(14 Apr) రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: వచ్చే అయిదేళ్లలో కొత్తగా 17 బొగ్గు గనులను అందుబాటులోకి తీసుకు రావాలని సింగరేణి యాజమాన్యం కసరత్తు చ...
(14 Apr) రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: వచ్చే అయిదేళ్లలో కొత్తగా 17 బొగ్గు గనులను అందుబాటులోకి తీసుకు రావాలని సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. మరోవైపు విదేశాల్లోని బొగ్గు బ్లాకులను దక్కించుకునే అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాల్లో బొగ్గు ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యం చేరుకునే క్రమంలో ఈ ప్రయత్నాలను చేస్తోంది.సింగరేణి కొత్తగా ఏర్పాటు చేసే గనులతో పాటు విస్తరణకు అవకాశమున్న గనులకు సంబంధించిన బొగ్గు నిల్వల నివేదికలను సిద్ధం చేసింది. 17 బొగ్గు గనులను ఐదేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా ఇప్పటికే ఎనిమిది గనులకు సంబంధించిన బొగ్గు నిల్వల నిక్షేపాల నివేదికలను సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గని డిప్ సైడ్‌లో ఏకంగా 90 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం గుర్తించింది. దీంతో పాటు మరిన్ని గనులకు సంబంధించిన పూర్థిస్థాయిలో అన్వేషణ చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసే వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియా పరిధిలో వెంకటాపూర్ బ్లాక్-1, తాడిచెర్ల బ్లాక్-2, కేటీకే-5, 5-ఏ డిప్‌సైడ్ బ్లాక్, కేటీకే-3 లాంగ్వాల్ ప్రాజెక్టు, గొల్లపల్లి, లక్ష్మిదేవిపేట, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా పరిధిలో శ్రావణపల్లి-1, 2 బ్లాకులు, బెల్లంపల్లి ఏరియాలో మాదారం-1 (ఎంవీకే-5, 6) గనులకు సంబంధించిన నివేదికలను అన్వేషణ విభాగం తయారు చేసింది. ఇందులో బొగ్గు ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు బొగ్గు పొరలకు సంబంధించిన మందం, నాణ్యతపరమైన నివేదికలను రూపొందించింది. నివేదికల ఆధారంగా కొత్త గనుల అనుమతులు ప్రభుత్వం నుంచి పొందనుంది.
