ఒ కపక్క జలవనరులను కాపాడుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్...

ఒకపక్క జలవనరులను కాపాడుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. పుష్కర పనుల మాటున గోదావరి నది నుంచి విలువైన ఇసుకను అక్రమంగా కొల్లగొడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మామడ, లక్ష్మణచాంద మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకాసురులు యథేచ్ఛగా తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.సాధారణంగా సామాన్యుల విషయంలో కఠినంగా ఉండే నిబంధనలు పెద్దోళ్లకు వెసులుబాటు కల్పిస్తాయి. దీనికి నిదర్శనం మామడ మండలం కమల్‌కోట్ గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ దందా. నిబంధనల ప్రకారం వాగులో, నదిలో పొక్లయిన్ సాయంతో ఇసుకను తవ్వి తీయడం నిషిద్ధం. కానీ ఇక్కడ యథేచ్ఛగా నిర్విరామంగా పొక్లయిన్, జేసీబీల సాయంతో ఇసుక తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇక్కడినుంచి తరలించి సమీపంలోని మైదాన ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఎవరైనా ఇదేంటని అడిగితే పుష్కరాల పనులు చేపట్టడానికని బదులిస్తున్నారు. ఒకవేళ పుష్కరాల పనులకే అయినా సంబంధిత గుత్తేదారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంత ఇసుక అవసరం.. ఏ ఏ వాహనాల్లో తీసుకెళ్తారు తదితర వివరాలను సమర్పించి అనుమతి పొందాలి. వాటి ఆధారంగా ఎక్కడినుంచి ఇసుక తెచ్చుకోవాలో సూచిస్తూ అధికారులు అనుమతులు జారీ చేస్తారు. ఇవేమీ లేకుండానే ఇక్కడ ఇసుక తవ్వకం, రవాణా సాగుతోంది. నదిలోకి వాహనాలు సులభంగా వచ్చి వెళ్లేందుకు ప్రత్యేకంగా రహదారిని సైతం ఏర్పాటు చేశారంటే ఎంత పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.అయితే ఇక్కడ ఇసుకను యధేచ్ఛగా దోపిడీ చేయడానికి నిదర్శనం.. గోదావరి నదిలో ఇసుకను తీసుకెళ్లేందుకు గుత్తేదారుకు నగదు చెల్లించాల్సిందే. ఇసుకను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, వెళ్తున్న వాహనాల వివరాలను ఎప్పటికప్పుడు సదరు గుత్తేదారుకు సంబంధించి పలువురు నమోదు చేసుకుంటున్నారు.మామడ, లక్ష్మణచాంద మండలాల్లోని గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న వ్యక్తి ఓ ప్రజాప్రతినిధికి బంధువు కావడంతోనే అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూలు ప్రజానీకం ఏదైనా అవసరం కోసం తట్టెడు ఇసుకను తరలించాలన్నా సవాలక్ష కారణాలతో అడ్డంకులు సృష్టించే అధికారగణం ప్రజాప్రతినిధి బంధువు విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఒకవేళ పుష్కరాల పనులకు ఇసుకను తరలిస్తున్నారనుకున్నా.. మైదాన ప్రాంతంలో దీన్ని కుప్పలుగా నిల్వచేయాల్సిన అవసరంలేదు. పైగా నదిలో పొక్లయిన్‌తో తవ్వాల్సిన అగత్యం అంతకన్నా లేదు. ఇప్పటికైనా నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగిస్తున్న ఇసుక దందాపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పుష్కర ఘాట్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను గోదావరి నది నుంచి తీసుకెళ్లాల్సి వస్తే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి పత్రంలో ఎక్కడ నుంచి తీసుకెళ్తారు.. ఎంత మొత్తంలో తీసుకెళ్తారనే విషయం స్పష్టంగా ఉండాలి. నది నుంచి ఇసుక తీయడానికి ఎలాంటి దరఖాస్తులు రాలేదు. అనుమతి లేకుండా నది నుంచి ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం.