దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి, సీఐ, ఎస్.ఐలకు గాయాలు హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద శనివారం ఉదయం ఎన్...
దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి, సీఐ, ఎస్.ఐలకు గాయాలు
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండగుల కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందగా, సీఐ బాలగంగిరెడ్డి, ప్రొబేషనరీ ఎస్.ఐ సిద్ధయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సీఐ, ఎస్ఐలను హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దుండగులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా నిర్థరించారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్రమ్ అయూబ్, జాకీర్ బద్రూన్‌గా గుర్తించారు.దుండగులకోసం ఉదయం నుంచి కొనసాగిన వేటనల్గొండ జిల్లా సీతారాంపురం దర్గా వద్ద దోపిడీ దొంగలు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. దుండగులు పోలీసులపై కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. వీరి మధ్య 6 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత మండల కేంద్రమైన అర్వపల్లి చేరుకున్న ఇద్దరు దుండగులు లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని జనగాం వైపు పరారయ్యారు. పోలీసులు వెంబడించడం గమనించిన దుండగులు డి.కొత్తపల్లి గుట్టల్లోకి పరారయ్యారు. పోలీసులు డి.కొత్తపల్లి చేరుకోవడంతో అక్కడి నుంచి మోత్కూరు మండలం జానకీపురం వెళ్లారు. జానకీపురంలో పోలీసులు, దుండగుల మధ్యమరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, సీఐ, ఎస్సైలు తీవ్రంగా గాయపడ్డారు.కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40లక్షల సాయం: హోం మంత్రి నాయినిదుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్.ఐలను పరామర్శిచిన అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.40లక్షల సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన దుండగులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు. సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులు కూడా వీరేనని నిర్థరించినట్లు వెల్లడించారు. దోపిడీ దొంగల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.దుండగులు దొంగలే... తీవ్రవాదులు కాదు: డీజీపీఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో మృతిచెందిన దుండగులు దొంగలు మాత్రమేనని, తీవ్రవాదులు కాదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఎస్.ఐ వాహనంలో వస్తుంటే దుండుగులు ఎదురుగా వచ్చి కాల్పులు జరిపారని తెలిపారు. డ్రైవర్ నాగరాజును అతి సమీపం నుంచి కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. సూర్యాపేట కాల్పుల ఘటనతో దుండగులకు సంబంధం ఉందని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు. సూర్యాపేట ఘటనలో దుండగులు లాక్కెళ్లిన కార్బైన్ ఘటనా స్థలంలో లభ్యమైనట్లు చెప్పారు. ఘటనపై ఉగ్రవాదుల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.సీఐ, ఎస్.ఐలకు కామినేనిలో కొనసాగుతున్న చికిత్సఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన సీఐ బాలగంగిరెడ్డి, ప్రొబేషనరీ ఎస్.ఐ సిద్దయ్యలకు హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఎస్.ఐ సిద్ధయ్య తల, ఛాతి, పొట్టభాగాల్లో బుల్లెట్లు దూసుకెళ్లినట్టు వైద్యులు తెలిపారు. సిద్ధయ్యకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వెల్లడించారు. సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
