(14 Apr) - అన్ని పట్టణాలనుంచి హైదరాబాద్‌కు హైటెక్ బస్సులు - ఆర్టీసీ ఉద్యోగులకు ఇక తెలంగాణ ఇంక్రిమెంట్ - ఫైల్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రి క...
(14 Apr) - అన్ని పట్టణాలనుంచి హైదరాబాద్‌కు హైటెక్ బస్సులు - ఆర్టీసీ ఉద్యోగులకు ఇక తెలంగాణ ఇంక్రిమెంట్ - ఫైల్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ - 56వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం.. సంస్థపై ఏటా రూ.18 కోట్ల భారం.. - ఆర్టీసీపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష.. సంస్థ లోగో, బస్సుల డిజైన్‌కు ఆమోదం
హైదరాబాద్, :రాష్ట్రంలోని 60కిపైగా నగరాలు, పట్టణాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు హైటెక్ బస్సులు నడుపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ అధికారులకు సూచించారు. వీటికున్న ఇంద్ర పేరును రాజధానిగా మార్చాలని సూచించారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు తదితరులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సీఎం సంతకం చేశారు. దీనిద్వారా తెలంగాణ ఆర్టీసీలో పనిచేసే 56 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. సంస్థపై ఏటా రూ.18కోట్లఆర్థికభారం పడనున్నది. ఆర్టీసీ లోగో, బస్సుల డిజైన్‌ను ముఖ్యమంత్రి ఆమోదించారు. ఆర్టీసీని కాపాడుకోవాలని సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇదే సమావేశంలో పిలుపునిచ్చారు. వివిధ కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, అధికారులు, ఉద్యోగులు పక్కా ప్రణాళికతో, చిత్తశుద్ధితో పనిచేసి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారానే ఉద్యోగులు మెరుగైన జీవితం గడుపగలరని పేర్కొన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు వేలమందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయని అన్నారు.టీఎంయూ హర్షం: తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతకం చేయడం హర్షణీయమని టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ తిరుపతి, అశ్వత్థామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్టీసీ బంగారు ఆర్టీసీ కావడం ఖాయమని అన్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.