సూర్యాపేట కేంద్రంగా నల్లగొండ జిల్లాలో ఉగ్ర యుద్ధం..!

బస్టాండ్‌లో మొదలైన కాల్పులు..  అర్వపల్లిలో పూర్తి ఇద్దరు ముష్కరులు హతం..  కానిస్టేబుల్‌ వీర మరణం..  రెండు గంటల హైడ్రామా..  రెండు...

బస్టాండ్‌లో మొదలైన కాల్పులు.. 
అర్వపల్లిలో పూర్తి ఇద్దరు ముష్కరులు హతం.. 
కానిస్టేబుల్‌ వీర మరణం..
 రెండు గంటల హైడ్రామా.. 
రెండు రోజుల వేటకు తెర..
 వారు ఉగ్రవాదులు కాదు.. దొంగలంటున్న డీజీపీ, హోం మంత్రి 
దోపిడీలు, పేలుళ్లలో నిందితులు.. 
సిమీతో సంబంధాలు వెల్లడి 
టెర్రరిస్టుల జిహాద్‌ నినాదాలు 
బృందాలుగా వేటాడిన పోలీసులు 
క్రూరంగా ముష్కరుల ఎదురుదాడి 
ఎదురు కాల్పుల్లో దిగిన తూటాలు
 సీఐకి స్వల్ప గాయాలు మొరాయించిన సీఐ తుపాకీ
 చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఎస్సై , అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య 
వాళ్లు దొంగలు కాదు..! జిహాదీ ఉగ్రవాదులు! 
అందుకే సూర్యాపేట బస్టాండులో పోలీసులపై కాల్పులు జరిపారు! 
ఆయుధంతో పారిపోయారు! ఇక్కడి నుంచే వేట మొదలైంది! ముష్కరులు ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందనే దానిపై పోలీసులు పక్కాగా అంచనా వేశారు! వారి అంచనాకు తగినట్లే ముష్కరులు అర్వపల్లి గుట్టల్లోని దర్గాకు చేరారు! శనివారం ఉదయం శ్రీరాంసాగర్‌ కాల్వకట్టపై నడవడం ప్రారంభించారు! ఇక్కడి నుంచి కాల్పుల హోరు మొదలైంది! ఇటు ఉగ్రవాదులను.. అటు పోలీసులను అదృష్టం, దురదృష్టం వెంటాడాయి! తుంగతుర్తి సీఐ గంగారాం తుపాకీ మధ్యలో మొరాయించకుండా ఉండి ఉంటే, పోలీసుల తరఫున ప్రాణ నష్టం లేకుండానే 'ఆపరేషన్‌' పూర్తయ్యేది! కానీ, దురదృష్టం వెంటాడింది! ఉగ్రవాదులపై పోరులో కానిస్టేబుల్‌ నాగరాజు మరణిస్తే.. ఎస్‌ఐ సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతున్నాడు. కానీ, పట్టువిడవని పోలీసుల దాడిలో ఇద్దరు ముష్కరులూ హతమయ్యారు! మెదడులో బుల్లెట్‌తో ఎస్సై సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతుంటే.. ఆయన భార్య ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మోత్కూరు, ఏప్రిల్‌ 4: ముష్కరులు చచ్చారు! ఇద్దరు పోలీసులను బలి తీసుకుని... మరో కానిస్టేబుల్‌నూ చంపి... చివరికి పోలీసుల చేతిలోనే చచ్చారు! తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సూర్యాపేట కాల్పుల' కారకుల కథను పోలీసులు ముగించారు. వారిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అస్లాం అయూబ్‌, జకీర్‌గా గుర్తించారు. వీరు ఉత్తుత్తి దొంగలు కాదని... ఉగ్రవాదులే అని ప్రాథమికంగా నిర్ధారించారు. సూర్యాపేటలో ఒక కానిస్టేబుల్‌ను, ఒక హోంగార్డును బలితీసుకున్న వైనాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగమంతా దుండగుల వేటలో నిమగ్నమైంది. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్వయంగా సూర్యాపేటలోనే మకాం వేశారు. కాల్పులు జరిపిన దుండగులు జిల్లా సరిహద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దుండగుల వద్ద కార్బైన్‌ గన్‌తోపాటు మరిన్ని ఆయుధాలు ఉండటం... దుస్తులకు రక్తపు మరకలు అంటడంతో వారు జనం మధ్యకు రాలేరని, సోదాల నేపథ్యంలో బస్సుల వంటి వాహనాలూ ఎక్కలేరని అంచనాకు వచ్చారు. పోలీసుల అంచనా అక్షరాలా నిజమైంది! సూర్యాపేట బస్టాండులో కాల్పులు జరిపిన అనంతరం... దుండగులు రకరకాల దారులు పట్టారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి గుట్టల్లోకి వచ్చి పడ్డారు. బహుశా... ఒక రోజంతా అక్కడే మకాం వేశారు. గుట్టల సమీపంలోనే ఖాజా నసీరుద్దీన్‌ దర్గా ఉంది. శుక్రవారం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. రాత్రి అక్కడే నిద్ర చేస్తారు. దుండగులు కూడా అక్కడికి వచ్చే అవకాశముందని పోలీసులు అనుమానించారు. ఎస్పీ స్వయంగా అర్వపల్లి పీఎస్‌లో మకాం వేశారు. వీరు అనుకున్నట్లుగా... ముష్కరులిద్దరూ దర్గాకు వచ్చారు. శనివారం తెల్లవారగానే మెల్లగా బయట పడ్డారు. అర్వపల్లి నుంచి సీతారాంపురం గ్రామంలోని శ్రీరాంసాగర్‌ కాల్వకట్ట వెంట నడవడం మొదలుపెట్టారు. వీరిని భూమయ్య అనే స్థానికుడు గమనించారు. ఆ ప్రాంతానికి కొత్తవారు కావడం, హిందీలో మాట్లాడుతుండటంతో అనుమానించారు. నేరుగా... తుంగతుర్తి సీఐ గంగారాంకు సమాచారం అందించారు. దీంతో ఆయన హోంగార్డును పంపి విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. తాత్కాలిక అదృష్టం... హోంగార్డు నుంచి సమాచారం అందగానే... సీఐ గంగా రాం తన బలగంతో ఓ ప్రైవేటు వాహనంలో హుటాహుటిన తరలివచ్చారు. ముష్కరులు 'ముప్పు' పసిగట్టారు. పోలీసులను చూసీచూడగానే వారిపై కాల్పులు జరిపేందుకు తగిన స్థలం కోసం వెతుక్కున్నారు. అంతలోనే... సీఐ గంగారాం తన తుపాకీకి పని చెప్పారు. అయితే... పోలీసులకు గురి కుదరకుండా ముష్కరులు తమ వద్దఉన్న శాలువాలను పోలీసుల వాహనంపైకి విసిరేశారు. శ్రీరాంసాగర్‌ కాల్వలోకి దూకి... నేలపై పడుకుని పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇటు... సీఐ గంగారాం ఐదు రౌండ్లు కాల్పులు జరపగానే ఆయన వద్ద ఉన్న తుపాకీ స్ట్రక్‌ అయిపోయింది. అటువైపు... దుండగుల వద్ద కార్బైన్‌ గన్‌తోపాటు నాటు తపంచాలతో రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు వెనుకడుగు వేశారు. దీంతో... ముష్కరులకు అదృష్టం కలిసి వచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్తున్నామో తెలియకుండానే ముష్కరులు అర్వపల్లి గ్రామం చేరుకున్నారు. బైక్‌పై వెళ్తున్న బింగి లింగమల్లు అనే వ్యక్తి మెడకు తుపాకీ పెట్టి... అతడికి చెందిన 'డిస్కవరీ' బైక్‌ను లాక్కున్నారు. అర్వపల్లి నుంచి తిరుమలగిరి మండలం మాణిక్యతండా మీదుగా అనంతారం వరకు వెళ్లారు. అక్కడ బైక్‌లో పెట్రోల్‌ పోసుకొని చిర్రగూడూరు మీదుగా బిక్కేరు వాగునుంచి తాటిపాముల వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫైనల్‌ ఎటాక్‌... శ్రీరాంసాగర్‌ కాల్వ వద్ద జరిగిన తొలి విడత దాడి తర్వాత పోలీసులు 'హై అలర్ట్‌' ప్రకటించారు. మోత్కూరు, రామన్నపేట, గుండాల, ఆత్మకూరు (ఎం) పోలీసులు బృందాల వారీగా రంగంలోకి దిగారు. దుండగులు చిర్రగూడూరు నుంచి వెళ్తుండగా స్థానికులు గుర్తించారు. ఈ సమయంలో ఆ ఇద్దరు బిక్కేరు వాగు వద్దకు వెళ్లి దుస్తులు మార్చుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిపైనా దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు నేలపై పడుకొని తప్పించుకున్నారు. దుండగులు అక్కడ కమ్మంపాటి ఉపేందర్‌ అనే వ్యక్తికి చెందిన ప్యాషన్‌ ప్రో బైక్‌ తాళం తీసి జానకీపురం వైపు రయ్యిమని వెళ్లారు. తొలుత... జానకీపురం గ్రామ సమీపాన ఉన్న డొంక దారిలో ఎడ్లబండి, జేసీబీ అడ్డురావడంతో దుండగులు పక్కకు తప్పుకొన్నారు. అంతలోనే ఆత్మకూరు(ఎం) పోలీసుల వాహనం అక్కడికి చేరుకుంది. పోలీసుల వాహనాన్ని చూసిన దుండగులు మళ్లీ కాల్పులు జరిపారు. నడుపుతున్న కానిస్టేబుల్‌ నాగరాజు తలలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ముందు భాగంలో కూర్చున్న ఎస్‌ఐ సిద్ధయ్య... వాహనంలో నుంచే కాల్పులు చేయడం మొదలుపెట్టారు. దుండగులు సైతం ఆయనను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పుల్లో... ఎస్‌ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడి, నిస్సహాయంగా పడిపోయారు. వెనుక సీటులో శివ, మధు, శ్రీనివాస్‌ అనే కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆత్మరక్షణ కోసం సీట్ల మధ్యలో దాక్కున్నారు. దుండగులు బైక్‌ దిగి నేరుగా పోలీసుల వాహనం వద్దకు వచ్చారు. 'మీ ఆయుధాలు ఇవ్వండి' అంటూ బెదిరించారు. ఆ పోలీసుల అదృష్టంకొద్దీ... అంతలోనే... రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి వాహనం అక్కడకు చేరుకుంది. దీంతో దుండగులు అటువైపు దృష్టి సారించారు. సీఐ వాహనం దిగగానే దుండగులు ఆయనపైనా కాల్పులు జరిపారు. అదే సమయంలో సీఐ ఎదురు కాల్పులు జరిపారు. ఈలోపు... ఆత్మకూరు పోలీసుల వాహనంలో ఉన్న కానిస్టేబుళ్లు ఒక్కసారిగా వాహనం డోర్‌ తీసి గట్టిగా నెట్టారు. దానికి సమీపంలోనే ఉన్న దుండగులు కింద పడ్డారు. ఇదే అదనుగా మధు అనే కానిస్టేబుల్‌ ఒక్క ఉదుటున జీపులోనుంచి దూకి... దుండగుల మీద పడ్డాడు. సీఐ బాలగంగిరెడ్డి, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు జరిపిన కాల్పుల్లో... ఇద్దరు దుండగులు హతమయ్యారు. అప్పటికి... సమయం ఉదయం 8.10 గంటలు! వేట ముగిసింది. వీరి నుంచి నుంచి సూర్యాపేటలో అపహరించిన కార్బైన్‌ను, రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య, సీఐ బాలగంగిరెడి హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు అస్లాం అయూబ్‌, జకీర్‌ల మృతదేహాలకు నల్లగొండలో పోస్టుమార్టం నిర్వహించారు. మిగిలిన వారు ఎక్కడ? ఎంత మంది? సూర్యాపేట: ఇద్దరు దుండగులు హతమయ్యారు.. మిగిలిన వారు ఏమయ్యారు? 1వ తేదీన సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడింది ముగ్గురని ప్రత్యక్షసాక్షుల కథనం. ఎన్‌కౌంటర్‌ మృతుల వద్ద 2వ తేదీన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించిన రైలు టికెట్‌ లభ్యమైంది. అంటే సూర్యాపేటలో దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మరో వ్యక్తి తోడయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు దుండగుల ఎన్‌కౌంటర్‌తోనే కథ సుఖాంతం కాలేదని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ముఠాలో మరో ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో అర్వపల్లి గుట్టల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం మధ్యాహ్నం నుంచి గుట్టలను జల్లెడపడుతున్నారు. నల్లగొండ జిల్లా ప్రస్తుతం పోలీసు దిగ్బంధంలో ఉంది. జిల్లా నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. చివరి దాకా ఎదురుదాడే... అస్లాం అయూబ్‌, జకీర్‌ ఇద్దరూ... చివరి నిమిషందాకా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. 'ఎంతమందినైనా చంపాలి' అనే వైఖరే వారిలో కనిపించింది. ఈ ప్రాంతం వారికి పూర్తిగా కొత్త కావడమొక్కటే వీరికి 'మైనస్‌ పాయింట్‌'. మిగిలిన ప్రతి అడుగూ దూకుడుగానే వేశారు. ఇటువైపు... ముష్కరుల ఉగ్రవాద లక్షణాలు, కార్బైన్‌ గన్‌ వంటి ఆయుధం ఉండటం, చంపేందుకు ఏమాత్రం వెనుకాడకపోవడంతో పోలీసులు మొదటి నుంచి జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. చివరికి... యాదృచ్ఛికంగానో, ప్రణాళికబద్ధంగానో ఒకేసమయంలో రెండు బృందాలు రావడం, బహుశా తూటాలు అయిపోవడంవల్ల దుండగులు కొద్దిసేపు వెనక్కి తగ్గడం పోలీసులకు కలిసి వచ్చింది. తూటాలు అయిపోతున్నందుకే కావొచ్చు... ప్రతి చోటా పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు ముష్కరులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎవరీ ఇద్దరూ..! జకీర్‌ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా వాసి. అతడి తండ్రి ఇసుక వ్యాపారి. అతడు పదో తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత తాపీ పని నేర్చుకుని కొన్నాళ్లపాటు తాపీ మేసీ్త్రగా పనిచేశాడు. 2008లో.. నిషేధిత సిమి కార్యకర్త అయినందుకు, ఫేక్‌ సిమ్‌కార్డు ఉన్న నేరానికి పోలీసులు ఇతణ్ని మొదటిసారి అరెస్టు చేశారు.ఆ తర్వాత యాదవ్‌ అనే కానిస్టేబుల్‌ హత్యకేసులో ఇతడి పేరు వినిపించింది. 2011లో సింగ్‌ అనే మరో కానిస్టేబుల్‌ హత్యకేసుకు సంబంధించి అరెస్టు చేశారు. ఇక.. అస్లాం కూడా ఖాండ్వా వాసి. అతడు ఎనిమిదో తరగతి దాకానే చదువుకుని.. జకీర్‌లాగానే తాపీ పని చేశాడు. 2011లో జకీర్‌తో కలిసి కానిస్టేబుల్‌ హత్యకేసులో అరెస్టయ్యాడు. అతడి తండ్రి అయూబ్‌ మొదట్లో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. అస్లాం 2005 నుంచి సిమి కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అర్వపల్లిలో జిహాద్‌ నినాదాలు! సూర్యాపేట, ఏప్రిల్‌ 4: జిహాద్‌.. జీనాహైతో ఏక్‌దిన్‌.. మర్‌నాహైతో ఏక్‌దిన్‌(చావుకైనా బతుక్కైనా ఒకే రోజు).. ఎన్‌కౌంటర్‌కు కొద్ది నిమిషాల ముందు ఆయూబ్‌, జకీర్‌లు అర్వపల్లి మండల కేంద్రం నడిబొడ్డున చేసిన నినాదాలివి. తాపీగా నడుస్తూ.. తుపాకులు పైకి చూపుతూ.. 'అల్లా హో అక్బర్‌.. జిహాద్‌' అని నినదిస్తూ.. 'దుకాణ్‌ బంద్‌ కరో, అందర్‌ చలే జావ్‌' అంటూ దుకాణదారులను హెచ్చరిస్తూ కొద్దిసేపు అర్వపల్లిలో హల్‌చల్‌ చేశారు. వీరు చేసిన నినాదాలు.. నిర్భయంగా సంచరించిన తెగింపు.. పోలీసులపై కాల్పులకు తెగబడటం.. ఆయుధాలను ఉపయోగించిన తీరు.. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన పోలీసులు వీరి ఉగ్రమూలాలపై ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే, హనుమాన్‌ జయంతి వంటి సునిశిత కార్యక్రమాల నేపథ్యంలో వీరి నేరచరిత్రపై గోప్యత పాటించినట్లు తెలుస్తోంది. విషమ స్థితిలో ఎస్సై సిద్దయ్య అదే ఆస్పత్రిలో ఆయన భార్యకు కాన్పు.. పండంటి మగబిడ్డ జననం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: దుండగులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నాలుగు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎస్సై సిద్దయ్య.. భర్త పరిస్థితి విషమంగా ఉందని తెలిసి నిలువునా కృంగిపోయి ఆస్పత్రిపాలైన ఆయన భార్య ధరణీష..!! తొమ్మిది నెలల గర్భిణి అయిన ధరణీష శనివారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చారు. భార్య, భర్త, బాబు.. ఇప్పుడు ఒకే (ఎల్బీనగర్‌లోని కామినేని) ఆస్పత్రిలో ఉన్నారు. సిద్దయ్యకు ధరణీషతో ఏడాది కిందట వివాహమైంది. తర్వాత మూడు నెలలకు ఆమె గర్భం దాల్చారు. ఈ నెల 5న కాన్పు అవుతుందని వైద్యులు డేట్‌ ఇచ్చారు. కానీ, ఎన్‌కౌంటర్‌లో భర్త తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమాచారం తెలుసుకున్న భార్య ధరణీష ఆందోళనతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను వెంటనే ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే ఆపరేషన్‌ చేసి కాన్పు చేయాలా? సహజంగా వచ్చే పురిటినొప్పులు వచ్చే వరకూ వేచి చూడాలా అని ఆలోచించిన వైద్యులు.. కుటుంబసభ్యుల అనుమతితో ఆమెకు శస్త్రచికిత్స చేసి పురుడు పోశారు. ఇదీ నేపథ్యం.. కడప జిల్లాకు చెందిన ఎస్సై సిద్దయ్య కుటుంబం కొన్నేళ్ల కిందటే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. అతనికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఒకరు వ్యవసాయం చేస్తుండగా.. మరొకరు కర్నూలులో వ్యాపారం చేస్తున్నారు. 3 బుల్లెట్ల తొలగింపు.. ఎస్సై సిద్దయ్యకు మెదడు, తల, ఛాతీ, పొట్ట భాగాల్లో బుల్లెట్లు గుచ్చుకోగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి మూడు తూటాలను తొలగించారు. మెదడులో ఉన్న మరొక బుల్లెట్‌ను తొలగిద్దామంటే.. విపరీతంగా రక్తస్రావం అవుతుండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆ బుల్లెట్‌ తొలగింపు సమస్యగా మారిందని.. దాన్ని తొలగిస్తేగానీ ఏమీ చెప్పలేమని పేర్కొంటున్నారు. ఆదివారంగానీ, సోమవారం గానీ మెదడులోని బుల్లెట్‌ తొలగింపు కోసం శస్త్ర చికిత్స చేయనున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి 8.30 గంటల వరకూ సిద్దయ్యకు 35 యూనిట్ల రక్తం ఎక్కించినట్లు పేర్కొన్నారు. బతకాలని ప్రార్థిస్తున్నాం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మా తమ్ముడు దోపిడీ దొంగలను దైర్యంగా ఎదురుకొని వీరోచితంగా పోరాడినందుకు సంతోషంగా ఉంది. తను తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చాడు. మా తమ్ముడు బతకాలనిదేవుణ్ని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం కూడా మా కుటుంబాన్ని ఆదుకోవాలి. సిద్దయ్యకు పూర్తిగా చికిత్స అందేలా చూడాలి. -దస్తగిరి, సిద్దయ్య అన్న సార్‌తో ఉంటే సేఫ్‌! సిద్దయ్య కోసం.. 15 మంది పోలీసుల 'రక్తదానం' ఆత్మకూరు (ఎం), ఏప్రిల్‌ 4: ఎస్సై సిద్దయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుసుకున్న పలువురు పోలీసులు.. ఆయన ఉన్న 'కామినేని'కి వెళ్లారు. 'రక్తం బాగా పోతోంది. దానివల్ల చికిత్స కష్టం అవుతున్నది' అని చెప్పడంతో అప్పటికప్పుడు 15 మంది పోలీసులు రక్తమిచ్చి.. ఆయన్ను బతికించుకొనేందుకు సిద్ధమయ్యారు. సిద్దయ్య ప్రొబెషనరీ ఎస్‌ఐగా సర్వీసులోకి వచ్చి మూడేళ్లు. సిబ్బందితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో ఉంటే 'సేఫ్‌' అని వారికి భరోసా ఏర్పడింది. జానకీపురం దాడిలోనూ.. సిద్దయ్య ముందుండి టీమ్‌ను నడిపించారని సహ పోలీసులు గుర్తు చేసుకొన్నారు. ఇక.. 'సిద్దయ్యకు అంత కష్టం వచ్చిందా! చిన్నప్పటినుంచీ కష్టపడే తత్వం ఉన్న మనిషి'' అని జడ్చర్ల ప్రజలు కళ్లు వొత్తుకున్నారు. ''పోలీసు అవుతానని చెప్పి..పట్టుదలతో సాధించాడని యువకులు గుర్తు చేసుకొన్నారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: సూర్యాపేట కేంద్రంగా నల్లగొండ జిల్లాలో ఉగ్ర యుద్ధం..!
సూర్యాపేట కేంద్రంగా నల్లగొండ జిల్లాలో ఉగ్ర యుద్ధం..!
http://3.bp.blogspot.com/-6aaSmURPprA/VSB8A9fbu5I/AAAAAAAAE3M/AlIVZL4NrWw/s1600/350x350_IMAGE38062787.png
http://3.bp.blogspot.com/-6aaSmURPprA/VSB8A9fbu5I/AAAAAAAAE3M/AlIVZL4NrWw/s72-c/350x350_IMAGE38062787.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_30.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_30.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy