(4 Apr) 5 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు ఒప్పందం నేడు హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష గణపురం రూరల్, ఏప్రిల్ 3: మొదటిసారి భూపాలపల్లి...
(4 Apr) 5 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు ఒప్పందం నేడు హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష
గణపురం రూరల్, ఏప్రిల్ 3: మొదటిసారి భూపాలపల్లి కోల్బెల్ట్ నుంచి కర్ణాటక జెన్కోకు బొగ్గు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. 5 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి, కర్ణాటక జెన్కో మధ్య అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్టు కంపెనీల టెండర్లకు రెండు మూడు రోజుల్లో అనుమతులురానున్నాయి. భూపాలపల్లిలో మొత్తం 13వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా కేటీపీపీకి 6 వేల మెట్రిక్ టన్ను ల బొగ్గును సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇతర కంపెనీలకు విక్రయిస్తుండగా 5వేల టన్నుల బొగ్గు ప్రతీ రోజు నిల్వ ఉంటుంది. గడిచిన నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సింగరేణి యాజమాన్యం బొగ్గు సరఫరాకు ఇతర రాష్ర్టాలపై దృష్టి సారించింది. దీంతో కర్ణాటకలోని రాయచూర్, పర్లీ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసేందుకు కర్ణాటక జెన్కోతో పలుమార్లు చర్చలు జరిపింది. దీంతో 5లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కర్ణాటక జెన్కో ముందుకొచ్చింది. ట్రాన్స్పోర్టు కంపెనీల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. భూపాలపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉప్పల్ వరకు బొగ్గును తీసుకెళ్లి అక్కడినుంచి రైలు మార్గం ద్వారా కర్ణాటకకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జెన్కో యాజమాన్యం అప్రమత్తమైంది. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో రెండో దశ 600మెగావాట్ల ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే ప్రతీరోజు 15నుంచి 17వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరముంటుంది. దీంతో భూపాలపల్లి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వలు కర్ణాటకకు తరలిపోతుండటంతో తమకు 50లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరముంటుందని, తమ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరా చేయాలని జెన్కో ఉన్నతాధికారులు సింగరేణి అధికారులతో చర్చలు జరిపారు. ఏటా 20లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సింగరేణి, జెన్కోకు సరఫరా చేస్తుండగా, అదనంగా మరో 30లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కావాలని నేడు హైదరాబాద్లో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో సింగరేణిని కోరనుంది. ఇదిలా ఉండగా కర్ణాటక జెన్కోకు సరఫరాచేసే బొగ్గు ద్వారా సింగరేణికి టన్నుకు రూ.2100 సమకూరనుంది. అదే సమయంలో కేటీపీపీకి సరఫరా చేస్తున్న ఇ గ్రేడ్ బొగ్గును రూ.1663లకే అందిస్తోంది. దీంతో ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తేనే సంస ్థకు లాభాలు పెరిగే అవకాశం ఉందని సింగరేణి భావిస్తోంది.
