హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షా ఫలితాలు ఈ నెల 22న వెలువడనున్నాయి. పదిజిల్లాల్లో జరిగ...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షా ఫలితాలు ఈ నెల 22న వెలువడనున్నాయి. పదిజిల్లాల్లో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం మరో వారం రోజుల్లో ముగియనుండడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాల విడుదలపై దృష్టి సారించారు. ఈ నెల 21న ప్రథమ సంవత్సర ఫలితాలను ఇవ్వాలని నిర్ణయించినా ఆ రోజు మంగళవారం కావడంతో ఫలితాల ప్రకటనను 22వ తేదీ బుధవారానికి వాయిదా వేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు నెలాఖరుకు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. మూల్యాంకనంలో జాప్యం జరుగుతుండంతో ఫలితాల విడుదల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 28 లేదా 29న ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించేందుకు సన్యాహాలు చేస్తున్నామని మూల్యాంకన ప్రక్రియ అనుకున్న తేదీ కన్నా ముందే పూర్తయితే ద్వితీయ సంవత్సర ఫలితాలను 28వ తేదీ కన్నా ముందే ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. హైదరాబాద్లో మూల్యాంకనాన్ని బహిష్కరించిన అధ్యాపకులు: ఒక్కొ జవాబు పత్రం మూల్యాంకనానికి రూ. 30 చెల్లించాలని, కార్పోరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలన్నింటిని కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకనంలో పాల్గొనకుండా అధ్యాకులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న తమకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని ఉద్యోగులకు ఇస్తున్న విధంగా ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఇవ్వాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఒక్కొ జవాబు పత్రానికి ఇంటర్మీడియట్ బోర్డు రూ. 1210 చెల్లిస్తోందని ఇది ఎంత మాత్రం సరిపోదని వారు అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన మూడు మూల్యాంకనం కేంద్రాల్లో శుక్రవారం అధ్యాపకులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తాము కోరుతున్న డిమాండ్లను పరిష్కరించకపోతే శనివారం నుంచి నిరవధికంగా మూల్యాంకనం నిధులకు గైర్వాజరవుతామని వారు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పాలిటెక్నిక్ పరీక్షకు సంబంధించి ఒక్కొ జవాబు పత్రానికి రూ. 10 చెల్లిస్తుండగా హైదరాబాద్ జేఎన్టీయూ ఒక్కొ పత్రానికి రూ. 13 ఇస్తోందని పదవ తరగతి జవాబు పత్రానికి రూ. 6 విశ్వవిద్యాలయంలో జరిగే డిగ్రీ పరీక్షా జవాబు పత్రానికి రూ. 13 ఇస్తున్నారని ఇంటర్ జవాబు పత్రానికి ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఒక్కొ జవాబు పత్రానికి రూ. 30 చెల్లించాని డిమాండ్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కార్పోరేట్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఉద్దేశపూర్వకంగా మూల్యాంకన ప్రక్రియకు అడ్డుతగిలి తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా 9 జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ వేగవంతమైందని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాలుపంచుకొని అనుకున్నదానికన్నా ముందుగా ఫలితాలను ఇవ్వాలన్న ఉత్సాహంతో మూల్యాంకనం చేస్తున్నారని వారు అన్నారు. కార్పోరేట్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియకు అడ్డుతగిలే ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని, ప్రత్యమ్నాయ మార్గాలవైపు కూడా ఇంటర్ బోర్డు దృష్టి సారించిందని వారు వివరించారు. రికార్డు స్థాయిలో అనుకున్న తేదీకన్నా ముందుగానే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.
