆకాంక్ష పెల్లుబికింది. 20 రోజుల వ్యవధిలో కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించి ముందున్నదంతా ఉద్యమ ప్రస్థానమేనని సంకేతమిచ్చారు.
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పింది టీఆర్‌ఎస్ బలాన్ని బలగాన్ని చాటింది కరీంనగర్ సింహగర్జన సభనే. తమది ఒంటరి పోరాటం కాదన్న సందేశంతో నాటి సభకు ముఖ్యఅతిథిగా శిబూసొరేన్‌ను ఆహ్వానించారు. 2001 మే 17న నిర్వహించిన నాటి సభకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చిన తీరు మహామహా రాజకీయ విశ్లేషకులను నివ్వెర పరిచింది. ఎడ్లబండ్లనుంచి మొదలుకుని లారీల దాకా ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వాహనాలు మాట్లాడుకుని ప్రవాహంలా కదిలివచ్చారు. ఆ వేదిక మీదే పలువురు మెయిన్ స్ట్రీం రాజకీయవాదులు గులాబీ జెండాను అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్ని అంశాలను స్పృశిస్తూ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల గుండెల్లోకి నేరుగా దూసుకువెళ్లింది.
కరీంనగర్ సభ టీఆర్‌ఎస్‌కు ఊపునే కాదు తెలంగాణ సందేశం మూలమూలకు చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని సందేశాన్ని కూడా ఇచ్చింది. తెలంగాణ జెండా అందుకోవడం కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూస్తున్నారన్న వాస్తవాన్ని కండ్లకు కట్టింది. జూన్ 1నుంచి భావజాల ప్రచారయాత్ర రూపుదిద్దుకుంది. మొదటి అడుగు పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచిన పాలమూరు. హైదరాబాద్‌నుంచి మహబూబ్‌నగర్‌దాకా జనప్రవాహం. ఎక్కడికక్కడ మంగళహారతులతో స్వాగతాలు.తెలంగాణను నిండా ముంచుతూ ఆంధ్రలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్న నాటి ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుల్లో పారేది తెలంగాణ నెత్తుటి ప్రవాహాలేనని పాలమూరు వేదికగా గట్టి హెచ్చరిక పంపారు. మరుసటి రోజు చందమామల వంటి పిల్లల జీవితాలను ఫ్లోరైడ్ మహమ్మారి చిదిమేసిన నల్లగొండ జిల్లాలో సభ. సాగర్ కెనాల్ మీద ఆంధ్రలో లిప్టుల నిర్వహణ ప్రభుత్వం తీసుకుని తెలంగాణ నిర్వహణ వ్యయాన్ని తెలంగాణ రైతులమీద రుద్దుతున్న సర్కారు దుర్ణీతిని బట్టబయలు చేసింది. 4వ తేదీ తెలంగాణకు గర్వకారణమైన బోధన్ చక్కెర బతుకులకు చేదు మిగిల్చిన నిజామాబాద్ జిల్లా. ఆహ్వానం అపూర్వం. అక్కడినుంచి విషజ్వరాలతో పిట్టల్లా రాలుతున్న ఆదివాసీల పురిటిగడ్డ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం. ఆ చివరను ఉన్న సింగరేణినుంచి ఈ చివరన ఉన్న ఊట్నూరు దాకా తెలంగాణ సంరంభం. గిరిజన గూడాల్లో గుడిసెల మీద గులాబీ జెండాలు రెపరెపలాడిన సందర్భం. 21వ తేదీన వరంగల్లు. పాలకుల గుండెలు ఝల్లుమనిపించే రీతిలో తరలివచ్చిన జనప్రవాహం. యావత్ తెలంగాణకు ఇచ్చిన సందేశం.. తెలంగాణ సాధించాలి.. సాధించి తీరాలన్న సంకల్పం.
ఎన్నికల రాజకీయాల్లో తొలిఅడుగు..
రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ బలాన్ని నిరూపించుకునే అవకాశం అతి తొందర్లోనే వచ్చింది. జూలై నెలలో స్థానిక ఎన్నికలు వచ్చాయి. అప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తికావడం తెలంగాణ సందేశం ప్రజల్లోకి చేరడంతో ఈ ఎన్నికల్లో అది ప్రతిఫలించింది. వంద ఎంపీపీలు, 85 జెడ్పీటీసీలతో పాటు 9 జెడ్పీలకు గానూ రెండు జెడ్పీలను టీఆర్‌ఎస్ అలవోకగా కైవసం చేసుకుంది. వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో గణనీయ స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ సహాయ నిరాకరణ కారణంగా చెరో రెండు జెడ్పీలను సాధించుకోగలిగి చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడువేలమంది సర్పంచులను, 12వేల మంది వార్డు సభ్యులను కూడా గెలుచుకుని ప్రధాన రాజకీయపార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. కేవలం మూడునెలల గుడ్డుగా ఉన టీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 26 శాతం దాకా ఓట్లు సాధించి తన స్టామినా ఏమిటో చాటిచెప్పింది.
మరో పరీక్ష..
ప్రచార యాత్ర, పంచాయతీ విజయం సాధించిన మూడునెలల్లో మరో పరీక్ష వచ్చింది. కేసీఆర్ రాజీనామా చేసిన సిద్దిపేట స్థానానికి సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక. టీఆర్‌ఎస్ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక. పంచయతీ విజయం తర్వాత వివిధ పార్టీలనుంచి పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. పది జిల్లాలనుంచి నాయకులు కార్యకర్తలు క్యాడర్ మొత్తం సిద్దిపేటకు చేరింది. మండలాలు క్లస్టర్లుగా నియోజకవర్గాన్ని పంచుకుని ప్రచారాన్ని సాగించారు.చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని డబ్బులు కుమ్మరించినా కేసీఆర్ రికార్డులు బద్దలు కొట్టి విజయం సాధించారు. ప్రజాక్షేత్రంలోని తెలంగాణ నినాదం శాసనసభకు చేరింది. దానితో పాటు తొలివిడత అవకాశం చిక్కని జిల్లాల్లో మళ్లీ భావజాల ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఈసారి ఖమ్మం జిల్లాకు తెలంగాణ సందేశం చేరింది.
2002 టీఆర్‌ఎస్‌కు కీలక సంవత్సరం. అంతదాకా తెలంగాణ భావజాల వ్యాప్తిపైనే అధికంగా దృష్టి పెట్టారు. ప్రచారానికి బహిరంగ సభలు వంటి ప్రక్రియలను చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శంఖారావం దాకా అది కొనసాగింది. పార్టీ తొలి ఆవిర్భావ సదస్సు నల్లగొండలో జరిగింది. ఏడాది కాలంలో ఉద్యమ స్వరూప స్వభావాలు సమీక్షించి దాన్ని మరింత విస్తృత పరచాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలపై పోరాటాలకు దిశానిర్దేశం చేశారు. మొట్టమొదటి కార్యక్రమం పల్లెబాట. నెలల తరబడి ఈ కార్యక్రమం సాగింది. అనేక ప్రజాసమస్యలు తీసుకుని పాదయాత్రలు నిర్వహించారు. ఏడాది పొడువునా ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
తర్వాత కాలంలో కొంత స్తబ్దత. రాజకీయంగా ఒడిదుడుకులు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందంటూ మీడియా దుష్పచారాలు. టీఆర్‌ఎస్సా..అది ఉందా... దాని అడ్రస్ ఎక్కడుంది? అంటూ చంద్రబాబు ఎకసక్కాలు. బదులు చెప్పాలని పార్టీ నిర్ణయించింది. 2003 జనవరి 6 హైదరాబాద్ నగరాన్ని జనప్రవాహం ముంచెత్తింది. రాజకీయ పార్టీలేవీ సభలు పెట్టడానికి సాహసించని జింఖానా మైదానంలో టీఆర్‌ఎస్ సభ. రాంవిలాస్ పాశ్వాన్ సహా పలువురు జాతీయనాయకుల ఆసీనులై ఉన్న వేదిక మీద కేసీఆర్ నిప్పులు కురిపించే ప్రసంగంతో తెలంగాణ దద్దరిల్లింది. చంద్రబాబూ...టీఆర్‌ఎస్ అడ్రస్ ఎక్కడుందో కనిపిస్తున్నదా? అంటూ కేసీఆర్ వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చే దమ్ములేక టీడీపీ నాయకులు మీడియాకు ముఖం చాటేశారు.
తెలంగాణవాదం..టీఆర్‌ఎస్ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పోయే బాపతు కాదని.. జింఖానాలో జనహోరు సందేశం పంపించింది. అదే వూపులో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వెయ్యి కార్లతో ఢిల్లీకి ర్యాలీ. మార్చి 27న ఢిల్లీ నగరం హనుమంతుని తోకలా రహదార్లమీద సాగిన టీఆర్‌ఎస్ ర్యాలీని చూసి ముక్కున వేలేసుకున్నది. జాతీయమీడియా తెలంగాణ ఉద్యమం మీద ప్రత్యేకవ్యాసాలు రాసింది. విజయంతో విశ్రాంతి తీసుకోలేదు. మరో రికార్డు దిశగా టీఆర్‌ఎస్ సంకల్పంతీసుకుంది. పార్టీ రెండో ఆవిర్భావం సందర్భంగా వరంగల్‌లో 15 లక్షల మందితో వరంగల్ జైత్రయాత్ర తలపెట్టింది. ఇది అక్షరాలా జైత్రయాత్రే అయింది. జింఖానా గ్రౌండ్ సభను వరంగల్ బద్దలు కొట్టింది. కేసీఆర్ స్వయంగా సిద్దిపేటనుంచి వరంగల్‌దాకా సైకిల్ యాత్ర చేశారు. ఈసారి ముఖ్య అతిథి మాజీ ప్రధాని దేవేగౌడ. పది జిల్లాలనుంచి ఉద్యమకారుడన్న ప్రతివారూ తరలివచ్చారు.
వరంగల్ రహదారులన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోగా లక్షల జనం సభాప్రాంగణం బయటే ఉండిపోయారు. ఇంతభారీ సభను నేనెప్పుడూ చూడలేదని దేవెగౌడ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇక మేం తెచ్చేదేముంది. మీ శక్తికి ఓట్లుగా మార్చండి. తెలంగాణ ఇక ఎవరూ ఆపలేరని ప్రజలకు ఆయన సందేశమిచ్చారు. తెలుగుదేశం శిబిరంలో కలకలం మొదలైంది. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణ చేజారుతుందన్న ఆలోచన ప్రారంభమైంది. మేనెలలో నిప్పులు చెరిగే ఎండల్లో పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అలంపూర్ జోగులాంబకు ఆర్చించి పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రజలతో మమేకమవుతూ పట్టణాల్లో సభలు నిర్వహిస్తూ రైతుల కడగండ్లను తెలుసుకుంటూ ముందుకు సాగింది. జలవనరుల అంశం ప్రధానంగా ఈ యాత్ర సాగింది.
ఉద్యోగుల సమస్యలు..
యువత రైతుల తర్వాత ఉద్యోగుల మీదకి టీఆర్‌ఎస్ దృష్టి మరల్చింది. జూన్ నెలలో 610 జీవో అంశం మీద మొదటి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్ట రాష్ట్రం పరిధిదాటి దేశవ్యాప్తమైంది. ఢిల్లీలో నేషనల్ ఫోరం ఫర్ న్యూస్టేట్స్ ఏర్పాటైంది. కేసీఆర్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. సెప్టెంబర్ నెలలో మరో ప్రచారయాత్ర. ఈసారి జిల్లా కేంద్రాలనుంచి ఇతర ప్రధాన పట్టణాలను ఎంచుకున్నారు. నాగర్ కర్నూల్ నగారా మార్మోగింది. టీడీపీ నేతలనుంచి మొదటిదాడి ఈ సందర్భంగానే నమోదైంది. ఆ పార్టీ కార్యకర్తలు విసిరిన రాయి నాటి జెడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డిని గాయపరిచింది. తర్వాత సింగూర్ సింహగర్జన. మహబూబ్‌నగర్లో పాలమూరు గర్జన. నిజామాబాద్‌లో ఇందూరు సింహగర్జన. జనగాంలో ఓరుగల్లు వీరగర్జన. సిరిసిల్లలో కరీంనగర కదనభేరి.. ఇలా ద్వితీయశ్రేణి నగరాలను టీఆర్‌ఎస్ ప్రభంజనం చుట్టేసింది.
2004.. తెలంగాణ సాధనలో తొలి అడుగు.
అప్పటికి రెండు ఎన్నికల్లో మట్టి కరిచి చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్ అధికారం కోసం టీఆర్‌ఎస్‌తో స్నేహానికి చేయి సాచింది. ఒక బలమైనజాతీయస్థాయి రాజకీయ పక్షం తెలంగాణకు మద్దతు ప్రకటించడం ఇదే ప్రథమం. గౌరవప్రదమైన సీట్ల సర్దుబాటుతో 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తలపడింది. 26 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంటు స్థానాలకు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. సమైక్యవాదం వినిపించిన టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ వెంటనే కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కూడా చేరింది. ఆనాటి ఆ వాగ్దానమే 2014లో తెలంగాణ ఏర్పాటుకు బీజం వేసింది. టీఆర్‌ఎస్ చాకచక్యంగా వ్యవహరించి కేంద్ర క్యాబినెట్‌లో చేరి కాంగ్రెస్ వెనక్కిపోలేని స్థితిని కల్పించింది. తెలంగాణ అంశంపై ప్రణబ్ కమిటీ ఏర్పాటైంది. అక్కడినుంచి టీఆర్‌ఎస్ కార్యచరణకు ఢిల్లీ కేంద్రమైంది. క్యాబినెట్ మంత్రులుగా వచ్చిన అవకాశాన్ని వివిధ పార్టీల మద్దతు లేఖలు కూడగట్టేందుకు వినియోగించుకున్నారు. మెజారిటీ పార్టీల లేఖలు సాధించారు.
అయినా కాంగ్రెస్ మీనమేషాలు లెక్కపెట్టడం ప్రారంభించింది. రెండేండ్లపాటు ఆశనిరాశల పయనం తర్వాత కేంద్రమంత్రివర్గంనుంచి టీఆర్‌ఎస్ వైదొలిగింది. మరోవైపు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను మింగేసే యత్నాలకు వైఎస్ పూనుకున్నారు. ఒకరొకరుగా ఎమ్మెల్యేలను లాగేయడం ప్రారంభించారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణవాదానికి ప్రాణప్రతిష్ట చేయాలని కేసీఆర్ సంకల్పించారు. కరీంనగర్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ ఎదుర్కున్న అతిపెద్ద అగ్నిపరీక్ష. తెలంగాణవాదాన్ని హిమాలయం మీద నిలిపిన ఎన్నిక. కేసీఆర్ రెండు లక్షల మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించారు. ఇక తెలంగాణ వాదానికి మరింత పదును పెట్టారు కేసీఆర్. 2006లో తెలంగాణ భవన్ ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అది ప్రతిబింబమైంది. మరుసటి సంవత్సరమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. ఊరూరా తల్లి విగ్రహాల ఆవిష్కరణలు, తెలంగాణ ధూదాం ఆటపాటలతో దద్దరిల్లాయి. 2008లో పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ 7వ వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. 2009లో సిద్దిపేటలో ఉద్యోగుల సభ నిర్వహించారు.
2009 ఎన్నికలు తెలంగాణకు ఎదురే ఉండరాదన్న లక్ష్యంతో టీడీపీతో పొత్తుకు టీఆర్‌ఎస్ ఓకే చెప్పింది. ఎన్నికల్లో టీడీపీయే స్వయంగా వెన్నుపోట్లకు దిగింది. ఫలితాలు చేదు అనుభవం మిగిల్చాయి. మళ్లీ ఒక స్తబ్దత. కొంతకాలం వ్యూహాత్మక మౌనాన్ని పాటించాల్సి వచ్చింది. వైఎస్ అకాల మరణంతో రోశయ్య పదవి చేపట్టారు. ఈ సమయంలోనే హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం ముందుకు వచ్చింది. తెలంగాణ బిడ్డలకు చెప్రాసీ పోస్టులు కూడా దక్కకుండా చేసే కుట్ర.
మౌనాన్ని బద్దలు కొట్టి ఆందోళనకు పార్టీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రం రావడమే ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం అన్న కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష ప్రకటించారు. రాష్ట్రం ఉద్వేగంతో ఊగిపోయింది. 2009 నవంబర్ 29న కరీంనగర్ దాటగానే కేసీఆర్‌ను ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది. రాష్ట్రం భగ్గుమంది. యువత ఆత్మాహుతులు చేసుకున్నారు. తర్వాత కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారు. డిసెంబర్ 5న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన కేంద్రం ముందుకు కదిలింది. సచివాలయంలో రోశయ్య అఖిలపక్షం నిర్వహించగా అన్ని పక్షాలు తెలంగాణకు ఓకే చెప్పాయి. 9 డిసెంబర్ అర్దరాత్రి తెలంగాణ ప్రకటన వెలువడింది.
24 గంటల్లోనే సీమాంధ్ర నాయకుల కుట్రలతో ఆ ప్రకటన వెనక్కిపోగా డిసెంబర్ 23న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్ జేఏసీతో మమేకమై ఉద్యమ పంథా అనుసరించింది. ఏడాదిపాటు ఊరించి ఊరించి చివరకు ఎటూ తేలని నివేదిక ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ. టీఆర్‌ఎస్ ఆందోళనలతో కేంద్రం మళ్లీ సంప్రదింపులు జరుపుతామని ప్రకటించింది.
2010లో ఉద్యమ ప్రచారంలోకి రాజ్‌న్యూస్ చానెల్‌ను టీఆర్‌ఎస్ తీసుకువచ్చింది. సీమాంధ్ర మీడియా దుష్ప్రచారాలకు తెరపడింది. అదే సంవత్సరం జూలైలో జరిగిన ఉపెన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చరిత్రలో కనివిని ఎరుగని మెజార్టీలతో గెలిచారు. కాంగ్రెస్ టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. అప్పటినుంచి ప్రారంభమైన ఉద్యమ కార్యక్రమాలు తెలంగాణ సాధన వరకూ కొనసాగాయి. మిలియన్ మార్చ్‌లు, సాగరహారాలు, సకలజనుల సమ్మెలు ఆందోళన ఏదైనా టీఆర్‌ఎస్ అగ్రభాగాన నిలిచింది. ప్రతి ఎన్నికా టీఆర్‌ఎస్‌కు జైత్రయాత్రే అయ్యింది. చివరకు తెలంగాణ ఇవ్వకుండా ఎన్నికలు ఎదుర్కునే ధైర్యం లేనిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చేపట్టింది.
ఈ క్రమంలో రాయల తెలంగాణ వంటి అనేక అంశాలపై టీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసింది. ఆరు దశాబ్దాల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 ఏండ్లు అవిశ్రాంతంగా శ్రమించిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెకు హత్తుకున్నారు. భారీ మెజార్టీతో అధికారాన్ని అప్పగించారు. రాష్ట్రంలోని 9 జెడ్పీలతో పాటు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడింది. ఇవాళ టీఆర్‌ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు ఎదిగింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల్లో అరకోటి మార్కు దాటిపోవడం ఇదే సూచిస్తున్నది.
Key Tags
TRS party complete 14 years , TRS party , trsplenary2015 , TRS , trs president , KCR trs president