దుస్తులు మార్చుకునే గది వద్ద ఏర్పాటుగుర్తించిన స్మృతి ఇరానీ పనాజి: గోవాలోని ఓ ప్రముఖ వస్త్రదుకాణంలో దుస్తులు మార్చుకొనే గది వద్ద ఏ...
- దుస్తులు మార్చుకునే గది వద్ద ఏర్పాటుగుర్తించిన స్మృతి ఇరానీ
పనాజి: గోవాలోని ఓ ప్రముఖ వస్త్రదుకాణంలో దుస్తులు మార్చుకొనే గది వద్ద ఏర్పాటు చేసిన రహస్య కెమెరాను కేంద్ర మంత్రి స్మృతిఇరానీ బయటపెట్టడం సంచలనం సృష్టించింది. స్థానిక భాజపా ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దుకాణంలోని నలుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. భర్తతోపాటు గోవాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న స్మృతి శుక్రవారం కాండోలిమ్లోని 'ఫ్యాబ్ఇండియా' దుకాణంలో దుస్తుల కొనుగోలుకు వెళ్లారు. ఈ సందర్భంగా దుకాణంలో దుస్తులు మార్చుకొనే.. 'ట్రయల్' గది దిశగా ఓ కెమెరా అమర్చి ఉండటాన్ని గమనించి, తన భర్త జుబిన్ఇరానీని అప్రమత్తం చేసినట్లు ఎస్పీ ఉమేష్గావోంకర్ తెలిపారు. తర్వాత ఆమె ఎమ్మెల్యే లోబోను పిలిచినట్లు చెప్పారు. రహస్య కెమెరా రికార్డు చేసిన వాటిలో అభ్యంతరకర దృశ్యాలున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలిగా స్మృతి, మరో మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు చెప్పారు. మొత్తం డేటాను విశ్లేషిస్తున్నామన్నారు. అరెస్టయిన నలుగురిని పరేష్భగత్, రాజుపయాంచే ప్రశాంత్నాయక్, కరీంలఖానీలుగా గుర్తించారు. శనివారం ఫ్యాబ్ఇండియా సీఈవో, ఎండీతోపాటు ఉన్నతాధికారులందరినీ ప్రశ్నించనున్నట్లు క్రైంబ్రాంచి ఎస్పీ కార్తీక్కాశ్యప్ తెలిపారు.ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన లోబో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు మేనేజర్ కార్యాలయంలోని కంప్యూటర్లో నిక్షిప్తమవుతున్నాయన్నారు. అందులో ట్రయల్ గదిలో పలువురు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు ఉన్నట్లు చెప్పారు. హార్డ్డిస్కు, కంప్యూటర్ను తనిఖీ చేసినప్పుడు పొట్టపై భాగం నుంచి దృశ్యాలు రికార్డు అవుతున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు దుకాణాన్ని మూసివేసి, తనిఖీలు చేపట్టి.. ట్రయల్గదికి ఎదురుగా ఓ గోడపై అమర్చిన సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అన్ని దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామని తెలిపారు. బెంగళూరులో ఉన్న గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ.. తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రత కోసం కెమెరాలు ఏర్పాటు చేశామనీ, ట్రయల్ గదుల్లో కాదనీ, వాటిలోని దృశ్యాలను బంధించలేవని ఫ్యాబ్ఇండియా ఎండీ విలియం బిస్సెల్ వివరించారు. ఈ ఆరోపణలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయనీ, పోలీసులతో సహకరిస్తామని ఫ్యాబ్ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
