(15 Apr) - 19 మంది జనరల్ మేనేజర్ల బదిలీ.. మరికొంతమందికి తప్పని స్థానచలనం సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో భారీ ప్రక్...
(15 Apr) - 19 మంది జనరల్ మేనేజర్ల బదిలీ..
మరికొంతమందికి తప్పని స్థానచలనం
సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో భారీ ప్రక్షాళనకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సింగరేణి సంస్థ వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా మరింత ఎత్తుకు ఎదగాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా భారీ బదిలీలతో అంతర్గత కుదుపునకు సీఎండీ ఎన్ శ్రీధర్ తెరతీశారు. దీంతో ఇన్నేండ్లుగా రాజకీయ పెద్దల అండదండలతో ఏండ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం), జనరల్ మేనేజర్ (జీఎం)లపై బదిలీవేటు తప్పలేదు. వాస్తవానికి ప్రతి రెండు, మూడేండ్లకు స్థానచలనం జరగాల్సి ఉన్నా గతంలో సింగరేణిలో రాజకీయనేతల మితిమీరిన జోక్యం కారణంగా ఎక్కడివారు అక్కడే కొనసాగుతూ వచ్చారు. జనవరిలో కొత్త సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. అందరూ బాధ్యతలు నిర్వహించాల్సిందే. ముందు మీరు పనిచేసి ఫలితాలు చూపండి.. ఎవరూ హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసుకుగానీ, కొత్తగూడెం ప్రధాన కార్యాలయానికి రావాల్సిన అవసరంలేదు. మీకు సమస్యలుంటే నేనే మీ ముందుకు వస్తాను, సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను అని సీఎండీ శ్రీధర్ ఇచ్చిన భరోసా సింగరేణి కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మైనింగ్ ఏరియాల్లో పనిచేస్తున్న కార్మికులతో సీఎండీ నేరుగా మాట్లాడటం, రోజువారీగా పురోగతులను సమీక్షించడంతో గత మూడుమాసాల్లో సింగరేణి కార్మికులు ఉద్యమ స్ఫూర్తితో బొగ్గు ఉత్పత్తులు సాధించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తులు సాధ్యమయ్యాయి. అంతేకాకుండా ఇప్పటివరకు అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చిన ఒకరిద్దరు కార్మిక నేతలపై తీసుకున్న తీవ్రమైన చర్యలు సింగరేణి అధికారుల్లో మరింత మనోధైర్యాన్ని పెంచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు ప్రారంభం నుంచే సీఎండీ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి 19 మంది చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎం), జనరల్ మేనేజర్ల (జీఎం)కు స్థానచలనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బదిలీల నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, వెంటనే సంస్థ డైరెక్టర్లకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొత్త జీఎం (కో-ఆర్డినేషన్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహారావుకు జీఎం (బిజినెస్ డెవలప్మెంట్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.