దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రామలి...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రామలింగరాజు, రామరాజులకు 7 సంవత్సరాల శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించింది. సుదీర్ఘ వాదానల అనంతరం రాజుతో పాటు మరో 10 మంది నిందితులు ఆర్థిక నేరానికి పాల్పడింది వాస్తవమేనని సీబీఐ దర్యాప్తులో తేలినందున కోర్టు తుది తీర్పు వెలువరించింది.
ఈ కేసులో నిందితులైన మరో ఎనిమిది మంది వడ్లమాని శ్రీనివాస్, తూళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, సత్యనారాయణరాజు, గోపాలకృష్ణన్, ప్రభాకర్‌గుప్తా, శ్రీశైలం, వెంకటపతిరాజులకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 25లక్షల రూపాయల జరిమానా విధించింది.
మదుపుదారుల నష్టంతో కలిపి సుమారు 14వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. రామలింగరాజుతో పాటు ఇతర నిందితులు ఈ కుంభకోణం ద్వారా సుమారు 2743 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాధించినట్లు సీబీఐ నిర్ధారించింది.
ఇప్పటికే రామలింగరాజు 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. దోషులను చర్లపల్లి జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసు పూర్వాపరాలు
* 2009లో సత్యం కంపెనీకి సంబంధించిన కుంభకోణం బయటపడింది.
* అదే సంవత్సరం జనవరి 9న సీఐడీ రంగప్రవేశం... రామలింగరాజుపై కేసు నమోదు... అరెస్టు.
* ఐపీసీ 120బి, 420, 409, 419, 467, 477, 477ఎ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు.
* 2009 ఫిబ్రవరి 16న ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు
* విచారణకోసం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా బీపీఎల్ఎన్ చక్రవర్తి నియామకం
* సుమారు 33 నెలల జైలు జీవితం అనంతరం 2011 నవంబర్ 4 సత్యం రాజుకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు
* ఈ కేసులో మొత్తం 226 మందిని సీబీఐ విచారించింది
* 14 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేల్చింది
* సత్యం రాజు, ఇతర దోషులు మొత్తం 2743 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు నిర్దారించింది.
అసలు సత్యం కుంభకోణంలో ఏం జరిగింది?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంపూటర్స్ కుంభ కోణం అసంస్థ అధినేత రామలింగ రాజుకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. దేశానికే మచ్చ తెచ్చిన సత్యం కుంభకోణం పూర్వా పరాలు పరిశీలిస్తే... 1987లో సత్యం కంపూటర్స్ ను రామలింగరాజు స్థాపించారు. ప్రపంచంలో మేటి సంస్థల్లో ఒకటిగా సత్యం ఆనతి కాలంలోనే ఏదిగింది.
అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాదు వస్తే ఆయన పక్కన సత్యం రాజు కూర్చున్నాడంటే దాని విలువ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు దశాబ్ద కాలం పాటు సాప్ట్ వేర్ రంగాన్ని ఏలిన సత్యం కథ 2008 చివరి నాటికి ముగిసింది.
2008 డిసెంబర్లో తన కుమారుల సంస్థ మేటాస్‌ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. 1987లో ప్రారంభించిన సత్యం కంపూటర్స్ సంస్థకు రామలింగరాజు 2009 జనవరి 9 వరకు ఛైర్మన్ గా కొనసాగారు. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా రంగాలకు చెందిన మేటాస్ ను రామలింగరాజు కుమారులే నిర్వహించేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్‌కి బాగా బూమ్ ఉండటంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ వచ్చిన నిధులను మేటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేర్లకు మంచి రేటు వస్తుంది. అందుకే అకౌంటింగ్ కుంభకోణానికి తెరతీశారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు చూపారు.
తర్వాత అనుకోకుండా ఆర్థిక సంక్షోభ ప్రభావంతో రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి. అటు తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునేందుకు నిధులూ లేకుండా పోయాయి. దీంతో మేటాస్ సంస్థను సత్యం కంప్యూటర్స్ లో విలీనం చేసేందుకు రామలింగరాజు ప్రయత్నించారు. ఇందుకోసం దాదాపు రూ. 10 వేల కోట్ల సత్యం కంప్యూటర్స్ నిధులను లాభాల్లేని రియల్ ఎస్టేట్ కంపెనీ మెటాస్ లోకి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో సత్యం ఇన్వెస్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడే పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకోసం రామలింగ రాజు ఇలా చేయాల్సి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం జరిగింది. తీగ లాగితే డొంక కదిలింది. సత్యం రాజు అసలు విషయం ఒప్పుకోక తప్ప లేదు. 2009 జనవరి 9 న రామలింగ రాజు అరెస్టయ్యారు. అనంతరం సత్యం కంపూటర్స్ ను మహింద్రా కంపెనీ కొనుగోలు చేసి టెక్ మహీంద్రగా పేరు మార్చింది. అప్పటి సత్యమే ఇప్పటి టెక్ మహీంద్ర.
