(23 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 22: రంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. గత సంవత్సరంలో కంటే మూడు శాతం అదనం...
(23 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 22: రంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. గత సంవత్సరంలో కంటే మూడు శాతం అదనంగా ఫలితాలు సాధించి రాష్ట్రంలో మొదటిస్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది ద్వితీయ స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా 68 నుండి 71 శాతానికి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుంది. వీరిలో బాలికలదే పైచేయిగా చెప్పవచ్చు. జిల్లాలో 56,234 మంది బాలురు, 47,973మంది బాలికలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా వారిలో 37,595 మంది బాలురు, 35,968మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 67 శాతం బాలురు, 75 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో తొలిస్థానంలో నిలబడ్డారు. గత ఐదేళ్లలో 2010లో 61.22 శాతం ఉత్తీర్ణత సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా తర్వాత నాలుగేళ్లలో అన్ని జిల్లాలతో పోటీపడి 68 శాతానికి ఫలితాలను పెంచుకున్నా గత సంవత్సరం ద్వితీయ స్థానమే దక్కింది. కానీ ఈసారి 71 శాతం ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుని రాష్ట్రంలో తొలిసారి మొదటిస్థానంలో నిలిచింది.కాగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి ఉభయ జిల్లాల ఫలితాలు తలకిందులయ్యాయి. గత సంవత్సరం హైదరాబాద్ సిటీ ఫలితాల్లో ప్రథమ స్థానంలో ఉండగా, ఈ సారి రంగారెడ్డి జిల్లా 71శాతంతో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ సిటీ రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ జనరల్ క్యాటగిరీ పరీక్షకు మొత్తం 104207 మంది విద్యార్థులు హజరుకాగా, ఇందులో 73563 మంది విద్యార్థులు ఉత్తీర్థులు కాగా, జిల్లా ఫలితాల్లో 71శాతం సాధించగలిగారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి మొత్తం 67413 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 38513 మంది అంటే 59శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించటంతో హైదరాబాద్కు ఫలితాల్లో రెండో స్థానం దక్కింది. అలాగే ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల్లో రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 2558 మంది పరీక్షలు రాయగా, వీరిలో 1442 మంది పాసై 56శాతం పాస్ పర్సంటేజీని సాధించి ఈ క్యాటగిరీలోనూ జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. అలాగే హైదరాబాద్ జిల్లా నుంచి వృత్తి విద్యా కోర్సుల ఇంటర్ పరీక్షలకు మొత్తం 3422 మంది హజరుకాగా, వీరిలో కేవలం 1594 మంది అంటే 43శాతం ఉత్తీర్ణత దక్కింది.
