(4 Apr) ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం ఆమరణ దీక్షకు దిగిన మరో నేత బోనకల్, ఏప్రిల్ 3: పార్టీలో సరైన గుర్తింపు లేదన్న క...
(4 Apr) ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం ఆమరణ దీక్షకు దిగిన మరో నేత
బోనకల్, ఏప్రిల్ 3: పార్టీలో సరైన గుర్తింపు లేదన్న కారణంగా టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కార్యకర్తలు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రదాన భూమిక పోషించిన తనకు పార్టీలో గుర్తింపు లేదన్న ఆవేదనతో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నక్క దుర్గయ్య ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అల్లాదుర్గంలోని పటేల్ చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించాల్సిన మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్ అనుకోని కారణాల వల్ల గైర్హాజరయ్యారు. దీంతో స్థానిక ఎంపీపీ పనులను ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో నక్క దుర్గయ్య జోక్యం చేసుకుని తాను ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, రాష్ట్ర ఏర్పాటు కోసం సెల్‌టవర్ ఎక్కి ఉద్యమం చేస్తే తనలాంటి కార్యకర్తలను గుర్తించకుండా నిన్న....మొన్న పార్టీలో చేరిన వారికి విలువను ఇస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. ఆ తర్వాత డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ కరీమాబాద్లోనూ ఇదే తరహాలో బూత్ కమిటీ అధ్యక్షుడిగా తనను నియమించనందుకు టీఆర్ఎస్ కార్యకర్త గోకారపు రఘుపతి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని 14వ డివిజన్లో బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 176వ బూత్ కమిటీ ఎన్నికలు చేపట్టారు. ఈ కమిటీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న రఘుపతి తీవ్రంగా యత్నించాడు. ఆయన ప్రత్యర్ధి వర్గం అందుకు అడ్డుపడింది. దీనితో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. పరిస్థితి చేయిజారిపోయేట్టు ఉండడంతో పరిశీలకులుగా వచ్చిన వారు ఎన్నికను వాయిదా వేసారు. శుక్రవారం ఉదయం తిరిగి నిర్వహించిన ఎన్నికల్లో 176 బూత్ కమిటీ అధ్యక్షుడిగా తనును కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారినే నియమించినందుకు రఘుపతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అగ్రహంతో కరీమాబాద్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారిని విస్మరించి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీనుంచి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా బోనకల్లో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మండెపూడి శ్రీనివాస్ శుక్రవారం ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముందువచ్చిన చెవుల కన్నా.. వెనుక వచ్చిన కొమ్ములే ఎక్కువ అన్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
