(19 Apr) -విదేశాలకు పంపిస్తామని లక్షల వసూలు -నకిలీ వీసాలని తేల్చిన ఎంబసీ - లబోదిబో మంటున్న బాధితులు వరంగల్, : వరంగల్ జిల్లా ...
(19 Apr) -విదేశాలకు పంపిస్తామని లక్షల వసూలు
-నకిలీ వీసాలని తేల్చిన ఎంబసీ
- లబోదిబో మంటున్న బాధితులు
వరంగల్, : వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ వీసా రాకెట్ నడుస్తోంది. వరంగల్ నగరం నుంచి కలకత్తా వరకు ఈ నకిలీ వీసా రాకెట్ ముఠా తమ కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వరంగల్‌కు చెందిన పది మంది యువకులను కెనడా దేశం పంపిస్తామని నమ్మించిన ముఠా ఒక్కొక్కరి దగ్గర రూ.10 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. హన్మకొండకు చెందిన కొంకీస సచిన్ గౌడ్ అనే వ్యక్తి ఈ ముఠా కీలక నాయకుడిగా సమాచారం. తన తండ్రి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత స్థాయి ఉద్యోగి అని, తమ సోదరులు సైతం విదేశాల్లో ఉన్నారని సచిన్ యువకులను నమ్మించాడు. వరంగల్ నుంచే కాకుండా హైద్రాబాద్, ఇతర జిల్లాల్లోనూ ఇతడి బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు ఇంకా నాలుగు రోజులు గడువుండగా ఈ ఘరానా మోసగాడు తమ సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అప్పటికే అన్ని సర్దుకుని విదేశాలకు వెళ్శేందుకు సిద్దంగా ఉన్న యువకులు ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు. తీరా అతడిని కలిస్తే, ఏదో చిన్న సాంకేతిక లోపమంటూ బుకాయించే యత్నం చేశాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సచిన్ గౌడ్ ఇచ్చిన వీసాలను పరీక్షించారు. సంబంధిత అధికారులు ఈ వీసాలు చెల్లవని తేల్చేశారు. దీంతో మోసపోయామని నిర్ధారించుకున్న యువకులు ఎట్టకేలకు సచిన్‌ను నిలదీశారు. 'నేనేం చేస్తా.. నేనే మోస పోయాను..' అని అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరింత రెట్టించి అడగ్గా 'ఏమనుకుంటున్నారో, నా సంగతి తెలియదు. పోలీసులు, రాజకీయ నాయకులు నా వెనుక ఉన్నారు. మీరు ఎక్కడికెళ్లినా నన్నేమి చేయలేరు'' అంటూ అతడు బెదిరించాడు. దీంతో కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు.
