(8 Apr) నల్లగొండ కేంద్రంగా వారం రోజులుగా కాల్పుల మోతలే సూర్యాపేట బస్టాండ్ ఘటన నుంచి ఆలేరు ఎన్‌కౌంటర్ వరకు.. ఆరు రోజుల్లో 11 మంది తూటాలకు ...
(8 Apr) నల్లగొండ కేంద్రంగా వారం రోజులుగా కాల్పుల మోతలే సూర్యాపేట బస్టాండ్ ఘటన నుంచి ఆలేరు ఎన్‌కౌంటర్ వరకు.. ఆరు రోజుల్లో 11 మంది తూటాలకు బలి నలుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్న ప్రజలు నల్లగొండ: వారం రోజులుగా జరుగుతున్న వరుస కాల్పుల ఘటనల నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఒక్కసారిగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా నల్లగొండ పేరే వినిపిస్తోంది. ఐఎస్‌ఐతో సంబంధాలున్న వారు, సిమి ఉగ్రవాద సంస్థకు చెందిన కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరుగుతున్న కాల్పుల తో నల్లగొండపైనే అందరి దృష్టి పడింది. ఆరు రోజుల వ్యవధిలో ఐదు చోట్ల వినిపించిన కాల్పుల చప్పుళ్లు జిల్లా ప్రజల గుండెల్లో తీవ్ర ఉత్కంఠ, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిగిన నాటి నుంచి, జానకీపురం ఎన్‌కౌంటర్, ఆలేరు సమీపంలో వికారుద్దీన్ గ్యాంగ్‌ను హతమార్చే వరకు అడుగడుగునా సంచలనమే. ఈ ఘటనల్లో మొత్తం 11 మంది హతమయ్యారు. అందులో నలుగురు పోలీసులుండగా, ఏడుగురు కరుడుగట్టిన తీవ్రవాదులు కావడంగమనార్హం. ఏ రోజు ఏం జరిగింది? ఏప్రిల్ 1 అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో ఈనెల 1వ తేదీ అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో సంచలన సంఘటన జరిగింది. సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులపై దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దుండగులు యథేచ్ఛగా బస్టాండ్ నుంచి వెళ్లిపోయి బయట రోడ్డుపై మరోసారి కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడి చేశారు. అందులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసు శాఖ కలవరపడింది. ఏప్రిల్ 2 పోలీసులనే కాల్చిచంపిన ఘటన పరిస్థితుల్లో యావత్ పోలీస్ యంత్రాంగం దృష్టి జిల్లాపైనే పడింది. హోంమంత్రి నుంచి డీజీపీ వరకు జిల్లాలో పర్యటించి ఘటనాస్థలాన్ని, చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించి వెళ్లారు. దుండగులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. పోలీసులపై కాల్పులు జరిపింది దారిదోపిడీ దొంగలా, సుపారీ హత్యలు చేసేవారా? లేక ఇంకెవరైనా అనే కోణంలో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఏప్రిల్ 3 ఘటన ఎవరు చేశారన్నది నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. ఎస్‌ఐబీ రంగంలోనికి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పెద్ద ఎత్తున ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ పోలీసులు జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలను జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఏప్రిల్ 4 ఇక, అత్యంత సంచలన ఘటన జరిగింది ఈ రోజే. సూర్యాపేట ఘటన తర్వాత రెండు రోజుల పాటు దాక్కున్న దుండగులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఈ విషయం అటు పోలీసులకు, ఇటు ప్రజలకు తెలియడంతో జిల్లాలో హల్‌చల్ అయింది. ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైన ఎపిసోడ్ ఎనిమిదిన్నర గంటలకు దుండగులను కాల్చిచంపడంతో ముగిసింది. ఈ మధ్యలో దుండగులు ప్రయాణించిన 22 కిలోమీటర్ల దూరం అడుగడుగునా ఉత్కంఠను కలిగించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా జరిగిన ఈ ఎపిసోడ్‌లో దుండగులు మూడుసార్లు పోలీసులపై కాల్పులు జరిపారు. ఒక వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కెళ్లారు. అకస్మాత్తుగా ఎదురువచ్చిన పోలీసులపై విరుచుకుపడి ఒక కానిస్టేబుల్‌ను, ఎస్‌ఐను చంపి.. చివరకు పోలీసుల చేతుల్లో హతమయ్యారు. ఆ రోజే వీరు దోపిడీ దొంగలు కాదని, అత్యంత ప్రమాదకరమైన కరడుగట్టిన సిమి ఉగ్రవాదులని పోలీసుల నిర్ధారణలో తేలింది. ఏప్రిల్ 5 ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దుండగులు చనిపోగా, మరో దుండగుడు కూడా ఉన్నాడన్న వార్తలు జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నిద్రపట్టనివ్వలేదు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. మరోవైపు ఎన్‌ఐఏ, ఏటీఎస్, ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తును విస్తృతం చేశారు. హతమైన వారు వదిలివెళ్లిన ఆధారాలతో పాటు, మిగిలిన దుండగుడి కోసం పోలీసులు అర్వపల్లి గుట్టలను, తుంగతుర్తి నియోజకవర్గాన్ని జల్లెడ పట్టారు. కూంబింగ్‌లో దుండగులకు సంబంధించిన బ్యాగ్, మూడు సెల్‌ఫోన్‌లు లభించాయి. ఏప్రిల్ 6 ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారు సిమి ఉగ్రవాదులని తేలడంతోపాటు వారు అర్వపల్లి దర్గాకు వెళ్లారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు సంస్థలు సందర్శించాయి. సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌పై ఆరాతీశాయి. చనిపోయిన వారిలో ఒకరైన ఎజాజుద్దీన్ మృతదేహాన్ని ఆయన తండ్రి అజీజుద్దీన్, ఇతర బంధువులు వచ్చి తీసుకెళ్లారు. 7 ఏప్రిల్ రోజు రోజుకూ మళ్లీ సాఫీ పరిస్థితులు నెలకొంటున్నాయనుకుంటున్న దశలో ఒక్కసారిగా జిల్లా ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు ఆలేరు వద్ద ఎన్‌కౌంటర్‌లో చంపారనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో జిల్లా వాసులు మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగిందా అని నిశ్చేష్టులు కావాల్సిన పరిస్థితి నెలకొంది.