(15 Apr) - ద్రవిడర్ కళగం ఆధ్వర్యంలో హేతువాద కార్యక్రమం చెన్నై, ఏప్రిల్ 14: తాళి బానిసత్వానికి చిహ్నమని, దాన్ని తొలగించాలని అంటున్న తమిళనా...
(15 Apr) - ద్రవిడర్ కళగం ఆధ్వర్యంలో హేతువాద కార్యక్రమం చెన్నై, ఏప్రిల్ 14: తాళి బానిసత్వానికి చిహ్నమని, దాన్ని తొలగించాలని అంటున్న తమిళనాడుకు చెందిన హేతువాత సంస్థ ద్రవిడర్ కళగం (డీకే) అనుకున్నట్లుగానే మంగళవారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 6.45 గంటలకే ప్రారంభమైన తాళి తొలగింపు కార్యక్రమంలో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని తమ మెడలోని మంగళసూత్రాలను తీసివేశారు. వాటికి ఉన్న బంగారాన్ని డీకేకు విరాళంగా అందజేశారు. తాళి తీసివేశాక తనకెంతో ఉపశమనం కలిగినట్లుగా ఉన్నదని, ఇన్నాళ్లుగా దీనిని బానిసత్వానికి చిహ్నంగానే చూశానని ఈ సందర్భంగా ఓ మహిళ వ్యాఖ్యానించారు. మెడలో తాళి లేనంతమాత్రాన తనకొచ్చే సమస్యేమీ లేదని అన్నారు. ఇంతలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేయడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. కార్యక్రమం నిలిచిపోయినా.. తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని డీకే అధ్యక్షుడు కే వీరమణి ప్రకటించారు. తాళికి ఎటువంటి మహత్తు లేదని, దానిని తొలగించి బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటూ ద్రవిడర్ కఝగం ఉద్యమం చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తాళి తొలగింపుతోపాటు బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన హిందూ మతవాదులు కోర్టుకు వెళ్లారు. కాగా హైకోర్టు సింగిల్ జడ్జి డీ హరిపరాంతమన్ ఈ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేశారు. కానీ హిందూ మతవాదుల ఒత్తిడి మేరకు సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయటంతో వివాదాలకు చోటుచేసుకోకుండా తాళి తీసివేసే కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దాంతో మంగళవారం సాయంత్రం నిర్వహించాలనుకున్న బీఫ్ ఫెస్టివల్‌ను కూడా డీకే రద్దు చేసుకుంది. మరోవైపు కోయంబత్తూర్‌లో భారత హనుమాన్ సేన అనే హిందూ సంస్థ మహిళలకు ఉచితంగా మంగళసూత్రాలు పంపిణీ చేసింది.