(12 Apr) హైదరాబాద్: అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నా...
(12 Apr) హైదరాబాద్: అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధ్యక్షతన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అమరుల ఆత్మీయ సమ్మేళనంలో ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్కులను శనివారం మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరవీరుల తల్లులు అడిగిన అన్ని విజ్ఞప్తులను సిఎం దృష్టికి తీసుకుపోయి అవి అమలు అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. పది లక్షల నగదుతో పాటు సాగు చేసుకోవడానికి భూమి, విద్యార్హతను బట్టి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగ అవకాశం, విద్య, వైద్యం విషయాలలో సహాయం, ఇళ్ల స్థలాలు తదితర అవకాశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందన్నారు. ఎంపి మల్లారెడ్డి, తనకున్న విద్యా సంస్థలలో అమరుల కుటుంబాల్లో చదువునే వారికి పూర్తిగా విద్యను ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరుడు సాయిగణేష్ తల్లి శశికళ విజ్ఞప్తి మేరకు ఆమె భర్తకు వైద్య సేవలు అందించడానికి సిఎం దృష్టికి తీసుకుపోతానన్నారు. ఎంపి చామకూరమల్లారెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని తన వంతుగా తన విద్యా సంస్థలలో వారి కుటుంబ సభ్యుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అమరులకు పది లక్షల నగదుతో పాటు ఐదు ఎకరాల భూమి, ఇళ్ల స్థలాలు, విద్య వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్వి ప్రభాకర్ మాట్లాడుతూ భారత్ స్వాతంత్య్ర పోరాటాన్ని, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మనం చూడలేదు, పాల్గొనలేదు, కాని తెలంగాణ సాధనలో మనం భాగస్వాములం అయ్యామని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్‌చారి తాను ఉండే రామాంతాపూర్లోనే నివాసం ఉండేవాడని అటువంటి వారి త్యాగాలతో తెలంగాణ స్వప్నం సాకారం అయిందన్నారు. శ్రీకాంత్‌చారి ఆత్మహత్య చేసుకొనే రోజే తనకు ఫోన్ చేసి ఈరోజు తెలంగాణ కోసం సంచలనం జరగబోతుంది ప్రభాకరన్నా అని చెప్పి చివరకు తాను తెలంగాణ చూడకుండానే అమరుడు అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగం ఫలం, కేసిఆర్ రాజీలేని పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం అయిందన్నారు. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటుందని, ఎన్ని లక్షలు ఇచ్చినా తల్లుల గర్భశోకాన్ని తీర్చలేమన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా అమరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఎక్కడా రాజీపడకుండా చర్యలు తీసుకుంటున్నారని ఇంకా కొంతమందికి ఈ సహాయం అందాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, సంజీవరావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు చరిత్రలో నిలిచిపోతారని భౌతికంగా మన మధ్యన లేకున్నా వారి ఆశయాలు ఎప్పటికీ ఆదర్శంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ అమరులను ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయం అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అప్పటి ప్రతిపక్ష నాయకురాలు, బిజెపి సీనియర్ నేత సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం బలిదానాలు చేయొద్దని బతికి తెలంగాణ సాధించుకొని కళ్లారా చూడాలని ఆమె నాటి పార్లమెంట్లో మద్దతు తెలిపిన సందర్భంలో విఙప్తి చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, అమరుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకోవడానికి వచ్చిన అమరుల కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులను తలచుకుని రోదించారు. అమరులైన తమ కొడుకు, సోదరుడు, తండ్రి, మనవడిని తలచుకుని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదలించింది. కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, నేతలు సైతం వారిని చూసి కంత తడిపెట్టారు. సహాయం అందుకున్నప్పుడు కూడా తమ వారు గుర్తుకు వచ్చి స్టేజిపై రోదించడంతో పలువురు వారిని ఓదార్చారు. వారి త్యాగఫలితం గానే తెలంగాణ వచ్చిందని, వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.