(19 Apr) లోకేశ్వరం, భైంసా: గ్రామంలో పది రోజులుగా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలన్నా తపనతో రాత్రి పూట గ్రామస్థులు గస...
(19 Apr) లోకేశ్వరం, భైంసా: గ్రామంలో పది రోజులుగా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలన్నా తపనతో రాత్రి పూట గ్రామస్థులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కన్పించిన ఇద్దరు వ్యక్తులను దొంగ అనుకొని గ్రామస్థులు చితకబాదిన ఘటన లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్లో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు భైంసా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనతో కలిసి ఉన్న మరో మహిళకు పోలీసులు చికిత్స చేయించారు. ముథోల్ సీఐ గణపతిజాదవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం జోహార్‌పూర్ గ్రామానికి చెందిన రాపాని మల్లేశ్(35) ఇదే గ్రామానికి చెందిన వనితతో కలిసి అబ్దుల్లాపూర్ గ్రామం వైపు శుక్రవారం రాత్రి వచ్చారు. తమ గ్రామంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో కాపలాగా ఉన్న గ్రామస్థులు వీరిని చూసి మరికొందరికి సమాచారం ఇచ్చారు. ఇరువురిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్థులు మూకుమ్మడిగా దాడిచేశారు. విషయాన్ని కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. లోకేశ్వరం ఎస్సై దీకొండ రమేశ్ తన సిబ్బందితో కలిసి వెళ్లి గ్రామస్థులను అక్కడినుంచి పంపించారు. గాయపడ్డ మల్లేశ్‌ను హుటాహుటిన 108 అంబులెన్సులో భైంసా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మల్లేశ్ శనివారం ఉదయం మృతిచెందాడు.గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు గ్రామంలో శుక్రవారం మహిళా సంఘాల సభ్యులకు ఎస్బీహెచ్ అధికారులు రుణాలు అందజేశారు. ఆ సమయంలో మల్లేశ్ బ్యాంకు సమీపంలో కన్పించడం చూసి కొందరు గ్రామస్థులు అనుమానంతో రాత్రికి కాపలా కాశారు. గ్రామస్థుల చేతిలో గాయపడి మృతిచెందిన మల్లేశ్‌పై లోకేశ్వరంతో పాటు నియోజకవర్గంలోని ముథోల్, కుంటాల, పక్క జిల్లాలలోని నందిపేట, ఆర్మూర్, కోరుట్ల తదితర పోలీసుస్టేషన్లలో ఇదివరకే పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో అరెస్టయి శిక్ష కూడా అనుభవించాడు. అతడి ఆచూకీ కోసం కొన్ని రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు.మల్లేశ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామస్థులను విచారించారు. నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, ముథోల్ సీఐ గణపతి జాదవ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భైంసా ఆసుపత్రిలో ఉన్న కుటుంబసభ్యులను విచారించారు. అనంతరం గ్రామానికి వచ్చి గ్రామస్థులను జరిగిన సంఘటనపై ఆరా తీశారు. గ్రామస్థుల దాడిలో గాయపడి మల్లేశ్ మరణించినట్లు కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ముథోల్ సీఐ గణపతిజాదవ్ తెలిపారు