(18 Apr) తాటి, ఈత చెట్ల ప్రమేయం లేకుండానే అందుబాటులో దొరికే నీటిలో హాని కరమైన నిషేధిత పదార్దాలను కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తూ ప్రజ...
(18 Apr) తాటి, ఈత చెట్ల ప్రమేయం లేకుండానే అందుబాటులో దొరికే నీటిలో హాని కరమైన నిషేధిత పదార్దాలను కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజుకు లక్షల లీటర్లను కల్లుపేరున నురగలు కక్కిస్తున్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘాల పేరుతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కమ్మక్కయి కూటమికట్టి కల్తీ కల్లు దందాను జిల్లాలో కొనసాగిస్తున్నారు. మద్యం కంటే చౌకగా లభిస్తున్న కిక్కుతో యువత అనారోగ్యం పాలవుతుండగా కొంతమంది అక్రమ సంపాదనకు కల్లు వ్యాపారాన్ని బంగారు బాతుగా మలచుకుంటున్నారు. జిల్లాలో సాగుతున్న కల్తీ కల్లు తయారీపైన 'ఈనాడు' బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగుచూశాయి.గీత కార్మికులు ఎక్సైజ్‌శాఖ అనుమతులు (లైసెన్సు)లు తీసుకుని ఈత, తాటి చెట్ల నుంచి కల్లు గీసి ఉపాధి పొందాలి. కొంతమంది కల్తీ కల్లును తయారు చేసుకుని మాఫియా తరహాలో దందా సాగిస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్ ఈఎస్ పరిధిలో 63వేల వరకు తాటి, ఈత చెట్లున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఇచ్చోడ, ఉట్నూరు ప్రాంతాల్లో కల్లు డిపోలున్నాయి. మంచిర్యాల ఈఎస్ పరిధిలో 251 సహకార సంఘాలుండగా వాటి పరిధిలో 79,873 ఈత, 20,753 తాటిచెట్లు ఉన్నాయి. 251 కల్లు దుకాణాలుండగా మరో 132 చెట్ల వద్ద బయట విక్రయ కేంద్రాలున్నాయి. రవీంద్రఖని, తాండూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి ప్రాంతాల్లో డిపోలున్నాయి.చేతి వృత్తులను ప్రోత్సహించి ఉపాధి మార్గాలను చూపించే లక్ష్యంతో ప్రభుత్వం గీత పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. వాస్తవానికి తాటి, ఈత చెట్లు ఎక్కడం వచ్చే గీత కార్మికులకు మాత్రమే సభ్యత్వం, లైసెన్సులు ఇవ్వాలి. సంఘంలో సభ్యత్వం పొందిన సభ్యులు ఆ సంఘానికి కేటాయించిన తాటి, ఈత చెట్ల ద్వారా వచ్చే కల్లును తీసుకొచ్చి విక్రయించుకోవాలి. సభ్యులంతా సమష్ఠిగా చెట్లేక్కేవాళ్లు కొందరైతే.. మిగిలిన వాళ్లు డిపోలు, దుకాణాల నిర్వాహణ వంటి పనులను చేపట్టాలి. కల్లు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సభ్యులంతా సమానంగా పంచుకుంటూ ఆర్థికంగా ఎదగాలి. కానీ.. ఇది కాస్త అడ్డదార్లు తొక్కింది. చెట్ల నుంచి వచ్చే కల్లు సరిపోదని డిపోల్లోనే కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. దీన్ని దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. నీటిలో మత్తుపదార్ధాలు కలిపి కల్లు తయారు చేయడం సులువైన మార్గం కావడంతో బడాబాబులు కూడా ఇదే వ్యాపారంలో చేరిపోతున్నారు. చెట్లు ఎక్కడం, కల్లుగీయడం తెలియని రాజకీయ నేతలు, వ్యాపారులు కూడా లాభాల రుచిమరగడంతో ఈ వ్యాపారం మత్తులో మునిగితేలుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూలీలను తీసుకొచ్చి వారికి నెలవారీ వేతనాలిచ్చి కల్లు గీయిస్తున్నారు. దీని వల్ల అసలైన గీతకార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. డిపోల్లోనే కృత్రిమంగా కల్లు తయారు చేస్తూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ పలు మార్లు అసలైన గీత కార్మికులు ఫిర్యాదు చేసినా వారి గోడు ఆలకించేవారే లేకపోయారు.డిపోల్లో కల్లు తయారీ రాను రాను దారుణంగా మారింది. అందుబాటులో దొరికే నీటిలో మత్తు పదార్థాలను కలిపి కల్లు తయారు చేస్తున్నారు. వెయ్యి లీటర్ల తొట్టెల్లో 50లీటర్ల అసలైన కల్లు పోసి వాటిల్లో శాక్రీన్‌పొడి, ఆల్ఫజోలం, యూరియా, వైట్‌పౌడర్, డైజోఫామ్, క్లోరోఫామ్, కుంకుడుకాయ రసంతో కల్లు తయారు చేస్తున్నారు. ఇలా తయారైన కల్తీ కల్లు గల్లీగల్లీలో అమ్ముడవుతోంది. కల్లు తయారీలో వాడే ఆల్ఫజోలం, డైజోఫామ్, క్లోరోఫామ్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ప్రాణాలను హరించేవి కావడంతో వాటిని నిషేధించారు. అయినా.. మహారాష్ట్ర నుంచి విచ్చలవిడిగా జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు ఇదే పనిగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. కల్లు తయారీ కేంద్రాల వద్ద కనీస శుభ్రత పాటించడంలేదు. ఇది మనుషుల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.* ఆదిలాబాద్ పట్టణంలోలో ఉన్న గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో ఆరు దుకాణాలున్నాయి. బడికి, గుడికి 100మీటర్ల దూరంలో కల్లు విక్రయించడానికి వీల్లేకున్నా.. ఆ నిబంధనలేవీ పట్టించుకోలేదు. గుడికి సమీపంలోనే డిపోను ఏర్పాటు చేశారు. ఇళ్ల మధ్యలోనే డిపో ఏర్పాటు చేయడంతో కల్లు వాసనకు తట్టుకోలేక స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. ఆ డిపోకు సావర్‌గాం, జైనథ్, బాదీ, జైనథ్, అడేగాం ప్రాంతాల్లో తాటి చెట్లను కేటాయించారు. ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కల్లును డిపో ద్వారా పట్టణంలోని ఆరు దుకాణాల ద్వారా విక్రయించాలి. కానీ.. జన్నారం నుంచి కల్లు తెస్తున్నట్లు మాయమాటలు చెబుతూ పెద్దపెద్ద తొట్లలో నీళ్లుపోసి దాని ద్వారా కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. వాస్తవానికి సావర్‌గాం, జైనథ్ ప్రాంతాల్లో తాటిచెట్లే లేకున్నా.. అక్కడ చెట్లను కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బస్టాండుకు సమీపంలో ఉన్న ఓ దుకాణ నిర్వాహకుడిని సంప్రదించగా రోజుకు 200 పెట్టెలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దుకాణంలోనే రూ.30వేల కల్లు వ్యాపారం సాగితే మిగిలిన దుకాణాలను కలిపిదే దాదాపు రూ.2లక్షల వరకు వ్యాపారం సాగుతోంది. పట్టణంలోని కేఆర్‌కే కాలనీల్లో ఏర్పాటు చేసిన దుకాణాల పరిధిలో ఆరుబయట, చెట్ల కిందనే కల్లు తాగుతున్నారు. మద్యం కంటే కల్లు చౌకగా లభిస్తుండటంతో ఎక్కువ మంది యువత కల్తీ కల్లుకు బానిసలవుతున్నారు.* నిర్మల్ పట్టణంలోని గీత పారిశ్రామిక సహకార సంఘం పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తాటి, ఈత చెట్లు ఎక్కడం రాకున్నా.. కల్లు గీయడం తెలియని వారు సైతం సంఘంలో సభ్యులుగా చేరారు. ఇక్కడి డిపో పరిధిలో 12కల్లు దుకాణాలుండగా.. ఎటువంటి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాలకు బీరవెల్లి, చించోలి, మాసాయిపేట, ఎల్లంపల్లి, లింగాపూర్, నర్సాపూర్, తాండ్ర గ్రామాల్లో ఈత చెట్లును కేటాయించారు. ఆ చెట్ల ద్వారానే పట్టణంలో ఉన్న అన్ని దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ.. ఇక్కడ మాఫియా తరహాలో కల్లు వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. నేతలు, వారి బంధువులు సైతం వ్యాపారంలో నిమగ్నమయ్యారు. మత్తుకోసం కలుపుతున్న పదార్ధాల వల్ల పలువురు అనారోగ్యం బారిన పడటమే కాకుండా మృత్యువాత పడ్డారు. ఆబ్కారి అధికారులు దాడులు చేసి పలు మార్లు కేసులు నమోదైనా రాజకీయ అండదండలతో తప్పించుకుంటున్నారు. ఫిర్యాదు చేసిన వారిపైన బెదిరింపులకు పాల్పడుతున్నారు.* భైంసా ప్రాంతంలోనూ కల్తీ కల్లు తయారీ భారీగా సాగుతోంది. ఇక్కడి సంఘం పరిధిలో ఆరు కల్లు దుకాణాలున్నాయి. వాటికి పంగ్రీ, బామిని వంటి గ్రామాల్లోని తాటి చెట్లను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో చెట్లనుంచి కల్లు తయారు కాకున్నా.. కృత్రిమంగానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో దుకాణంలోనే రోజుకు దాదాపు 500సీసాలకు పైగా విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి వాటి ద్వారానే కల్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనారోగ్యం బారిన పడ్డారు. అయినా.. ఇక్కడి అక్రమాలను అరికట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. బాసర పుణ్యక్షేత్రంలోనూ కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగడం కొసమెరుపు.* తానూరు, దిలావర్‌పూర్, లోకేశ్వరం, ముథోల్, మామడ, కుంటాల, ఖానాపూర్, కడెం ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నాయి. మంచిర్యాల ఈఎస్ పరిధిలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్, లక్సెట్టిపేట, చెన్నూరు ప్రాంతాల్లోనూ కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నాయి.వాస్తవానికి కల్లు దుకాణాలపైన ప్రతి నెలా టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆబ్కారీ అధికారులు దాడులు చేయాలి. విక్రయిస్తున్న కల్లు నమూనాలను సేకరించి అప్పటికప్పుడు పరీక్షించాలి. రసాయనాల పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌కు పంపాలి. అయితే.. అధికారులకు భారీగా మామూళ్లు ఇవ్వడంతో ఎవరూ నిజాయితీగా వ్యవహరించడంలేదు. తూతూ మంత్రంగా నమూనాలను సేకరించినట్లుగా చూపుతన్నారు. తాటి, ఈత చెట్లు లేకున్నా.. భారీగా కల్తీ కల్లు తయారు చేస్తున్న విషయం తెలిసినా అధికారులు స్పందించడంలేదు. కోరల్ హైడ్రేట్ 58కిలోలు, డైజోఫామ్ కేజీ పట్టుకున్నట్లు ఆబ్కారి అధికారులు పేర్కొనడం గమనార్హం. పలు ప్రాంతాల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నా మామూళ్లతో వాటిని వెలుగుచూడనివ్వడంలేదు. ఆబ్కారి శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల దిలావర్‌పూర్ మండలం నార్సాపూర్ గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదుల విభాగానికి వచ్చి పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. కల్తీ కల్లుతో అనేక మంది యువత చనిపోతున్నారని.. దేవాలయాల పక్కనే కల్లు విక్రయించడం ఇబ్బందికరంగా మారిందని.. దానిని మూసేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన దేశెట్టి భోజవ్వ దీన గాథ ఇది. ఈమె భర్త భోజన్న కల్తీ కల్లుతాగి మృత్యువాత పడ్డారు. ఫిర్యాదు చేసినా పోలీసు స్టేషను గడప దాటకుండానే కేసు మాయం చేశారు. పెద్దదిక్కును కోల్పోవడంతో ఇప్పుడు ఆ కుటుంబం వీధినపడ్డంది. ఇప్పుడు కూతురు దీక్షతో కలిసి తల్లి బీడీలను చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కల్తీ కల్లు వల్లే తన భర్త చనిపోయినా.. ఎవరూ ఆదుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా కల్తీ కల్లు బారిన పడి రోడ్డున పడ్డ బోజవ్వలాంటి కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నా.. వాటిని వెలుగు చూడకుండానే అధికారులు మామూళ్లతో మటుమాయం చేస్తున్నారు.మత్తుకోసం కల్లులో క్లోరల్ హైడ్రేట్స్, డైజోఫాం, ఆల్ఫాజోలం వంటి వాటిని కలిపిన కల్లును తాగడం వల్ల దానికి బానిసలుగా తయారవుతారు. చురుకుదనం తగ్గిపోవడమే కాకుండా ఆలోచన శక్తి కూడా తగ్గిపోతోంది. కాలేయం, మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఎముకలపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మోతాదు ఎక్కువైతే ప్రాణాలు కూడా పోతాయి.కల్లు దుకాణాలపైన దాడులు నిర్వహిస్తున్నాం. నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నాం. రసాయన పరీక్షల నిమిత్తం నమూనాలను నిజామాబాద్‌కు పంపుతున్నాం. కల్తీ చేసినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. నిర్మల్ ప్రాంతంలో ఇప్పటికే కొన్నింటిని సీజ్‌చేశాం. మా శాఖనే కాకుండా టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్స్ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు.కల్తీ కల్లు తయారీ, విక్రయాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రజల ప్రాణాలతో ఆటలాడితే ఏమాత్రం వూరుకోం. ఈ విషయంపైన డీసీతో మాట్లాడి వివరాలను సేకరిస్తాను. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి కల్తీ, కృత్రిమ కల్లు తయారీ కేంద్రాలపైన చర్యలు తీసుకుంటాం