(8 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 7: అశోకచక్రంలోని మూడు సింహాలు చట్టం, ధర్మం, న్యాయాలకు ప్రతిరూపాలైతే కన్పించని ఆ నాలుగో సింహామే పోలీసు అంటూ సినిమ...
(8 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 7: అశోకచక్రంలోని మూడు సింహాలు చట్టం, ధర్మం, న్యాయాలకు ప్రతిరూపాలైతే కన్పించని ఆ నాలుగో సింహామే పోలీసు అంటూ సినిమాల్లో హిరోలు డైలాగులు దంచేస్తారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు గానీ, ప్రస్తుతం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి నెలకొన్న పరిస్థితుల్లో కన్పించని సిసి కెమెరే నాలుగో సింహామనేది ముమ్మాటికీ నిజం. ఇందుకు ఇప్పటి వరకు నగరంలో జరిగిన పలు నేరాలు, ఘోరాలు, హత్యలు, కిడ్నాప్‌లకు సంబంధించి పోలీసు ఫుటేజీలే దర్యాప్తుకు కీలకంగా మారుతున్నాయి. గతంలో సిసి కెమెరాలు అందుబాటులో లేనపుడు పోలీసులు గల్లీగల్తీల్లో గస్తీ నిర్వహించి పరిస్థితులను పర్యవేక్షించేవారు. అంతేగాక, తమతో స్నేహపూర్వకంగా మెలిగే వారిని, పలు నేరాలకు పాల్పడి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పోలీసులు తమకు విశ్వసనీయవర్గాలుగా వినియోగించేవారు. కానీ గతంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో పోలీసు వ్యవస్థకు క్రమంగా ఇన్ఫార్మర్లు అనే వారు తగ్గుతూనే ఉన్నారు. అంతేగాక, అప్రదిష్టపాలైన ఈ వ్యవస్థను నేడు పోలీసులు, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నమ్మలేని పరిస్థితులు తలెత్తాయి. కానీ ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కడ, ఎం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికపుడు పసిగట్టేందుకు పోలీసులకు బ్లూకోట్స్, ఆధునిక జిపిఎస్ వ్యవస్థతో కూడిన వాహనాలను సమకూర్చినా, నేటికీ వారికంటూ ప్రత్యేకంగా సమాచారం చేరవేసే వ్యవస్ధేలేదు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యామ్నాయంగా సిసి కెమెరాల ఫుటేజీపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. సిసి కెమెరాల నిఘా, వాటి ఫుటేజీలు సరైన ఫలితాల్వివటంతో నగరంలో మున్ముందు మరో వెయ్యి సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు మహానగర పాలక సంస్థ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిన సంగతి తెలిసిందే! నగరంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసు మొదులకుని వాహనాల దొంగతనాల్ని కూడా సిసి కెమెరాల ఫుటేజీ సహాయంతోనే పోలీసులు ఛేదించారు. కొద్దిరోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో కలకలం సృష్టించిన సూర్యాపేట బస్ స్టేషన్లో దుండుగలు పోలీసులపై జరిపిన కాల్పులకు ఘటనకు సంబంధించి కూడా పక్కనే ఉన్న ఓ వ్యాపార సంస్థ సిసి కెమెరాల ఫుటేజీల సహాయంతోనే నిందితులను గుర్తించగలిగారు. అంతేగాక, కెబిఆర్ పార్కులో కొద్ది రోజుల క్రితం ఉదయం పూట అరబిందో ఫార్మసీ ఉపాధ్యక్షుడు నిత్యానందరెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేశ్ ఎకె 47తో జరిపిన కాల్పుల కేసును కూడా కొలిక్కి తెచ్చిన ఘనత సిసి కెమెరాలదే! అంతేగాక, ఈ కేసులో మరో కీలక మలుపు కూడా సిసి కెమెరాల ద్వారానే వెలుగు చూసింది. ఓబులేశ్ కాల్పులు జరిపిన ఏకె 47 ఆర్మూర్ రిజర్వుడ్ నుంచి దొంగిలిచిన క్లిప్పింగ్‌లు కూడా పోలీసులకు ఎంతో ఉపయోగపడ్డాయి. కొద్దిరోజుల క్రితం పట్టపగలు పాతబస్తీలోని ఓ నగల వ్యాపారిని గతంలో అతని వద్ద పనిచేసిన ఓ సిబ్బంది, మరికొందరు వ్యక్తులతో కలిసి రివాల్వర్‌తో బెదిరించిన ఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఈ ఫుటేజీల సహాయంతో కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఛేదించారు. అలాగే నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మెడికల్ షాపు నిర్వాహకుడి కుమారుడు సంజిత్ కిడ్నాప్ కేసులో కూడా ఈ ఫుటేజీలు పోలీసులకు ఎంతో సహకరించాయి. అంతేగాక, చైన్ స్నాచింగ్‌లు చేస్తూ బైక్‌లను దొంగతనం చేస్తూ మాజీ హోంగార్డు సిసి కెమెరాలకు చిక్కిన ఉదంతం కూడా ఉంది. దీంతో పాటు పోలీసు వర్గాల్లో తీవ్ర స్థాయిలో కలకలం రేపిన ఓ ఇన్స్పెక్టర్ రాసలీలను బయటపెట్టిందీ ఈ సిసి కెమెరాలే.